ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులో లేనని ముందే తెలుసు
నవతెలంగాణ-చెన్నై
భారత స్టార్ స్పిన్నర్, ప్రపంచ టాప్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కెరీర్ చివరి దశలో ఎక్కువగా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఐపీఎల్ నుంచి టిఎన్‌పీఎల్ వరకు అశ్విన్ వార్తల్లో నిలుస్తున్నాడు. ఆటతో, ఆటలో వైవిధ్యత చూపిస్తున్న రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తుది జట్టులో చోటు సాధించలేదు. స్పిన్‌కు సహకరించే పిచ్‌పై అగ్రశ్రేణి మాయగాడు అశ్విన్‌ను పక్కనపెట్టడంపై సర్వత్రా చర్చ నడిచింది. ఐసీసీ డడ్ల్యూటీసీ ఫైనల్లో చోటు దక్కదని 48 గంటల ముందే తెలుసని అశ్విన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కెరీర్ ఆరంభంలో నాణ్యమైన బ్యాటర్‌గా పేరొందినా.. బౌలింగ్ ఎంచుకునేందుకు ప్రేరేపించిన కారణాన్ని సైతం అశ్విన్ తాజాగా ఆవిష్కరించాడు.
‘భారత్, శ్రీలంక మ్యాచ్ చూస్తున్నాను. భారత బౌలింగ్ మరీ చెత్తగా అనిపించింది. అభిమాన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఎన్ని పరుగులు చేసినా.. అంతకు సమానమైన పరుగులను బౌలర్లు అలవోకగా సమర్పిస్తున్నారు. బౌలర్‌ను కావాలని అప్పుడే అనుకున్నాను. ప్రస్తుతం (ఆ మ్యాచ్‌లో) ఉన్న బౌలర్ల కంటే మెరుగ్గా నేను రాణించలేనా? అనుకున్నాను. అక్కడే ఆఫ్ స్పిన్నర్‌కు పునాది పడింది. కానీ నేను క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం.. మంచి బ్యాటర్‌గా కొనసాగకుండా ఎందుకు బౌలింగ్ ఎంచుకున్నానని పశ్చాత్తాపడతాను. నేను అసలు బౌలర్‌ను కాకుండా ఉండాల్సింది. ఈ భావనతోనే నేను కొన్నాండ్లు పోటీపడ్డాను. బ్యాటర్లు, బౌలర్లకు భిన్నమైన ట్రీట్‌మెంట్ ఉంటుంది. బ్యాటర్లకు అవకాశాలు దక్కకూడదని నా అభిప్రాయం కాదు. బ్యాటర్లతో పాటు బౌలర్లకు సమాన అవకాశాలు ఉండాలి. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ తుది జట్టులో నాకు చోటు లేదనే సంగతి 48 గంటల ముందే తెలుసు. అయినా, జట్టు విజయం కోసం నా వంతు పాత్ర పోషించాలనే ఉత్సాహంతో ఉన్నాను. సాధారణంగా టెస్టు మ్యాచ్‌లో స్పిన్నర్ ప్రభావం నాల్గో ఇన్నింగ్స్‌లో ఉంటుంది. ఆఫ్ స్పిన్నర్‌ను తుది జట్టులోకి ఎంచుకునేందుకు.. ఇతర నైపుణ్యాలు బేరీజు వేస్తున్నారనే వాదనలోకి వెళ్లదలచుకోలేదు’ అని రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు.