రూమ్‌కి వస్తవా…!

 Come to the room– మహిళా ఉద్యోగికి హరికృష్ణ వేధింపులు
– ఫోన్‌ సంభాషణల్లో బయటపడ్డ కీచక పర్వం
– స్పోర్ట్స్‌ స్కూల్‌లో ఓఎస్‌డి రాసలీలలు
సస్పెన్షన్‌కు గురైన హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రత్యేక అధికారి (ఓఎస్‌డి) హరికృష్ణ లైంగిక వేధింపులకు సంబంధించిన ఓ ఆడియో బయటకు వచ్చింది. రాత్రి వేళ విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగితో ఫోన్‌లో మాట్లాడుతూ..’ గదిలోకి వస్తవా’ అని హరికృష్ణ తనలోని కీచక రూపాన్ని బయటపెట్టారు.
నవతెలంగాణ-హైదరాబాద్‌
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్పోర్ట్స్‌ స్కూల్‌లో లైంగిక వేధింపుల విషయంపై ‘నవ తెలంగాణ’కు కీలక ఆధారం లభించింది. హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగితో సస్పెన్షన్‌కు గురైన ఓఎస్‌డి, వెటర్నరీ డాక్టర్‌ వైద్యుడు హరికృష్ణ తనలోని పశు ప్రవృత్తిని చూపించాడు. హరికృష్ణ లైంగిక వేధింపులపై ఐదుగురు సభ్యుల విచారణ కమిటీ రెండో రోజు విచారణ పూర్తి చేయగా.. మరోవైపు మహిళా ఉద్యోగితో హరికృష్ణ ఫోన్‌ సంభాషణలు బయటకు వచ్చాయి. బాలికల వసతి గృహంలోని గెస్ట్‌ హౌస్‌లోనే ఉంటూ.. అక్కడి బాలికలపై సైతం హరికృష్ణ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ కమిటీ నిగ్గు తేల్చనుంది.
కీచక పర్వం ఇలా..
హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో పని చేస్తున్న మహిళా ఉద్యోగితో హరికృష్ణ జరిపిన ఫోన్‌ సంభాషణలు ఉన్నాయి. రాత్రి సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగితో ఓఎస్‌డిగా హరికృష్ణ కీచక పర్వానికి తెరలేపారు. ‘హాస్టల్‌లో సౌండ్‌ వస్తుంది. డోర్లు వేయలేదా? నువ్వు ఎక్కడికి పోయినవ్‌ (నేను వాష్‌రూమ్‌కు వెళ్లాను సర్‌.. అని మహిళా ఉద్యోగి సమాధానం). అదే సప్పుడు వస్తుంది, డోర్లు అన్ని వేసినవా లేదా? అందరు పడుకున్నరా? నువ్వు వస్తవా రూమ్‌కు.. రా’ అని హరికృష్ణ మహిళా ఉద్యోగిని వేధించాడు. ‘ జెండూ బామ్‌ ఉందా? మూవ్‌ లాంటిది ఏమైనా ఉందా? ఏదో ఒకటి తీసుకుని రూమ్‌కు రా..’ ‘ నీ మెడికల్‌ రిపోర్ట్సు ఒకసారి తీసుకుని రా. నేను పైన ఉన్న రూమ్‌లో’.. ఇలా పలుమార్లు హరికృష్ణ ఫోన్‌ చేసి గదికి పిలిచి లైంగికంగా వేధించినట్టు సదరు మహిళా ఉద్యోగి ఆవేదనతో వెల్లడించింది.
ఫిర్యాదు చేసినా..!
హకీంపేట స్పోర్ట్స్‌ ఓఎస్‌డి హరికృష్ణ రాసలీలలు, లైంగిక వేధింపులు ఓ పత్రిక కథనంతో వెలుగులోకి వచ్చినవి కాదని, ఓ వారం రోజుల ముందే ఓ మహిళా ఉద్యోగి క్రీడాశాఖ ఉన్నతాధికారులకు ఈ విషయంపై లేఖ రాసినట్టు తెలుస్తోంది. మహిళా ఉద్యోగి ఫిర్యాదు మేరకు క్రీడాశాఖ ఉన్నతాధికారులు అంతర్గత విచారణ సైతం జరిపించినట్టు సమాచారం. మహిళా ఉద్యోగి శాట్స్‌ ఉన్నతాధికారులకు రాసిన లేఖలు సైతం నవ తెలంగాణ వద్ద ఉన్నాయి. మీడియా కథనంతో తక్షణమే స్పందించి ఓఎస్‌డిని సస్పెండ్‌ చేసినట్టు చెప్పారు కానీ, అంతకుముందే క్రీడాశాఖకు అందిన ఫిర్యాదుపై మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు.
మంత్రి పేషిలో మరో కీచకుడు
-యువ క్రీడాకారిణికి లైంగిక వేధింపులు
హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ లైంగిక వేధింపుల ఘటన మరువకముందే.. క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ పేషిలో మరో కీచక పర్వం బయటపడింది. మంత్రి పేషిలో పని చేస్తున్న సురేందర్‌.. కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువ క్రీడాకారిణితో అసభ్యంగా ప్రవర్తించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన ఆ అమ్మాయి.. ఆర్థిక సహకారం కోసం మంత్రిని కలువుగా.. ఈ సందర్భంగా సురేందర్‌ క్రీడాకారిణి ఫోన్‌ నంబర్‌ తీసుకుని అసభ్యకర సందేశాలు పంపించాడు. ‘నన్ను పర్సనల్‌గా కలుస్తరా? మీ వయసు ఎంత?’ అంటూ యువ క్రీడాకారిణికి సురేందర్‌ మెసేజ్‌లు పంపించాడు. ఈ మెసేజ్‌లను ఆ క్రీడాకారిణి కుటుంబ సభ్యులతో షేర్‌ చేయటంతో.. ఈ విషయమై సురేందర్‌కు ఫోన్‌లో వార్నింగ్‌ ఇచ్చిన ఆడియో తాజాగా బయటపడింది. మరో ఇద్దరు ముగ్గురు మహిళా అథ్లెట్లను సైతం సురేందర్‌ వేధించినట్టు సమాచారం.

Spread the love