ఆగస్టు 12న డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలు

– సుప్రీం తీర్పుతో ఎన్నికలకు లైన్‌ క్లియర్‌
– మహారాష్ట్రకు దక్కని ఓటు హక్కు
న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ఎన్నికలకు ఎట్టకేలకు మార్గం సుగమం. అస్సాం హైకోర్టు ఇటీవల రెజ్లింగ్‌ సమాఖ్య ఎన్నిలకలపై ఇచ్చిన స్టే ఆర్డర్‌ను అత్యున్నత న్యాయస్థానం నిలుపుదల చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర జాప్యంతో సరికొత్త వివాదాలకు కేంద్రంగా నిలుస్తున్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య.. ఆగస్టు 12న నూతన పాలక వర్గాన్ని ఎన్నుకోనుంది. ఈ మేరకు డబ్ల్యూఎఫ్‌ఐ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ జస్టిస్‌ ఎంఎం కుమార్‌ శుక్రవారం వెల్లడించారు.
మహారాష్ట్రకు నో : ఆఫీస్‌ బేరర్లను ఎన్నుకునే ప్రక్రియలో డబ్ల్యూఎఫ్‌ఐ 24 అనుబంధ రాష్ట్ర సంఘాలు భాగస్వామ్యం కానున్నాయి. తొలుత జులై 6న ఎన్నికలకు షెడ్యూల్‌ ఖరారు చేయగా.. తెలంగాణ, హర్యానా, రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర రాష్ట్ర రెజ్లింగ్‌ సంఘాలను ఎలక్ట్రోరల్‌ కాలేజ్‌ నుంచి తొలగించారు. ఈ నిర్ణయాన్ని ఈ రాష్ట్ర సంఘాలు సవాల్‌ చేయటంతో అప్పట్లో ఎన్నికలను జులై 11కు మార్పు చేశారు. ఆ తర్వాత అస్సాం రాష్ట్ర రెజ్లింగ్‌ సంఘం గుర్తింపు కోసం కోర్టుకెక్కటంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. తాజాగా ఆగస్టు 12న నిర్వహించనున్న ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి ఓటు హక్కు కోరుతున్న రెండు సంఘాలకూ అనుబంధ గుర్తింపు అర్హత లేదని రిటర్నింగ్‌ ఆఫీసర్‌ తేల్చారు. దీంతో 24 రాష్ట్ర సంఘాల నుంచి 48 మంది ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
అదే సస్పెన్స్‌ : బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడిగా 12 ఏండ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. జాతీయ స్పోర్ట్స్‌ కోడ్‌ ప్రకారం మరోసారి పోటీచేసేందుకు బ్రిజ్‌భూషణ్‌ అనర్హుడు. కానీ ఉత్తరప్రదేశ్‌ రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడిగా కొనసాగుతున్న బ్రిజ్‌భూషణ్‌ తనయుడు కరన్‌ భూషణ్‌ సింగ్‌ ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హుడు. కానీ ఆందోళనకు దిగిన రెజ్లర్లతో చర్చల్లో భాగంగా క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఓ హామీ ఇచ్చారు. బ్రిజ్‌ భూషణ్‌ కుటుంబ సభ్యులు, అనుచరులు ఎవరూ రానున్న డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికల్లో పోటీ చేయరని తెలిపారు.
బ్రిజ్‌భూషణ్‌ ఇద్దరు అల్లుళ్లు విశాల్‌ సింగ్‌, ఆదిత్య ప్రతాప్‌ సింగ్‌ సైతం ఎన్నికల్లో పోటీకి అర్హత కలిగి ఉన్నారు. మాజీ ఒలింపియన్‌, ఢిల్లీ రెజ్లింగ్‌ సంఘం అధ్యక్షుడు జై ప్రకాశ్‌, ఉత్తరాఖాండ్‌ రెజ్లింగ్‌ సంఘం కార్యదర్శి సత్యపాల్‌ సింగ్‌ దేశ్వాల్‌లు బ్రిజ్‌భూషణ్‌కు అత్యంత సన్నిహితులు. బ్రిజ్‌భూషణ్‌ కుమారుడు ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు.కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులైన వ్యక్తులనైనా డబ్లూఎఫ్‌ఐ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టేందుకు బ్రిజ్‌భూషణ్‌కు తగిన మద్దతు ఉంది. ఆగస్టు 12న జరిగే ఎన్నికల్లో 48 మంది సభ్యులు ఓటు హక్కు కలిగి ఉండగా.. కనీసం 46 మంది సభ్యుల మద్దతు బ్రిజ్‌భూషణ్‌కు ఉండటం గమనార్హం.

Spread the love