ఆ ముగ్గురు జోరుగా..!

– బుమ్రా, రాహుల్‌, అయ్యర్‌ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ
బెంగళూర్‌ : గాయాలు, శస్త్రచికిత్సలు, రిహాబిలిటేషన్‌ నుంచి ముమ్మర సాధన దశకు వచ్చారంటూ.. జశ్‌ప్రీత్‌ బుమ్రా, కెఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌లపై బీసీసీఐ అప్‌డేట్‌ ఇచ్చింది. ప్రస్తుతం బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఉన్న ఈ ముగ్గురు క్రికెటర్లు పూర్తి స్థాయిలో సాధన చేస్తున్నారని బీసీసీఐ తెలిపింది. ఎన్‌సీఏ నిర్వహించే అంతర్గత మ్యాచుల్లో బుమ్రాతో పాటు మరో పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ సైతం బౌలింగ్‌ చేస్తారని వెల్లడించింది. శ్రేయస్‌ అయ్యర్‌, కెఎల్‌ రాహుల్‌లు నెట్స్‌లో కఠోరంగా సాధన చేస్తున్నారని.. రానున్న రోజుల్లో బ్యాటింగ్‌ సాధన, స్ట్రెంగ్త్‌ అండ్‌ కండీషనింగ్‌ కసరత్తులు మరింత దీటుగా ప్రణాళికలో చేర్చుతామని తెలిపింది. ఇక రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్న రిషబ్‌ పంత్‌ సైతం నెట్స్‌లో బ్యాటింగ్‌ సాధనతో పాటు వికెట్‌ కీపింగ్‌ ప్రాక్టీస్‌ సైతం చేస్తున్నాడని బీసీసీఐ పేర్కొంది. బుమ్రా, రాహుల్‌, శ్రేయస్‌లు ఆసియా కప్‌ కోసం సన్నద్ధమవుతుండగా.. రిషబ్‌ పంత్‌ను ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని సిద్ధం చేస్తున్నారు!.

Spread the love