– ఫైనల్లో ఇరాన్‌పై 42-32తో గెలుపు
– ఆసియా కబడ్డీ చాంపియన్‌షిప్
బుసాన్ (దక్షిణ కొరియా) : టీమ్ ఇండియా కూత ‘ఎనిమిది’కి చేరుకుంది. ఏడేండ్ల విరామం అనంతరం జరిగిన ఆసియా కబడ్డీ చాంపియన్‌షిప్స్‌లో విజేతగా నిలిచిన భారత జట్టు.. ఆసియా చాంపియన్‌షిప్స్‌లో రికార్డు ఎనిమిదో టైటిల్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం బుసాన్‌లో జరిగిన టైటిల్ పోరులో చిరకాల ప్రత్యర్థి ఇరాన్‌పై భారత్ 42-32తో గెలుపొందింది. భారత స్టార్ రైడర్ పవన్ షెరావత్ పది పాయింట్లతో మెరవటంతో డిఫెండింగ్ చాంపియన్ అలవోక విజయం సాధించింది. ఏకపక్ష విజయాలతో ఫైనల్స్‌కు చేరిన టీమ్ ఇండియా.. టైటిల్ పోరులో ఏ దశలోనూ వెనుకంజ వేయలేదు. ఇరాన్‌పై కనీసం 7 పాయింట్ల ఆధిక్యం కొనసాగిస్తూ టైటిల్ దిశగా దూసుకెళ్లింది. 35-26తో భారత్ ముందంజలో నిలువగా.. మరింత సమయం ఉండటంతో ఇరాన్ పుంజుకునే అవకాశం కనిపించింది. కానీ భారత్ ఇటు ఎదురుదాడి, అటు డిఫెన్స్‌లో అద్భుతంగా రాణించారు. ఇరాన్ ఆటగాళ్లను కట్టడి చేసి భారత్‌కు 10 పాయింట్ల తేడాతో ఘన విజయాన్ని కట్టబెట్టారు. 2017 ఆసియా కబడ్డీ చాంపియన్‌షిప్ ఫైనల్లో పాకిస్థాన్‌ను మట్టికరిపించిన టీమ్ ఇండియా.. తాజాగా ఇరాన్‌పై అదిరే విజయంతో ఆసియా కబడ్డీ చాంపియన్‌షిప్‌లో ఎనిమిదో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆసియా కబడ్డీ చాంపియన్‌షిప్‌లో భారత్ సహా ఇరాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్, చైనీస్ తైపీ, హాంగ్‌కాంగ్ పోటీపడ్డాయి.