విరాట్‌ శతక స్పెషల్‌

– 500వ మ్యాచ్‌లో కోహ్లి 121 రన్స్‌
– అర్థ సెంచరీతో మెరిసిన జడేజా
– భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 373/6
– విండీస్‌తో రెండో టెస్టు రెండో రోజు
విరాట్‌ కోహ్లి ప్రత్యేక ప్రదర్శన. కెరీర్‌ 500వ మ్యాచ్‌లో శతకంతో చెలరేగిన విరాట్‌ కోహ్లి (121) మైలురాయి మ్యాచ్‌ను మరింత మధురం చేసుకున్నాడు. కరీబియన్‌ పిచ్‌లపై అనూహ్య ఉపఖండ తరహా పరిస్థితుల్లో అలవోకగా పరుగులు పిండుకున్న విరాట్‌ కోహ్లి 29వ టెస్టు సెంచరీతో చెలరేగాడు. రవీంద్ర జడేజా (61)తో కలిసి 159 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కోహ్లి.. భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో పటిష్ట స్థితిలో నిలిపాడు.
నవతెలంగాణ-పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌
విరాట్‌ కోహ్లి (121, 206 బంతుల్లో 11 ఫోర్లు) శతక గర్జన. కెరీర్‌ 500వ మ్యాచ్‌ ఆడుతున్న స్టార్‌ బ్యాటర్‌ క్వీన్స్‌పార్క్‌లో ఖతర్నాక్‌ ఇన్నింగ్స్‌ నమోదు చేశాడు. కెరీర్‌ 29వ టెస్టు సెంచరీ సాధించిన విరాట్‌ కోహ్లి.. రవీంద్ర జడేజా (61, 152 బంతుల్లో 5 ఫోర్లు)తో కలిసి ఐదో వికెట్‌కు 159 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. విరాట్‌ కోహ్లి స్పెషల్‌ శతకం, రవీంద్ర జడేజా అర్థ సెంచరీతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా సాగుతోంది. శుభ్‌మన్‌ గిల్‌ (10), అజింక్య రహానె (8) నిరాశపరిచారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌ (57), రోహిత్‌ శర్మ (80) అర్థ సెంచరీలతో తొలి వికెట్‌కు 139 పరుగులు జోడించిన సంగతి తెలిసిందే. రెండో రోజు ఆటలో లంచ్‌ విరామ సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 373/6తో కొనసాగుతుంది.
విరాట్‌ శతక గర్జన : కెరీర్‌ స్పెషల్‌ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి అంతే స్పెషల్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కరీబియన్‌ పేసర్లలో కీమర్‌ రోచ్‌, వారికన్‌ నిలకడగా పరీక్షగా నిలిచినా.. ఐదు రోజుల ఆటలో సంప్రదాయ ఇన్నింగ్స్‌తో అలరించాడు. జడేజాతో కలిసి తొలి రోజే బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్‌ కోహ్లి.. రెండో రోజు తొలి సెషన్‌ వరకు మెరిశాడు. ఆరు ఫోర్లతో 97 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన విరాట్‌ కోహ్లి.. రెండో రోజు ఉదయం సెంచరీ సాధించాడు. పది బౌండరీలతో 180 బంతుల్లో విరాట్‌ కోహ్లి 29వ టెస్టు సెంచరీ నమోదు చేశాడు. మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా సైతం రాణించాడు. సహజశైలిలో ధనాధన్‌ విధ్వంసం లేకపోయినా.. జడేజా పరిస్థితులకు అనుగుణంగా ఆడాడు. నాలుగు ఫోర్లతో 105 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసిన జడేజా.. ఆ తర్వాత క్రీజులో ఎంతోసేపు నిలువలేదు. తొలుత జడేజాతో సమన్వయ లోపంతో విరాట్‌ కోహ్లి రనౌట్‌గా నిష్క్రమించగా.. ఆ తర్వాత జడేజా సైతం వికెట్‌ చేజార్చుకుని పెవిలియన్‌కు చేరుకున్నాడు. లంచ్‌ విరామ సమయానికి ఇషాన్‌ కిషన్‌ (18 బ్యాటింగ్‌, 21 బంతుల్లో 3 ఫోర్లు), రవిచంద్రన్‌ అశ్విన్‌ (6 బ్యాటింగ్‌, 11 బంతుల్లో 1 ఫోర్‌) అజేయంగా ఆడుతున్నారు. వెస్టిండీస్‌ బౌలర్లలో కీమర్‌ రోచ్‌ (2/86) రెండు వికెట్ల ప్రదర్శన చేయగా.. షానన్‌ గాబ్రియల్‌, జోమెల్‌ వారికన్‌, జేసన్‌ హోల్డర్‌లు తలా ఓ వికెట్‌ ఖాతాలో వేసుకున్నారు.

స్కోరు వివరాలు :
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : జైస్వాల్‌ (సి) మెకెంజి (బి) హోల్డర్‌ 57, రోహిత్‌ (బి) వారికన్‌ 80, గిల్‌ (సి) డిసిల్వ (బి) రోచ్‌ 10, కోహ్లి రనౌట్‌ 121, రహానె (బి) గాబ్రియల్‌ 8, జడేజా (సి) డిసిల్వ (బి) రోచ్‌ 61, కిషన్‌ నాటౌట్‌ 18, అశ్విన్‌ నాటౌట్‌ 6, ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం : (108 ఓవర్లలో 6 వికెట్లకు) 373.
వికెట్ల పతనం : 1-139, 2-153, 3-155, 4-182, 5-341, 6-360.
బౌలింగ్‌ : కీమర్‌ రోచ్‌ 19-2-86-2, అల్జారీ జొసెఫ్‌ 19-0-92-0, గాబ్రియల్‌ 16-0-63-0, జోమెల్‌ వారికన్‌ 31-6-70-1, అలిక్‌ అతానెజ్‌ 4-0-12-0, బ్రాత్‌వేట్‌ 2-1-1-0.

Spread the love