– శాఫ్ ఛాంపియన్‌షిప్‌లో ఒక్కో ఆటగానికి దక్కింది రూ.2లక్షలే
గత మూడేళ్లుగా నిలకడగా రాణిస్తూ.. శాఫ్ ఛాంపియన్షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత ఫుట్‌బాల్ జట్టులో ఒక్కో ఆటగానికి దక్కింది అక్షరాలా రూ.2లక్షల ప్రైజ్ మనీ మాత్రమే. బెంగళూరులోని శ్రీ కంఠీవర స్టేడియంలో భారత్-కువైట్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ తర్వాత విజేత నెగ్గిన భారత జట్టుకు 50వేల డాలర్లు(భారత కరెన్సీలో రూ.42లక్షలు) ప్రైజ్ మనీ చెక్కును అందించారు. ఈ మొత్తం జట్టులో ఉన్న మొత్తం ఆటగాళ్లు ఇతర సిబ్బందికి మాత్రమే. భారత్-లెబనాన్ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు సుమారు 20వేల మంది ప్రేక్షకులు హాజరుకాగా.. ఫైనల్‌కు దాదాపు 30వేల మంది హాజరయ్యారు. ఇంత ప్రేక్షకాదరణ ఉన్న ఫుట్‌బాల్‌కు ఆటగాళ్లకు అందజేసే ప్రైజ్ మనీలో ఎందుకంత వివక్ష చూపుతున్నారో పాలకులకే ఎరుక. ఫిఫా ర్యాంకింగ్స్‌లోనూ భారత ఫుట్‌బాల్ జట్టు 100కు చేరుకోవడమంటే గొప్ప విశేషమే. ఐపిఎల్ ఒక సీజన్‌కు ఓ దేశీయ ఆటగానికి ఇచ్చే కనీస ధర రూ.20 లక్షలు. ఈ ఏడాది ఐపిఎల్‌లో ఓ సీజన్ మ్యాచ్ ఆడేందుకు ఓ విదేశీ ఆటగానికి రూ.18.5కోట్లు, దేశీయ ఆటగానికి రూ.8.25కోట్లు ముట్టజెప్పారు. వారేమైనా అద్భుతం చేశారా అంటే అదీ లేదు. కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన ఆటగాళ్లను ఓ దశలో ఫ్రాంచైజీలు బెంచ్‌కే పరిమితం చేసిన సందర్భాలూ ఉన్నాయి. మన పాలకులకు క్రికెట్ పట్ల ఉన్న ప్రేమ ఇతర క్రీడల పట్ల అస్సలు ఉండడం లేదు. కాసులు కురిపించే ఆటలనే ప్రభుత్వాలూ ప్రోత్సహిస్తున్నాయి.
ఫుట్‌బాల్‌పై ఎందుకీ వివక్ష..
ఫుట్‌బాల్‌ను ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాల్లో ప్రజాదరణ ఉంటే.. ఆసియా ఖండం దాటితే క్రికెట్‌కు ఉన్న ఆదరణ అంతంత మాత్రమే. ఇతర దేశాల్లోగానీ, ఖండాల్లో గానీ ఈ క్రీడను చూసేవాళ్లుగానీ, ఆడేవాళ్లుగానీ అస్సలుండరు. అంతర్జాతీయంగా ఇటీవల కాలంలో హాకీ, కబడ్డీతోపాటు వ్యక్తిగత విభాగాల్లో మన క్రీడాకారులు అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతున్నారు. వీరిని ప్రోత్సహించేందుకు ముందుకు రాని ప్రభుత్వాలు, పాలకులు.. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించారంటే చాలు కోట్లకు కోట్లు నజరానాలు ప్రకటించి ఆ తర్వాత మిన్నకుండిపోతున్నారు. రాబోయే రోజుల్లోనైనా మార్పు రావాలని కోరుకుందాం..!