ఒక్కో స్టేడియానికి రూ.50 కోట్లు!

– వసతుల ఆధునీకరణ పనులు ముమ్మరం
– ప్రపంచ కప్‌ వేదికలకు బీసీసీఐ నిధులు
     2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. మెగా ఈవెంట్‌కు మరో 97 రోజుల సమయమే ఉంది. ఐసీసీ
ప్రపంచకప్‌ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఆతిథ్యం అందించేందుకు సిద్ధమవుతున్న భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తొలుత స్టేడియాల ఆధునీకరణపై దృష్టి నిలిపింది. ప్రపంచ కప్‌ వేదికలకు రూ.50 కోట్ల చొప్పున కేటాయించింది. స్టేడియాల ఆధునీకరణ పనులకు ఏకంగా రూ.500 కోట్లు వెచ్చించనుంది.

నవతెలంగాణ క్రీడావిభాగం
ఐసీసీ ప్రపంచకప్‌ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి!. మెగా ఈవెంట్‌కు మంగళవారంతో 100 కౌంట్‌డౌన్‌ మొదలు కావటంతో.. నిర్వహణ ఏర్పాట్లలో బీసీసీఐ బిజీగా గడుపుతోంది. షెడ్యూల్‌ విడుదల ఆలస్యమైనా.. ప్రపంచకప్‌ కోసం భారత్‌కు రానున్న క్రికెట్‌ అభిమానులకు మరిచిపోలేని అనుభూతి మిగిల్చేందుకు స్టేడియాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతోంది. ఐపీఎల్‌ 16 సీజన్‌ ముగిసిన వెంటనే పలు స్టేడియాల్లో మరమ్మత్తుల నిమిత్తం సుమారు రూ.700 కోట్లు వెచ్చించిన భారత క్రికెట్‌ బోర్డు.. ఇప్పుడు తాజాగా మరో రూ.500 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచకప్‌ వేదికలకు రూ.50 కోట్ల చొప్పున కేటాయించి నూతన ఫ్లడ్‌లైట్ల సదుపాయం, నూతన డ్రెస్సింగ్‌రూమ్‌, దిగుమతి చేసుకున్న పచ్చిక, ఉత్తమ టికెటింగ్‌ వ్యవస్థ సహా స్టేడియంలో అభిమానులకు మెరుగైన కనీస అవసరాల కల్పన దిశగా నడుం బిగించింది. అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, ధర్మశాల, న్యూఢిల్లీ, ముంబయి, పుణె, చెన్నై, బెంగళూర్‌, కోల్‌కత, లక్నోలు రూ. 50 కోట్ల నిధులు అందుకోనున్నాయి. పది స్టేడియాల్లోనూ ఆధునిక టికెటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనున్న బీసీసీఐ.. ఇతర మౌళిక సదుపాయాల అంశంలో ఒక్కో స్టేడియంలో ఒక్కో తరహా పని చేయనుంది.
ఉప్పల్‌లో కొత్త పిచ్‌లు
హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం ప్రపంచకప్‌ ఆతిథ్యానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ స్టేడియంలో పైకప్పు సమస్య చాన్నాండ్ల నుంచి పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం సౌత్‌ పెవిలియన్‌ పైకప్పు మరమ్మత్తుతో పాటు నూతనంగా ఈస్ట్‌, వెస్ట్‌ స్టాండ్స్‌కు సైతం పైకప్పు ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం బీసీసీఐ ఇప్పటికే టెండర్లు పిలిచింది. ఇక ప్రపంచకప్‌ కోసం ఇక్కడ నూతన పిచ్‌లు తయారు చేయనున్నారు. మెరుగైన అవుట్‌ఫీల్డ్‌ కోసం పనులు చేయనున్నారు. హైదరాబాద్‌లో పాకిస్థాన్‌ జట్టు వార్మప్‌ సహా నాలుగు మ్యాచులు ఆడనుంది.
ఈడెన్‌, మొతెరాలో..
అహ్మదాబాద్‌ బాహుబలి స్టేడియం ఇటీవల ప్రారంభమైంది. ఇక్కడ కొత్తగా ఎటువంటి పనులు లేవు. అవుట్‌ఫీల్డ్‌ మెరుగుదల, నూతన పిచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈడెన్‌గార్డెన్స్‌ 2011 ప్రపంచకప్‌ సమయంలో అవసరమైన ఆధునీకరణ పనులు దక్కించుకుంది. ఈసారి డ్రెస్సింగ్‌రూమ్స్‌ సుందరీకరణ పనులు మాత్రమే చేయనున్నారు.
