మాయతో మొదలైంది!

– అశ్విన్‌, జడేజా మాయజాలం
– వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 68/4
– భారత్‌, విండీస్‌ తొలి టెస్టు
భారత్‌, వెస్టిండీస్‌ తొలి టెస్టు మాయజాలంతో మొదలైంది. టాస్‌ ఓడిన టీమ్‌ ఇండియా.. తొలి సెషన్లోనే స్పిన్‌ను ప్రయోగించి ఆతిథ్య కరీబియన్లను కంగుతినిపించింది. అశ్విన్‌, జడేజాలకు తోడు శార్దుల్‌ మెరవటంతో లంచ్‌లోపే వెస్టిండీస్‌ 4 వికెట్లు చేజార్చుకుంది. రోహిత్‌సేన తొలి సెషన్లోనే పట్టు సాధించింది!.
నవతెలంగాణ-రొజొ
మాయగాళ్లు మెరిశారు. కరీబియన్‌ గడ్డపై తొలి సెషన్లోనే స్పిన్‌ మ్యాజిక్‌తో అదరగొట్టారు. ట్రంప్‌కార్డ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (2/25), రవీంద్ర జడేజా (1/6) బంతిని తిప్పేయగా.. కరీబియన్‌ బ్యాటర్లు విలవిల్లాడారు. కొత్త బంతితో మహ్మద్‌ సిరాజ్‌ నిప్పులు చెరిగినా.. వికెట్‌ కాపాడుకున్న విండీస్‌ స్పిన్నర్ల రాకతో చతికిల పడింది. తొలి సెషన్‌లో 28 ఓవర్లలో 68 పరుగులు చేసిన వెస్టిండీస్‌ 4 వికెట్లు కోల్పోయింది.
మ్యాజిక్‌ షో : టాస్‌ నెగ్గిన వెస్టిండీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇక్కడ తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలం. దీంతో కరీబియన్లు మంచి స్కోరుపై కన్నేశారు. మహ్మద్‌ సిరాజ్‌, జైదేవ్‌ ఉనద్కత్‌లు కొత్త బంతితో విండీస్‌ ఓపెనర్లను ఇబ్బంది పెట్టారు. అయినా, క్రెయిగ్‌ బ్రాత్‌వేట్‌ (20), చందర్‌పాల్‌ (12) నిలబడ్డారు. ఈ పిచ్‌ సంప్రదాయంగా స్పిన్‌కు అనుకూలం. దీంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కాస్త ముందునే స్పిన్నర్ల చేతికి బంతి అందించాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ 10 ఓవర్లలో 25 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్లు ఇద్దరూ అశ్విన్‌ మాయలో పడిపోయారు. తొలి వికెట్‌కు 31 పరుగులు జోడించిన బ్రాత్‌వేట్‌, చందర్‌పాల్‌ అశ్విన్‌ మాయకు పెవిలియన్‌కు చేరారు. శార్దుల్‌ ఠాకూర్‌ ఓవర్లో రేమన్‌ రీఫర్‌ (2) నిష్క్రమించగా.. లంచ్‌ విరామానికి చివరి బంతికి జెర్మెన్‌ బ్లాక్‌వుడ్‌ (14)ను రవీంద్ర జడేజా సాగనంపాడు. అరంగేట్ర బ్యాటర్‌ అలిక్‌ ఆల్తానెజ్‌ (13 బ్యాటింగ్‌, 26 బంతుల్లో 2 ఫోర్లు) తొలి సెషన్‌లో అజేయంగా నిలిచాడు.
యశస్వి, కిషన్‌ ఇన్‌ : వెస్టిండీస్‌తో తొలి టెస్టుకు భారత్‌ ఇద్దరు యువ ఆటగాళ్లను బరిలో నిలిపింది. యశస్వి జైస్వాల్‌, ఇషాన్‌ కిషన్‌లు తొలి టెస్టు అవకాశం దక్కించుకున్నారు. యువ బ్యాటర్‌ యశస్వి జైస్వాల్‌ ఓపెనర్‌గా రానుండగా.. తెలుగు కుర్రాడు శ్రీకర్‌ భరత్‌ స్థానంలో ఇషాన్‌ కిషన్‌ వికెట్‌ కీపర్‌గా తుది జట్టులో నిలిచాడు. ఆల్‌రౌండర్లు జడేజా, శార్దుల్‌ నిలువగా.. సిరాజ్‌కు తోడుగా జైదేవ్‌ ఉనద్కత్‌ రెండో పేసర్‌గా ఎంపికయ్యాడు.
9.30 గంటల వ్యత్యాసం : వెస్టిండీస్‌తో తొలి టెస్టు మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ఆరంభమైంది. కరీబియన్‌ దీవులతో భారత కాలమానం తొమ్మిది గంటల 30 నిమిషాలు వ్యత్యాసం. దీంతో మూడో సెషన్‌ ముగిసే సరికి భారత్‌లో అర్థరాత్రి 3 గంటలు అవుతుంది.
స్కోరు వివరాలు :
వెస్టిండీస్‌ తొలి ఇన్నింగ్స్‌ : క్రెయిగ్‌ బ్రాత్‌వేట్‌ (సి) రోహిత్‌ (బి) అశ్విన్‌ 20, చందర్‌పాల్‌ (బి) అశ్విన్‌ 12, రేమన్‌ రీఫర్‌ (సి) ఇషాన్‌ (బి) ఠాకూర్‌ 2, బ్లాక్‌వుడ్‌ (సి) సిరాజ్‌ (బి) జడేజా 14, ఆల్తానెజ్‌ నాటౌట్‌ 13, ఎక్స్‌ట్రాలు : 7, మొత్తం : (28 ఓవర్లలో 4 వికెట్లకు) 68.
వికెట్ల పతనం : 1-31, 2-38, 3-47, 4-68.
బౌలింగ్‌ : మహ్మద్‌ సిరాజ్‌ 6-2-17-0, జైదేవ్‌ ఉనద్కత్‌ 5-2-7-0, రవిచంద్రన్‌ అశ్విన్‌ 10-3-25-2, శార్దుల్‌ ఠాకూర్‌ 3-1-7-1, రవీంద్ర జడేజా 2-0-6-1.

Spread the love