అబద్ధాలు చెప్పి.. నిందలు వేసి…

దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏండ్లు గడుస్తున్నా మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. సమాజంలో, కుటుంబంలో ఎలాంటి తప్పు జరిగినా దానికి మహిళలనే కారణం చేస్తున్నారు. అదే మంచి జరిగితే మాత్రం ఏ ఒక్కరూ ఆమెను ప్రశంసించరు. ఇక ఇంట్లో ఆరోగ్య సమస్యలు వచ్చినా, ఆర్థిక సమస్యలు వచ్చినా కొత్తగా ఇంట్లోకి అడుగు పెట్టిన కోడలిపైనే నెట్టేస్తారు. ఎందుకంటే మహిళలంటే అంత చిన్నచూపు. ఇక అబద్ధాలు చెప్పి పెండ్లి చేసుకుని నిందలు వేసే వారు కూడా ఎందరో ఉన్నారు. అలాంటి ఓ సమస్యతో ఐద్వా అదాలత్‌కు వచ్చింది తబుసుం. అసలు ఆమె సమస్య ఏంటో, అది పరిష్కారం అయ్యిందో లేదో తెలుసుకుందాం…
‘ఆమె వల్ల మా అబ్బాయికి ఈ రోగం వచ్చింది. అలాంటి అమ్మాయి మాకు వద్దు. ఆమెకు విడాకులు ఇస్తాం. ఆమె మాతో ఉంటే మా కుటుంబ సభ్యులందరికీ ఆ వ్యాధి వస్తుంది’ అంది సోహిల్‌ తల్లి. అమె అలా అనడంతో మేము సోహిల్‌ని ఒక్కడినే పిలిచి మాట్లాడితే అసలు విషయం తెలిసింది. అతనికి పెండ్లికి ముందు నుంచే హెచ్‌ఐవీ ఉంది. దాని కోసమే అతను ప్రతి రోజూ మాత్రలు వాడుతున్నాడు. ఆ విషయం తబుసుంకు తప్ప ఇంట్లో అందరికీ తెలుసు.
తబుసుంకు 24 ఏండ్లు ఉంటాయి. సోహిల్‌తో పెండ్లి జరిగి ఏడాది అవుతుంది. అప్పుడే సమస్యలేంటి అని ఆశ్చర్యపోతున్నారా..? ఆ విషయానికే వస్తున్నాను. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో పెండ్లి అనే బంధంలో అడుగుపెట్టింది తబుసుం. అయితే పెండ్లి అయిన రోజు నుండే భర్త ఏవో మాత్రలు తీసుకోవడం గమనించింది. ‘ఈ మాత్రలు ఎందుకు వేసుకుంటున్నారు? ఆరోగ్యం బాగోలేదా’ అని అడిగింది. దానికి అతను ‘అవును పెండ్లిలో అటూ ఇటూ తిరగడం, ఆ నీరూ ఈ నీరూ తాగడం వల్ల స్కిన్‌ ప్రాబ్లెమ్స్‌ వచ్చాయి. అందుకే ఈ మందులు వేసుకుంటున్నాను’ అని చెప్పాడు. ఆమె కూడా భర్త మాటలు నమ్మేసింది.
ఎన్ని రోజులు గడిచినా ఆ మాత్రలు అతను రోజూ వాడుతూనే ఉన్నాడు. రెండు నెలల తర్వాత ఆమెకు కూడా చర్మ సమస్యలు వచ్చాయి. డాక్టర్‌ దగ్గరకు వెళ్ళింది. అయితే ఆమెకు ఇచ్చిన మాత్రలు వేరుగా ఉన్నాయి. వాటిని వాడినా ఆమె సమస్య తగ్గలేదు. దాంతో ఆమెను పుట్టింటికి పంపించారు. నెల తర్వాత సమస్య తగ్గడంతో అత్తింటికి తిరిగి వచ్చింది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత సమస్య తిరిగి మొదలైంది. అత్త, ఆడపడుచులు, బావలు అందరూ కలిసి ‘రోగిస్టు అమ్మాయిని ఇచ్చి పెండ్లి చేశారు’ అంటూ గొడవ చేసి ఆమెను కొట్టి పంపించారు. తబుసుం తిరిగి డాక్టర్‌ దగ్గరకు వెళ్ళింది. మూడో నెల అని చెప్పింది డాక్టర్‌. అలాగే ‘ఈ స్కిన్‌ ప్రాబ్లమ్‌ నీకు ఎందుకు వస్తుంది. ఎన్ని మందులు వాడినా మళ్ళీ వస్తుంది. పైగా ఇప్పుడు నువ్వు గర్భవతివి కాబట్టి నీ కడుపులోని బిడ్డకు ఇబ్బంది లేకుండా మందులు వాడాలి’ అంటూ కొన్ని టెస్టులు చేశారు. అందులో ఆమెకు ఏ సమస్యా లేదు అని వచ్చింది.
