ఆసీస్‌కే కాస్త మొగ్గు!

– డబ్ల్యూటీసీ ఫైనల్‌పై రికీ పాంటింగ్‌
న్యూఢిల్లీ : ఐసీసీ 2023 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియాకు కాస్త అనుకూలత ఉండనుందని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ వేదిక లండన్‌లోని ది ఓవల్‌ మైదానం. అక్కడి పరిస్థితులు ఆస్ట్రేలియాను పోలి ఉంటాయి. ఇది ఆసీస్‌కు కాస్త మొగ్గు. ఈ మ్యాచ్‌ భారత్‌, ఆస్ట్రేలియాలో ఎక్కడ జరిగినా ఆతిథ్య జట్టు ఫేవరేట్‌గా ఉండేది. కానీ వేదిక ఇంగ్లాండ్‌ కావటంతో సరసమైన పోటీకి అవకాశం ఏర్పడింది’ పాంటింగ్‌ అన్నారు. 1990-2000 భారత జట్లతో పోల్చితే ప్రస్తుత టీమ్‌ ఇండియా విదేశీ గడ్డపై ఎంతో మెరుగ్గా రాణిస్తుంది. బ్యాటింగ్‌ నైపుణ్యం, వికెట్ల వేటలో పదును బాగున్నాయి. గత 10-15 ఏండ్లలో భారత్‌ నాణ్యమైన పేసర్లను తయారు చేసింది. బుమ్రా లేకపోవటం లోటే, కానీ ఇంగ్లాండ్‌ పరిస్థితుల్లో మహ్మద్‌ షమి ప్రమాకర పేసర్‌. విరాట్‌ కోహ్లికి బౌలింగ్‌ చేయటం ఏ బౌలర్‌కైనా సవాలే. ఇటీవల బెంగళూర్‌లో కోహ్లితో మాట్లాడాను. కెరీర్‌ ఉత్తమ దశలోకి మళ్లీ వచ్చినట్టు అతడు చెప్పాడు. సన్‌రైజర్స్‌పై మ్యాచ్‌లో అందరం అది చూశాం. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఉత్కంఠ పోటీ కోసం ఎదురు చూస్తున్నాను’ అని పాంటింగ్‌ అన్నారు.

Spread the love