సరైన నిర్ణయం

అమ్మాయిలకి చిన్న వయసులోనే పెండ్లి చేయడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. వారి ప్రమేయం లేకుండానే జీవితంలో అన్నీ జరిగిపోతాయి. పెండ్లి, బంధాలు, కుటుంబం, బాధ్యతలు వంటి వాటిపై అవగాహన వచ్చే సరికే వయసుకు మించిన భారాన్ని మోయవల్సి వస్తుంది. అలాంటి సమస్యతోనే సుమ ఐద్వా ఐదాలత్‌కు వచ్చింది. అసలు ఆమెకు వచ్చిన సమస్యేంటో, దాన్ని ఎలా పరిష్కరించుకుందో తెలుసుకుందాం…
సుమకి 16 ఏండ్లు ఉన్నప్పుడే తల్లిదండ్రులు మేనమామతో ఆమెకు పెండ్లి చేశారు. మొదట్లో వినోద్‌ సుమను బాగానే చూసుకున్నాడు. తర్వాత మద్యానికి బానిసయ్యాడు. దాంతో భార్యా పిల్లలను పట్టించుకోవడం మానేశాడు. సుమకి 19 ఏండ్లు వచ్చే సరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. వినోద్‌ ఇంట్లో ఒక్క పైసా ఇవ్వకుండా వచ్చిన జీతం మొత్తం తాగేవాడు. ఆఫీస్‌కి కూడా తాగే వెళ్ళేవాడు. పై అధికారులు రెండు, మూడు సార్లు హెచ్చరించారు. కానీ అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. దాంతో ఉద్యోగం నుండి తొలగించారు. ఆర్థిక భారం ఎక్కువైంది. సుమ ఉద్యోగం చూసుకుంది.
సుమకు వచ్చిన జీతంతో ఇంట్లో సరుకులు, పిల్లల స్కూల్‌ ఫీజులు చూసుకునేది. వినోద్‌కు ఉన్న మద్యం అలవాటు వల్ల ఎంత ప్రయత్నించినా వేరే ఉద్యోగం దొరకలేదు. చేసేది లేక సుమనే ఫైనాన్స్‌లో అతనికి ఆటో ఇప్పించింది. అయినా లాభం లేదు. ఆటో నడిపి వచ్చిన డబ్బులతో తాగేవాడు. సుమతో, పిల్లలతో ప్రేమగా ఉండేవాడు కాదు. పైగా పిల్లల ముందే సుమతో గొడవ పడడం, కొట్టడం చేసేవాడు. దాంతో పిల్లల్లో కూడా వినోద్‌పై కోపం అసహ్యం పెరిగాయి. మెల్లిమెల్లిగా తండ్రిని దూరం పెట్టడం మొదలు పెట్టారు. సుమ కూడా భర్తను పట్టించుకోవడం మానేసింది.
ఇంట్లో బాధలను మర్చిపోవడం కోసం తనతో పాటు ఉద్యోగం చేస్తున్న వారితో స్నేహం చేయడం మొదలు పెట్టింది సుమ. ఇంట్లో గొడవలు ఎక్కువయ్యాయి. భర్తకు తోడు వాళ్ళ అత్త కూడా సుమతో గొడవ పడేది. స్కూల్‌ నుండి వచ్చిన తర్వాత పిల్లల్ని కూడా చూసుకునేది కాదు. ఎప్పుడు పిల్లలను తిట్టేది. ‘నీ వల్ల వినోద్‌ ఇలా తయారయ్యాడు. నీవు ఇంట్లో నుండి వెళ్ళిపో’ అనేది. దాంతో సుమకు ఇంట్లో కంటే బయట ఉంటేనే ప్రశాంతంగా అనిపించేది. ఇలాంటి సమయంలోనే ఆఫీసులో పని చేసే రవి ఆమెకు పరిచమయ్యాడు. మొదట్లో ఫోన్‌లోనే మాట్లాడేది. నెమ్మదిగా అతని వైపు ఆకర్షితురాలయింది. అతనితో మాట్లాడటం సుమకు కొంచెం ఊరట ఇచ్చేది.
రవితో ఆమె అనుబంధం ఎంతగా పెరిగిందంటే అతనితో మాట్లాడకుండా, చూడకుండా ఉండలేకపోతుంది. అతను లేకపోతే బతకలేదేమో అన్నంతగా ఆ చనువు పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఏం చేయాలో అర్థం కాక ఐద్వా అదాలత్‌కు దగ్గరకు సలహా కోసం వచ్చింది. సుమ చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత మేము వినోద్‌కు ఫోన్‌ చేసి పిలిపించాం. వినోద్‌ మద్యానికి ఎందుకు బానిసయ్యాడో తెలుసుకున్నాం. ఆ మత్తు నుంచి అతను బయట పడకపోతే జీవితమే నాశనం అవుతుందని హెచ్చరించార. మద్యం అలవాటు నుండి అతను బయట పడటం కోసం కౌన్సెలింగ్‌ ఇప్పించాం. దాంతో పాటు వినోద్‌ ఆరోగ్య పరిస్థితి కూడా బాగుపడటానికి ట్రీట్‌మెంట్‌ ప్రారంభించమన్నాం.
