మీ హక్కులను కాపాడుకునేందుకు ఓటు వేయండి : రాహుల్‌ గాంధీ

నవతెలంగాణ – న్యూఢిల్లీ: హక్కులను కాపాడుకునేందుకు ప్రజలంతా ఓటు వేయాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌ మంగళవారం కొనసాగుతోంది. భారీ సంఖ్యలో ఓటు వేయాలని ప్రజలను కోరారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ ఎన్నికలని స్పష్టం చేశారు. ”నేడు మూడోదశ పోలింగ్‌. మీ హక్కులను కాపాడుకునేందుకు మీరందరూ పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఓటు వేయాలని కోరుకుంటున్నాను ” అని రాహుల్‌ గాంధీ ఎక్స్‌లో పేర్కొన్నారు. ” గుర్తుంచుకోండి. ఇవి సాధారణ ఎన్నికలు కాదు. ప్రజాస్వామ్యాన్ని, దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించే ఎన్నికలు” అని పేర్కొన్నారు. ‘‘ చారిత్రాత్మక నిరుద్యోగం, అధిక ద్రవ్యోల్బణం, సంస్థాగత అవినీతి, ఆర్థిక సంక్షోభాన్ని ఓడించడానికి జరిగే ఎన్నికలని ప్రియాంగాంధీ ఎక్స్‌లో తెలిపారు. ”ప్రతి ఓటు ముఖ్యమే. బాగా ఆలోచించి విచక్షణతో ఓటు వేయండి. మీ, పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వేయండి ” అని పేర్కొన్నారు. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 నియోజకవర్గాల్లోని ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. 120 మంది మహిళలు సహా 1300కిపైగా అభ్యర్థులు మూడో విడతలో పోటీ చేస్తున్నారు. ఈ దశలో 8.39 కోట్ల మంది మహిళలతో సహా 17.24 కోట్ల మంది ఓటు వేయనున్నారు. 18.5 లక్షల మంది అధికారులతో, 1.85 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Spread the love