పసిడి ముంగిట ధరణి, మల్లేశ్‌

– ముందంజలో నిలిచిన దీక్షిత
– 14వ మాన్‌సూన్‌ రెగట్టా పోటీలు
నవతెలంగాణ, హైదరాబాద్‌
హుస్సేన్‌సాగర్‌లో జరుగుతున్న 14వ మాన్‌సూన్‌ రెగట్టా జాతీయ ర్యాంకింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో తెలంగాణ సెయిలర్లు అలలపై అదరగొడుతున్నారు. తుది ఫలితాలపై స్పష్టత వచ్చేందుకు మరో మూడు రేసులే మిగిలి ఉండగా.. తెలంగాణ సెయిలర్లు పసిడి రేసులో ముందంజలో కొనసాగుతున్నారు. అండర్‌-19 ఇంటర్నేషనల్‌ క్లాస్‌ విభాగంలో ధరణి లావేటి, వడ్ల మల్లేశ్‌ జోడీ పసిడి పతకం దిశగా సాగుతుంది. శుక్రవారం నాటి పోటీల్లో ఏకంగా మూడు రేసుల్లో విజయాలు సాధించిన హ్యాట్రిక్‌ కొట్టిన ధరణి, మల్లేశ్‌ జోడీ.. శనివారం జరిగిన రెండు రేసుల్లోనూ దుమ్మురేపారు. పసిడి పతకం రేసులో ధరణి లావేటి, వడ్ల మల్లేశ్‌ జంట 10 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సెయిలర్లు నాన్సీ రారు, అనిరాజ్‌ సెంధవ్‌ జోడీ 14 పాయింట్లు, విద్యాన్షి మిశ్రా, మనీశ్‌ శర్మ జంట 27 పాయింట్లతో టాప్‌-3లో కొనసాగుతున్నారు. చివరి మూడు రేసుల్లోనూ అంచనాల మేరకు మెరిస్తే ధరణి, మల్లేశ్‌ జోడీకి పసిడి పతకం ఖాయం. ఇక అండర్‌-15 ఆప్టిమిస్టిక్‌ క్లాస్‌ (బాలికలు) విభాగంలో తెలంగాణ యువ సెయిలర్‌ దీక్షిత కోమరవెల్లి ముందంజ వేసింది. శుక్రవారం రేసులు ముగిసే సమయానికి దీక్షిత కోమరవెల్లి 40 పాయింట్లతో అగ్రస్థానం నిలుపుకుంది. షాగున్‌ ఝా (మధ్యప్రదేశ్‌), శ్రేయ కృష్ణ (తమిళనాడు) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. అండర్‌-15 ఆప్టిమిస్టిక్‌ క్లాస్‌ బార్సు విభాగంలో ఏకలవ్య (మధ్యప్రదేశ్‌), అజరు (గోవా), శరణ్య యాదవ్‌ (గోవా) టాప్‌-3 స్థానాల్లో కొనసాగుతున్నారు. నాలుగేండ్ల విరామం అనంతరం జరుగుతున్న మాన్‌సూన్‌ రెగట్టా పోటీలు ఆదివారం ఫైనల్స్‌తో ముగియనున్నాయి.

Spread the love