పాక్‌ మ్యాచులు హైదరాబాద్‌లో!

– అక్టోబర్‌ 15న భారత్‌, పాక్‌ పోరు అహ్మదాబాద్‌లో?
– అక్టోబర్‌ 5న తొలి మ్యాచ్‌, నవంబర్‌ 19న ఫైనల్‌
– ఐసీసీ 2023 వన్డే వరల్డ్‌కప్‌ ముసాయిదా షెడ్యూల్‌
ఐసీసీ మెగా ఈవెంట్లకు సుమారుగా ఏడాదికి ముందే షెడ్యూల్‌ ప్రకటిస్తారు. అంతర్జాతీయ అభిమానులు ప్రయాణ ఏర్పాట్లు, ఇతరాత్ర లాజిస్టికల్‌ వెసులుబాటు ఉండేలా చూస్తారు. టికెట్లు సైతం కనీసం ఆరు నెలల ముందే అభిమానులకు అందుబాటులోకి తీసుకొస్తారు. 2023 వన్డే వరల్డ్‌కప్‌కు మరో నాలుగు నెలల సమయమే ఉంది. అయినా, ఇప్పటివరకు షెడ్యూల్‌ విడుదల కాలేదు. టికెట్లు ఆన్‌లైన్‌లో ఉంచలేదు. ఓ ఐసీసీ ఈవెంట్‌కు ఇంతటి ఆలస్యం ఇదే తొలిసారి!. న్యూఢిల్లీ : ప్రపంచ క్రికెట్‌ అభిమానులు, పొరుగు దేశాల క్రికెట్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ 2023 వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ అధికారికంగా విడుదల కాకపోయినా.. అభిమానులకు కిక్కిచ్చే వార్త మాత్రం ఐసీసీ వర్గాలు అందించాయి. వన్డే వరల్డ్‌కప్‌ నిర్వహణ కోసం బీసీసీఐ రూపొందించిన ముసాయిదా షెడ్యూల్‌ ఇప్పుడు ఐసీసీ వద్దకు చేరింది. ముసాయిదా షెడ్యూల్‌ను పరిశీలించనున్న ఐసీసీ.. సభ్య దేశాలతో పంచుకోనుంది. క్రికెట్‌ బోర్డుల అభ్యంతరాలు ఏమైనా ఉంటే వాటికి సైతం పరిగణనలోకి తీసుకుని తుది షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక ముసాయిదా షెడ్యూల్‌ ప్రకారం ప్రపంచ క్రికెట్‌ దాయాదులు భారత్‌, పాకిస్థాన్‌ అక్టోబర్‌ 15న అహ్మదాబాద్‌లోని బాహుబలి స్టేడియంలో తలపడనున్నాయి. అక్టోబర్‌ 5న డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లాండ్‌, రన్నరప్‌ న్యూజిలాండ్‌తో వన్డే వరల్డ్‌కప్‌ వేటకు తెరలేవనుండగా.. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌లో ఫైనల్‌తో ముగియనుంది.
భారత్‌ తొమ్మిది వేదికల్లో.. :
ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో భారత జట్టు ఐదు వేదికల్లో ఆడనుంది. చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్‌, పుణె, ధర్మశాల, లక్నో, ముంబయి, కోల్‌కత, బెంగళూర్‌ భారత మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అక్టోబర్‌ 8న ఆస్ట్రేలియాతో (చెన్నై) తలపడనున్న టీమ్‌ ఇండియా.. అక్టోబర్‌ 11 అఫ్ఘనిస్థాన్‌ (ఢిల్లీ), అక్టోబర్‌ 15 పాకిస్థాన్‌ (అహ్మదాబాద్‌), అక్టోబర్‌ 19 బంగ్లాదేశ్‌ (పుణె), అక్టోబర్‌ 22 న్యూజిలాండ్‌ (ధర్మశాల), అక్టోబర్‌ 29 ఇంగ్లాండ్‌ (లక్నో), నవంబర్‌ 2 క్వాలిఫయర్‌ (ముంబయి), నవంబర్‌ 5 దక్షిణాఫ్రికా (కోల్‌కత), నవంబర్‌ 11 క్వాలిఫయర్‌ (బెంగళూర్‌)తో ఆడనుంది.
హైదరాబాద్‌లో పాక్‌ మ్యాచులు :
పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు హైదరాబాద్‌ నుంచి వరల్డ్‌కప్‌ వేట షురూ చేయనుంది. గ్రూప్‌ దశలో తొలి రెండు మ్యాచులు ఆ జట్టు ఇక్కడే ఆడనుంది. అక్టోబర్‌ 6న, అక్టోబర్‌ 12న పాకిస్థాన్‌ రెండు మ్యాచుల్లోనూ క్వాలిఫయర్‌తో ఆడనుంది. భారత్‌తో మెగా పోరును అహ్మదాబాద్‌లో ఆడనుండగా.. బెంగళూర్‌, చెన్నై, కోల్‌కతలోనూ రెండేసి మ్యాచులు ఆడనుంది.
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ సందర్భంగా వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ విడుదల చేస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించినా.. అది సాధ్యపడలేదు. ఐసీసీ సీఈవో సైతం షెడ్యూల్‌ ఏ క్షణంలోనైనా విడుదల కావచ్చని వ్యాఖ్యానించాడు. కానీ ఇప్పటివరకు అధికారికంగా షెడ్యూల్‌ బయటకు రాలేదు. భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లో నిర్వహించటంపై పీసీబీ అభ్యంతరాలు ఏమైనా వ్యక్తం చేసిందా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? తెలియాల్సి ఉంది.

Spread the love