ధనాధన్‌కు వేళాయె!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌). ధనాధన్‌ క్రికెట్‌కు కేరాఫ్‌ అడ్రస్‌. ప్రతి ఏడాది ఐపీఎల్‌ హంగామా సహజమే. కానీ ఈసారి హంగామా మజా వేరు!. మూడేండ్ల విరామం అనంతరం సొంత అభిమానుల నడుమ జరుగనున్న ఐపీఎల్‌.. సరికొత్త సంగతులకూ వేదిక కానుంది. ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌ వంటి క్రీడల్లో సబ్‌స్టిట్యూట్‌ ఆటగాళ్లు మ్యాచ్‌ ఫలితాన్ని నిర్దేశించే ఘట్టాలు.. ఇక నుంచీ ఐపీఎల్‌లోనూ చూడబోతున్నాం. ఓ సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు పూర్తి స్థాయి బ్యాటర్‌, బౌలర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తూ.. ఆటలో ఎక్స్‌ ఫ్యాక్టర్‌ కానున్నాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023 సీజన్‌ నేడు అహ్మదాబాద్‌ వేదికగా ఆరంభం.
– నేటి నుంచి ఐపీఎల్‌ 16 హంగామా
– ఆరంభ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
– తొలి మ్యాచ్‌లో టైటాన్స్‌, సూపర్‌కింగ్స్‌ ఢీ
నవతెలంగాణ-అహ్మదాబాద్‌
కొత్త రూల్స్‌ గురూ!
గ్లోబల్‌ టీ20 లీగ్‌లు అధికం అవుతున్న కాలంలో ఐపీఎల్‌ను ఆకర్షణీయ, కమర్షియల్‌ లీగ్‌ను నిలిపేందుకు కొత్త సొబగులు అవసరం. బీసీసీఐ యంత్రాంగం ఈ విషయంలో సరైన సమయంలో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. క్రికెట్‌లో సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేయలేడు. కానీ ఐపీఎల్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌ ప్రకారం సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేయవచ్చు. టాస్‌ అనంతరం తుది జట్టుతో పాటు నలుగురు సబ్‌స్టిట్యూట్‌ ఆటగాళ్ల పేర్లను సైతం ఇవ్వాలి. మ్యాచ్‌లో ఏ సమయంలోనైనా ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రూల్‌తో సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడి సేవలను ఇరు జట్లు వినియోగించుకోవచ్చు. ఇక ఐపీఎల్‌లో గత కొన్ని సీజన్లుగా నో బాల్స్‌, వైడ్లకు సంబంధించి అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదం అవుతున్నాయి. ఈ వివాదాలకు చెక్‌ పెట్టేందుకు వైడ్లు, నో బాల్స్‌కు సైతం డిఆర్‌ఎస్‌ పద్దతిని తీసుకొచ్చారు. ఇరు జట్లు సమీక్షను వాడుకుని అంపైర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేయవచ్చు. ఇక, క్రికెట్‌లో సాధారణంగా టాస్‌కు ముందు తుది జట్టు జాబితాను ఇరు జట్ల కెప్టెన్లు పంచుకుంటారు. ఆ తర్వాత మార్పులకు అవకాశం ఉండదు. కానీ ఐపీఎల్‌లో టాస్‌ అనంతరం తుది జట్టును ఎంపిక చేసుకోవచ్చు. దీంతో తొలుత బ్యాటింగ్‌, తొలుత బౌలింగ్‌ చేసేటప్పుడు జట్ల వ్యూహల ప్రకారం ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ఎంచుకోవచ్చు.
పాత ఫార్మాట్‌
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్లేయింగ్‌ ఫార్మాట్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న విషయం. ప్రాంఛైజీలు సొంత గడ్డపై సగం మ్యాచులు, ప్రత్యర్థి వేదికపై సగం మ్యాచులు ఆడాలి. కరోనా కారణంగా గత మూడేండ్లలో లీగ్‌ ఈ ఫార్మాట్‌ను పాటించలేదు. యుఏఈలో మూడు స్టేడియాలు, భారత్‌లోనూ మూడు స్టేడియాల్లోనే నిర్వహించారు. 2019 తర్వాత తొలిసారి ఐపీఎల్‌ మళ్లీ పాత పద్దతిలో జరిగేందుకు షెడ్యూల్‌ చేశారు. పది జట్లు తమ సొంత మైదానంలో ఏడు మ్యాచులు ఆడనున్నాయి. రాజస్థాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ వంటి ప్రాంఛైజీలు సొంత మైదానాలుగా రెండు వేదికలను ఎంచుకున్నాయి. పాత ఫార్మాట్‌ ఐపీఎల్‌లో దేశవ్యాప్తంగా ఐపీఎల్‌ హంగామా కనిపించనుంది.
