అట్టడుగు ప్రజలకు మేఘన అభయం

బెంగళూరుకు చెందిన మేఘనా నారాయణన్‌ వయసు 18 ఏండ్లు మాత్రమే. అయినా అట్టడుగు ప్రజల కష్టాల గురించి ఆలోచిస్తున్నది. దానికోసమే ‘అభయ’ అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. తద్వారా అట్టడుగు వర్గాలకు ఆరోగ్య, జీవిత బీమా పాలసీలను అందుబాటులోకి తెచ్చింది. పేదల ఆర్థిక భారాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఆమె ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇటీవల ఎన్‌డీటీవీతో తన వ్యక్తిగత అనుభవం నుంచి ఈ అభయ ఎలా పుట్టు కొచ్చిందో వివరించింది. ఆ విశేషాలు నేటి మానవిలో…
ప్రాజెక్ట్‌ అభయ ఆధ్వర్యంలో పేదలకు మరిన్ని సేవలు అందించాలనే ఉద్దేశంతో మేఘన నిరుపేద మహిళల కోసం కృషి చేసే సుచరిత అనే ఎన్‌జీఓతో భాగస్వామి అయ్యింది. మరింత మంది లబ్ధిదారుల నమోదుకు ఇది సహాయపడింది. బెంగళూరు ఆధారిత సంస్థ 1వీ1దీ (1 మిలియన్‌ కోసం 1 బిలియన్‌) ఫ్యూచర్‌ లీడర్స్‌ ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకుంది. 1వీ1దీ అనేది ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందిన ఎన్‌జీఓ. ఇది 1 బిలియన్‌ జనాభాకు సహాయం చేయగల 10,00,000 మంది నాయకులను తయారు చేయడానికి పని చేస్తుంది. ఇది యువతను ఎక్కువగా ప్రోత్సహిస్తుంది.
మేఘన ప్రాజెక్ట్‌ అభయ ఇప్పుడు ఎంతో గుర్తింపు పొందింది. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా ఆమె న్యూయార్క్‌లో మూడు రోజుల ఇమ్మర్షన్‌లో పాల్గొంది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో వార్షిక 1వీ1దీ యాక్టివేట్‌ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో తన ప్రాజెక్ట్‌ గురించి వివరించే అవకాశాన్ని కూడా పొందింది. భారతదేశంలోని వివిధ తెగలు, జాతు, భాషా, మైనారిటీలు, వైకల్యాలున్న వ్యక్తులు, వలసదారులు, మారుమూల ప్రాంతాల్లో నివసించే జనాభా, లింగం, లైంగికత గురించి శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని కూడా అభయ నొక్కి చెబుతున్నది. ప్రస్తుత కోవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో కరోనవైరస్‌ ఇన్‌ఫెక్షన్‌, ఇతర వ్యాధులను నివారించడానికి హ్యాండ్‌వాష్‌ చేయడం ఒక మార్గం కాబట్టి వాష్‌ (నీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత) అవసరం కూడా ప్రచారం చేసింది.
అవగాహన పెంచడానికి
మహిళలు, పిల్లలకు పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ ప్రాముఖ్యత, పోషకాహార లోపం, మానసిక క్షేమం, స్వీయ సంరక్షణ, సైన్స్‌, ఆరోగ్యం, కౌమార ఆరోగ్యం, లింగ అవగాహన వంటి వాటిపై దృష్టి సారించడంతో పాటు వీటిపై అవగాహన పెంచడానికి అభయ ప్రచారం కొనసాగుతున్నది. ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఈ ప్రచారం గుర్తించింది.
మానవ మనుగడకు ప్రమాదం
మన పర్యావరణం బాగా దెబ్బతుంటుంది. ఇది వనరులను అతిగా వాడుకోవడమే కాకుండా, ఆ వనరులను ఉపయోగించడం, వెలికితీసే ప్రక్రియలో అపారమైన కాలుష్యాన్ని కూడా సృష్టిస్తుంది. ఈ అసమతుల్యత జీవవైవిధ్య నష్టానికి దారితీసింది. ఇది మానవ మనుగడకు అతిపెద్ద ముప్పుగా మారింది. వాయు కాలుష్యం, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్‌ నిషేధం, మాన్యువల్‌ స్కావెంజింగ్‌, పారిశుద్ధ్య కార్మికులు, రుతుస్రావ పరిశుభ్రత వంటి సమస్యలను కవర్‌ చేయడానికి కూడా అభయ ప్రచారం చేస్తున్నది.