ఇవన్నీ చేస్తూనే రవిని కూడా పిలిపించి మాట్లాడితే ‘సుమ తన భర్తకు విడాకులు ఇచ్చి నాతో వస్తే ఆమెను, పిల్లలను నేను చూసుకుంటాను. ఆమె పరిస్థితి ఏమీ బాగోలేదు. ఇంత చిన్న వయసులో ఇన్ని కష్టాలు భరించడం అవసరమా? నేను ఆమెను మహారాణిలా చూసుకుంటాను’ అన్నాడు. దానికి సుమ ‘మొదటి నుంచి నాకు నా భర్తంటే చాలా ఇష్టం. కేవలం ఇంట్లో పరిస్థితుల వల్లనే నేను రవికి దగ్గరయ్యాను. నేను నా భర్తను వదిలి వెళ్ళలేను. అందుకే మీరు మంచి సలహా ఇస్తారని నా స్నేహితులు చెబితే మీ దగ్గరకు వచ్చాను’ అంది.
ఈ చర్చ మొత్తం వినోద్‌ ముందే జరిగింది. సుమ తనను ఎంతగా ప్రేమిస్తుందో వినోద్‌ను అర్థమయింది. దాంతో అతనిలో బాధ మొదలయింది. మరో వ్యక్తి తనకు మంచి జీవితం ఇస్తానంటున్నా తనపై ఉన్న ప్రేమతో వెళ్ళనంటున్న సుమపై అతనికి గౌరవం పెరిగింది. ‘ఎలాగైనా నేను ఈ మద్యం అలవాటు నుండి బయట పడతాను. నా భార్యా, పిల్లల్ని ప్రేమగా చూసుకుంటాను’ అన్నాడు.
రవితో ‘మీకు ఇంకా పెండ్లి కాలేదు. సుమకు మీ పైన ఉన్నది ప్రేమ కాదు. కేవలం అభిమానం, ఆకర్షణ మాత్రమే. ఈ రెండింటితో జీవితం గడవదు. మీకు కూడా ఆమెపై ఉన్నది ప్రేమ కాదు జాలి మాత్రమే. అది ఎన్ని రోజులు ఉంటుందో ఆలోచించుకోండి. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి బతకాలంటే ఉండాల్సింది ప్రేమ. అది మీ మధ్య లేదు. కాబట్టి మీరు మిమ్మల్ని ప్రేమించే అమ్మాయిని చూసి పెండ్లి చేసుకుని హాయిగా ఉండండి’ అని చెప్పాము.
కన్నీళ్లు పెట్టుకుంటున్న సుమ తో ‘నీవు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకు న్నావు. నీవు మా దగ్గరకు సరైన సమయంలో వచ్చావు. లేకపోతే నీ జీవితం మొత్తం నాశనం అయ్యేది. ఇంట్లో ఉండే కొన్ని పరిస్థితుల కారణంగా బయట వేరే వారికి ఆకర్షితులు కావడం సహజం. నీవు చేసిందేమీ తప్పు కాదు. ఎందుకు ఇప్పుడంతగా బాధపడుతున్నావు. ఆ ప్రవాహంలో కొట్టుకు పోకుండా నిన్ను నువ్వు కాపాడుకున్నావు. ఇక ముందు కూడా ఇలాగే ధైర్యంగా ఉండు. నీ పిల్లలను హాస్టల్లో చేర్పించు. వినోద్‌ ఇప్పుడు వైద్యానికి సహకరిస్తున్నాడు. కాబట్టి త్వరలోనే అతను ఆ అలవాటు నుండి బయటకు వస్తాడు. ఇకపై జాగ్రత్తగా ఉండు. బయట ఆకర్షణలకు లోనైతే జీవితం నాశనం అవుతుంది. ఇతరుల వైపు మనం ఆకర్షితులవుతున్నాం అనిపించగానే వారితో మాట్లాడటం తగ్గించాలి. వారి నుండి దూరంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. మనం ఎందుకు ఇతరుల వైపు ఆకర్షితులవుతున్నామో తెలుసుకుని ఆ పరిస్థితిని సరిదిద్దుకోవాలి. అప్పుడే మనతో పాటుగా సమాజం కూడా బాగుంటుంది’ అని చెప్పి పంపించాము.
– వై.వరలక్ష్మి, 9948794051

Spread the love