‘నీ భర్తను పిలిస్తే నేను ఆయనతో మాట్లాడి ఆయనకు కూడా కొన్ని టెస్టులు చేయిస్తాను’ అని చెప్పింది డాక్టర్‌. ఇదే విషయం అతనికి చెబితే వినిపించుకోలేదు. ‘నాకు ఎలాంటి సమస్యా లేదు. నేను ఎందుకు పరీక్షలు చేయించుకోవాలి’ అంటూ వెళ్ళిపోయాడు. ‘ప్రతి నెలా వచ్చి రెగ్యులర్‌గా చెకప్‌ చేయించుకోవాలి’ అని డాక్టర్‌ తబసుంకు చెప్పింది. అయితే ఆమెకు తర్వాత కాలంలో వేరే ఆరోగ్య సమస్యలు రావడంతో డాక్టర్‌ హెచ్‌ఐవీ పరీక్ష చేసింది. అందులో పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయం తబుసుంకు చెప్పి ‘మీ ఆయనకు కూడా తప్పకుండా పరీక్ష నిర్వహించాలి, కాబట్టి ఆయనను తప్పకుండా తీసుకురండి’ అన్నది డాక్టర్‌. కానీ సోహిల్‌ రాలేదు. ‘నాకు ఎలాంటి జబ్బు లేదు. నేను రాను’ అంటూ పాత పాటే పాడాడు. అయినా డాక్టరు చేయించుకోవల్సిందే అని హెచ్‌ఐవీ పరీక్ష చేశారు. అతనికీ పాజిటివ్‌ వచ్చింది. దాంతో ‘నేను వేరే దగ్గర టెస్ట్‌ చేయించుకుంటాను’ అని వెళ్ళిపోయాడు.
డాక్టర్‌ తబుసుంతో ‘ఇద్దరికీ పాజిటివ్‌ వచ్చింది కాబట్టి పుట్టబోయే బిడ్డకు కూడా వచ్చే అవకాశం ఉంది. నీకు ఇప్పుడు ఐదవ నెలనే కాబట్టి ఆలోచించుకోండి’ అని చెప్పింది. సోహిల్‌ కుటుంబ సభ్యులు ‘తబసుం మాకు వద్దు. ఆమె వల్ల మాకు కూడా ఆ వ్యాధి వస్తుంది’ అన్నారు. తబుసుం కుటుంబ సభ్యులు ఆమెకు అబార్షన్‌ చేయించారు. తర్వాత తన పరిస్థితి ఏంటో ఆమెకు అర్థం కాలేదు. సలహా కోసం ఐద్వా అదాలత్‌కు వచ్చింది.
మేము సోహిల్‌కు వాళ్ళ అమ్మకు ఫోన్‌ చేసి పిలిచి మాట్లాడాము. ‘ఆమె వల్ల మా అబ్బాయికి ఈ రోగం వచ్చింది. అలాంటి అమ్మాయి మాకు వద్దు. ఆమెకు విడాకులు ఇస్తాం. ఆమె మాతో ఉంటే మా కుటుంబ సభ్యులందరికీ ఆ వ్యాధి వస్తుంది’ అంది సోహిల్‌ తల్లి. అమె అలా అనడంతో మేము సోహిల్‌ని ఒక్కడినే పిలిచి మాట్లాడితే అసలు విషయం తెలిసింది. అతనికి పెండ్లికి ముందు నుంచే హెచ్‌ఐవీ ఉంది. దాని కోసమే అతను ప్రతి రోజూ మాత్రలు వాడుతున్నాడు. ఆ విషయం తబుసుంకు తప్ప ఇంట్లో అందరికీ తెలుసు.
మేము అతని తల్లిని పిలిచి ‘మాత్రల గురించి తబుసుం అడిగితే నీ కొడుకు అబద్ధాలు చెప్పాడు. ఇప్పుడు ఆమె వల్లే రోగం వచ్చిందని విడాకులు ఇస్తాం అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ టెస్టులు చేయించి అసలు ఈ రోగం ఎవరి నుండి ఎవరికి వచ్చిందో తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కచ్చితంగా నీ కొడుకు వల్లే తబుసుంకు హెచ్‌ఐవీ వచ్చిందని నీకూ తెలుసు. నువ్వు ఒప్పుకోకపోతే మేమే టెస్టులు చేయిస్తాం. అబద్ధాలు చెప్పి పెండ్లి చేసుకున్నందుకు, ఆమె జీవితం నాశనం చేసినందుకు జైలుకు వెళ్ళాల్సి వస్తుంది’ అన్నారు.
‘సరే మేడం, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు’ అంది. ఇద్దరికీ పాజిటివ్‌ వచ్చింది కాబట్టి ఇద్దరూ కలిసి ఉంటేనే మంచిది. పాజిటివ్‌ వచ్చిన తర్వాత ఆమె మరో పెండ్లి చేసుకునే అవకాశం కూడా లేదు’ అన్నారు. కానీ వాళ్ళు మాత్రం విడాకులు తీసుకుంటామన్నారు. మా దగ్గర కాకపోతే వాళ్ళ కమ్యూనిటీ దగ్గరకు వెళ్ళైనా విడాకులు తీసుకుంటాం’ అని కచ్చితంగా చెప్పారు. ఎంత చెప్పినా వాళ్ళు వినకపోయే సరికి తబుసుం కూడా ‘అలాంటి వ్యక్తితో నేను ఉండలేను మేడం, నా అరోగ్యాన్ని కాపాడుకుంటూ బతుకుతాను’ అంది. దాంతో ఆమె పెండ్లి సమయంలో ఇచ్చిన బంగారంతో నష్టపరిహారంగా రూ.5 లక్షలు ఇచ్చి విడాకులు తీసుకోమన్నాం. దానికి వాళ్ళు అంగీకరించారు.
– వై. వరలక్ష్మి, 9948794051

Spread the love