కొత్త చాంపియన్‌ను చూస్తామా?
కొత్త చాంపియన్‌ను చూస్తామా? మెగా ఈవెంట్‌ ఏది జరిగినా ఎదురయ్యే ప్రశ్న. గత సీజన్‌లో ఐపీఎల్‌ నూతన విజేతను చూసింది. అరంగేట్ర జట్టు గుజరాత్‌ టైటాన్స్‌ టైటిల్‌ ఎగరేసుకుపోయింది. ఐపీఎల్‌ టైటిల్‌ కోసం గత ఏడాది కొత్తగా వచ్చిన లక్నో సూపర్‌ జెయింట్స్‌కు తోడు.. 2008 నుంచీ అలుపెరుగని పోరాటం చేస్తున్న జట్లూ ఉన్నాయి. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌, పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ టైటిల్‌ నెగ్గని జాబితాలో ఉన్నాయి. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ మూడుసార్లు టైటిల్‌ పోరులో పోటీపడినా.. ఫలితం దక్కలేదు. పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ లీగ్‌ దశలో గొప్ప ప్రదర్శన చేసి అంచనాలు పెంచినా.. ప్లే ఆఫ్స్‌/నాకౌట్‌లో నిలబడలేదు. 2023 సీజన్‌లోనైనా ఐపీఎల్‌ పాత జట్ల నుంచి కొత్త చాంపియన్‌ను చూస్తుందా? మళ్లీ పాత చాంపియన్‌ చెంతకే చేరుతుందా? ఆసక్తికరం. ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (డెక్కన్‌ చార్జర్స్‌), కోల్‌కత నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ ఇప్పటి వరకు ఐపీఎల్‌ టైటిల్‌ను గెల్చుకున్నాయి.
హైదరాబాద్‌లో కిక్కే కిక్కే!
ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో క్రికెట్‌ మ్యాచులకు డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. అంతర్జాతీయ మ్యాచుల టికెట్ల కోసం అభిమానులు పడరాని పాట్లు పడ్డారు. తెలంగాణ, ఏపీ ప్రజల ప్రత్యక్ష క్రికెట్‌ వినోదం దాహం తీర్చేందుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సిద్ధమైంది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ ఉప్పల్‌ వేదికగా ఏడు మ్యాచులు ఆడనుంది. ఏప్రిల్‌ 2న రాజస్థాన్‌ రాయల్స్‌తో తొలి మ్యాచ్‌. రెండు నెలల పాటు సుమారుగా వారం రోజుల వ్యవధిలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతగడ్డపై మ్యాచ్‌ ఆడనుంది. వారానికో ఐపీఎల్‌ మ్యాచ్‌తో హైదరాబాద్‌ వాసులు క్రికెట్‌ కిక్‌ అనుభూతి పొందనున్నారు.
మంధాన, రష్మిక చిందులు
ఐపీఎల్‌ 2023 ఆరంభ వేడుకలకు అహ్మదాబాద్‌లోని మోతెరా స్టేడియం ముస్తాబైంది. బాహుబలి స్టేడియంలో ఐపీఎల్‌ యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు ఘనంగా చేసింది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనుంది. ఆరంభ వేడుకల్లో సినీ తారల నృత్య, సంగీత ప్రదర్శన తొలినాళ్ల నుంచీ ప్రత్యేక ఆకర్షణ. బాహుబలి ఫేం తమన్నా భాటియా, పుష్ఫ ఫేం రష్మిక మంధాన సహా మ్యూజిషిన్‌ అరిజిత్‌ సింగ్‌ ఆరంభ వేడుకల్లో అలరించనున్నారు. ఆరంభ వేడుకల కోసం రూ.10 కోట్ల బడ్జెట్‌ కేటాయించినట్టు తెలుస్తోంది!.

Spread the love