కోట్ల, చిన్నస్వామిలో..
దేశ రాజధానిలోని ఫిరోజ్‌ షా కోట్ల మైదానం డిజైన్‌ లోపాలు ఎదుర్కొంటుంది. ఇక్కడ ప్రధానంగా టాయిలెట్లపై అభిమానులు ఎక్కువగా ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో ఇక్కడ మెరుగైన టాయిలెట్ల సౌకర్యం, నూతన సీటింగ్‌, స్టేడియంలోకి ఎంట్రీని సులభతరం చేయనున్నారు. ఇక బెంగళూర్‌లోని చిన్నస్వామి స్టేడియంలో సైతం పెద్దగా సమస్యలు లేవు. ఇక్కడ కూడా టెయిలెట్లు, డ్రెస్సింగ్‌రూమ్‌ను మెరుగు పర్చనున్నారు.
ముంబయి, చెన్నైలో ఫ్లడ్‌లైట్లు
2011 ప్రపంచకప్‌ ఫైనల్‌ వేదిక వాంఖడే. ఇక్కడ ఆధునాతన ఫ్లడ్‌లైట్ల వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఎల్‌ఈడీ లైట్లను అమర్చనున్నారు. కార్పోరేట్‌ బాక్స్‌లను సైతం ఆధునీకరించనున్నారు. చెన్నై ఎం.ఏ చిదంబరం స్టేడియంలో రెండు ఎర్ర మట్టి పిచ్‌లు ఉన్నాయి. వాటిని ప్రపంచకప్‌ కోసం నూతనంగా వేయనున్నారు. చెన్నైలో సైతం ఆధునాతన ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాట్లు చేయనున్నారు.
లక్నో పిచ్‌లు మార్పు
ఐపీఎల్‌ 16లో లక్నో పిచ్‌లు తీవ్ర విమర్శలపాలైంది. ఇక్కడ పిచ్‌లపై పరుగులు చేయటం గగనంగా మారింది. దీంతో వరల్డ్‌కప్‌ మ్యాచుల కోసం లక్నోలో పూర్తిగా కొత్త పిచ్‌లను తయారు చేయనున్నారు. ఇక మహారాష్ట్ర క్రికెట్‌ సంఘం (ఎంసీఏ) స్టేడియం పుణెలో సైతం కొత్త పిచ్‌లు ఏర్పాటు చేయనున్నారు. అక్కడ టాయిలెట్లు, పార్కింగ్‌ సౌకర్యం, స్టాండ్స్‌లో నూతన సీట్లు ఏర్పాటు చేయనున్నారు.
ధర్మశాలలో విదేశీ పచ్చిక
ధర్మశాల హెచ్‌పీసీఏ స్టేడియం కోసం విదేశాల నుంచి పచ్చిక తీసుకురానున్నారు. భారత్‌లో అత్యంత సుందర స్టేడియంలో ధర్మశాల ముందుంటుంది. కానీ ఇక్కడ అవుట్‌ఫీల్డ్‌, డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నం. వర్షం ప్రభావిత మ్యాచుల్లో వీలైనంత వేగంగా ఆటను పున ప్రారంభించేందుకు అనువుగా మైదానంలో పచ్చికను విదేశాల నుంచి తెప్పిస్తున్నారు. 6000 మీటర్ల పైప్‌లైన్‌తో ఆధునాతన సబ్‌ ఎయిర్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త సీట్లు, స్టాండ్స్‌కు పెయింట్‌ వేయనున్నారు.
7న అపెక్స్‌ కౌన్సిల్‌ భేటి
బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ ఈ నెల 7న సమావేశం కానుంది. స్టేడియాల ఆధునీకరణ, ప్రపంచకప్‌ టూర్‌ ప్యాకేజీలు, విదేశీ లీగ్‌ల్లో మాజీ క్రికెటర్ల ప్రాతినిథ్యం సహా సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మెన్‌ వేతనంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. చీఫ్‌ సెలక్టర్‌కు ప్రస్తుతం ఏడాదికి రూ.1 కోటి వేతనంగా అందుతుంది. వేతన పెంపుపై హామీ ఇవ్వటంతో అజిత్‌ అగార్కర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ బాధ్యతలు వదులుకుని చీఫ్‌ సెలక్టర్‌ రేసులో నిలిచినట్టు సమాచారం. మాజీ క్రికెటర్లు ఆసక్తి చూపించేందుకు చీఫ్‌ సెలక్టర్‌ వేతనాన్ని ఏడాదికి రూ. 2 కోట్లుగా నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది

Spread the love