– స్పోర్ట్స్ స్కూల్స్, అకాడమీల ప్రవేశాలపై శాట్స్ చైర్మెన్
నవతెలంగాణ-హైదరాబాద్: క్రీడా రంగంలో ఆధునిక మార్పులను అధ్యయనం చేస్తూ పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకోవాలని, ఇక నుంచి రాష్ట్రంలోని క్రీడా పాఠశాలలు, స్పోర్ట్స్ అకాడమీల్లో ప్రవేశాలపై ఉన్నతస్థాయి సెలక్షన్ కమిటీలు ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మెన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. స్పోర్ట్స్ స్కూల్స్, అకాడమీల పని తీరు, మెరుగుదలపై వరుసగా రెండో రోజు సమీక్ష సమావేశం నిర్వహించిన శాట్స్ చైర్మెన్.. అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘క్రీడా పాఠశాలలు, అకాడమీల పురోగతికి నిరంతర పర్యవేక్షణ అవసరం. స్పోర్ట్స్ స్కూల్స్ పతక విజేతల ప్రాంగణాలుగా రూపుదిద్దుకోవాలి. శిక్షణ, పనితీరులో మూస ధోరణి వీడనాడాలి. అంతర్జాతీయ స్థాయిలో ఆధునిక మార్పులను అధ్యయనం చేస్తూ మన పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకోవాలి. స్కూల్స్, అకాడమీలకు ఎంపికపై నిపుణులతో కూడిన సెలక్షన్ కమిటీ అవసరం. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. స్టూడెంట్ అథ్లెట్లకు రెగ్యులర్ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, హెల్త్ ప్రోఫైల్ సిద్ధం చేయాలి. అకాడమీలలో అవసరమైన క్రీడా సామాగ్రి అందుబాటులో ఉంచాలి. కోచ్‌లు, కిట్ల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి’ అని ఆంజనేయ గౌడ్ అన్నారు.
ఎల్బీ స్టేడియంలో శాట్స్ చైర్మెన్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఓఎస్‌డి డాక్టర్ కె. లక్ష్మీ, డిప్యూటీ డైరెక్టర్ చంద్రారెడ్డి సహా స్పోర్ట్స్ స్కూల్స్, అకాడమీల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.