ఇంత చిన్న వయసులో ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది?
మా అపార్ట్‌మెంట్‌లో పనిచేసే మాలా అనే గృహకార్మికురాలి భర్త మెదడు దెబ్బతినడంతో ఆస్పత్రిలో చేరాడు. పేదరికంతో వారు సరైన వైద్యం చేయించుకోలేకపోయారు. ఈ సంఘటనే మన దేశంలో పేదల బీమా పాలసీల స్థితిగతుల గురించి పరిశోధన చేయడానికి నన్ను పురికొల్పింది. భారతదేశంలోని 90 శాతం మంది పేదలకు జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు అందుబాటులో లేవు. దాని వల్ల వైద్యం పొందలేకపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకే ‘అభయ’ను ప్రారంభించాను.
మీ ప్రాజెక్ట్‌ ఎవరి కోసం పని చేస్తుంది?
ప్రధానంగా రోజువారీ వేతన కార్మికులు, గృహ కార్మికులు, పారిశుధ్య కార్మికులు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రజలందరి కోసం పని చేస్తున్నది.
మీ యాక్షన్‌ ప్లాన్‌ ఏమిటి?
ముందు నా పని జీవిత బీమాతో ప్రారంభించాను. ఇప్పుడు ప్రభుత్వ బీమా పాలసీల గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తాను. అంతేకాకుండా జీవిత, వైకల్య బీమా పాలసీలను కూడా గుర్తించాను. వాటి కింద దాదాపు 105 మంది గృహ కార్మికులను చేర్చుకున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఆరోగ్య బీమా పాలసీలపై కూడా దృష్టి సారించాను. ఆంధ్రప్రదేశ్‌లోని లక్కవరం ప్రాంతంలో టైలరింగ్‌ యూనిట్‌లో పనిచేస్తున్న పలువురు మహిళలకు బీమా చేశాను. దాదాపు 259 మంది పారిశుధ్య కార్మికుల కోసం కోవిడ్‌-19 బీమా కోసం డబ్బును సేకరించాను.
ప్రభుత్వ బీమా పాలసీలకు, అభయకు తేడా ఏమన్నా ఉందా?
ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పథకాలు చాలా సమగ్రమైనవి, అనేక రకాల సమస్యలను కవర్‌ చేస్తాయి. కానీ ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఈ పథకాలను పొందేందుకు నిరుపేద ప్రజలకు అవగాహన, అక్షరాస్యత లేకపోవడం. ప్రాజెక్ట్‌ అభయ ద్వారా నేను బీమా సంబంధిత అవగాహన సెషన్‌లను నిర్వహిస్తున్నాను. ఈ స్కీమ్‌లలో వాళ్ళ పేర్లు నమోదు చేయిస్తాను. దీనికోసం ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలతో కలిసి పని చేస్తున్నాను.
అభయ భవిష్యత్‌ ప్రణాళికలు ఏమిటి?
దేశంలోని వివిధ ప్రాంతాలలో బహుళ బృందాలను నిర్మించాలనుకుంటున్నాను. ప్రతి బృందం అఖిల భారత, రాష్ట్ర నిర్దిష్ట బీమా పాలసీలను పొందడంపై దృష్టి సారిస్తుంది. లబ్ధిదారులతో సన్నిహితంగా పనిచేసే మరిన్ని ఎన్‌జీఓలు, సంస్థలతో భాగస్వామిగా ఉండాలనుకుంటున్నాను. ఇది అభయ భౌగోళిక విస్తరణలో సహాయపడుతుంది. అలాగే ప్రాజెక్ట్‌ను కొనసాగించడంలో కూడా సహాయపడుతుంది.

Spread the love