ఇండియా ఫోరమే గెలుస్తుంది

ఇండియా ఫోరమే గెలుస్తుంది– ఎన్నికల తరువాతే ప్రధాని అభ్యర్థి ఎంపిక
– రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న శక్తులకు, వాటిని పరిరక్షించే శక్తులకు మధ్యే పోటీ
– కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేయగలిగిందే చెబుతున్నాం: ఖర్గే
– గత పదేండ్ల మోడీ పాలనలో అన్ని రంగాల్లోనూ విధ్వంసమే : చిదంబరం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
మీడియా ప్రచారం చేస్తున్నట్లు కాకుండా పోటాపోటీగా ఈ ఎన్నికలు ఉండనున్నాయని, ఎన్నికల్లో తాము (ఇండియా ఫోరమే) గెలుస్తామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాతే ‘ఇండియా’ ఫోరం ప్రధానమంత్రి అభ్యర్థి ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయాలనుకుంటున్న శక్తులకు, వాటిని పరిరక్షించేందుకు నడుం బిగించిన శక్తులకు మధ్య జరుగుతున్న పోరాటమే 2024 లోక్‌సభ ఎన్నికలని అన్నారు. శుక్రవారం లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసిన అనంతరం రాహల్‌ గాంధీ మీడియా మాట్లాడుతూ 2004లోనూ వాజ్‌పేయి హయాంలో ”ఇండియా షైనింగ్‌ (భారత్‌ వెలిగిపోతోంది)” అంటూ వాళ్లు ప్రచారం చేశారని, అయితే అప్పటి ఎన్నికల్లో ఎవరు గెలిచారో అందరికీ తెలిసిందేనని అన్నారు.
బీజేపీ ఓటమి చవిచూస్తే యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. సైద్ధాంతిక పరమైన ఎన్నికలు గానే ‘ఇండియా’ ఫోరం ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతోందని తెలిపారు. రాజకీయ పరిశీలకుల తరహాలో తాను భవిష్యత్‌ను ఊహించలేనని, మీడియా అంచనాలకు అందని విధంగా ఈసారి ఎన్నికల్లో నువ్వా నేనా అనేలా పోటీ ఉంటుందని చెప్పగలనని అన్నారు.
బీజేపీ చేతిలో సీబీఐ, ఈడీ, ఐటీ ఉన్నాయని ఆయన విమర్శించారు. కేంద్ర సంస్థలతో బెదిరించి నేతలను బీజేపీలో చేర్చుకుంటున్నారని, కేంద్ర సంస్థలను ప్రయోగించి పార్టీకి నిధులు సమకూర్చు కుంటున్నారని ధ్వజమెత్తారు. ఆర్థికంగా బీజేపీ తమను తాము పరిపుష్టం చేసుకుందని అన్నారు.
బీజేపీ మ్యానిఫెస్టోలో 1-2 శాతం ఉన్న అదానీ వంటివారు కోరుకున్నవి ఉంటాయని, తమ మ్యానిఫెస్టోలో మాత్రం మిగతా 98-99 శాతం ప్రజలు కోరుకునేవే ఉన్నాయని అన్నారు. నాలుగు పెద్ద కార్పొరేట్‌ సంస్థల కోసం దేశం కాదని, వ్యాపారస్తుల మధ్య పారదర్శక పోటీ ఉండేలా చూస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ గ్యారంటీలంటే.. కాంక్రీట్‌ గ్యారంటీలేనని స్పష్టం చేశారు.
చేయగలిగిందే చెబుతున్నాం: ఖర్గే
దేశానికి సరికొత్త దశా దిశా నిర్దేశించేలా ఈ మ్యానిఫెస్టో ఉందని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ భూమి మీదే నడుస్తుంది తప్పా.. ఆకాశానికి నిచ్చెన వేయలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు వాస్తవికతకు చాలా దగ్గరగా ఉందన్నారు. సాధ్యం కానీ లక్ష్యాలు నిర్దేశించుకోలేదని, అలాగే మేము మోసపూరితంగా వ్యవహరించలేదని అన్నారు. అయితే చేయగల్గిందే చెప్పామని, చెప్పిందే చేసి చూపించామని, ప్రస్తుతం చేయగల్గిందే మేము ఈ మ్యానిఫెస్టోలో పొందుపరిచామని పేర్కొన్నారు. వంచిత వర్గాలు, పీడిత, పేద, మహిళ, యువ వర్గాలకు అందకుండా పోయిన న్యాయాన్ని అందిస్తామని, పదేండ్ల కాలంలో పేదలకు అందకుండా పోయిన ఫలాలు సైతం అందిస్తామని, ఇదే తమ హామీ అని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టోను పేదలకు అంకితం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రాహుల్‌ గాంధీ నిర్వహించిన జోడో యాత్రలో ఐదు స్తంభాలపై దృష్టి పెట్టామని చెప్పారు. అవి యువ న్యారు, కిసాన్‌ న్యారు, శ్రామిక న్యారు, నారీ న్యారు, హిస్సేదారీ న్యారు అని ఆయన వివరించారు. వాటి ఆధారంగా 25 గ్యారంటీలు పొందుపరిచామన్నారు. యువ న్యారులో భాగంగా అప్రెంటిస్‌షిప్‌ తప్పనిసరి చేస్తామన్నారు. అప్రెంటిస్‌ చేసేవారికి ఏడాదికి కనీసం రూ.1 లక్ష లభించేలా పథకాన్ని రూపొందించామని తెలిపారు. ఇక కిసాన్‌ న్యారులో భాగంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. శ్రామిక్‌ న్యారులో భాగంగా రూ.400 కనీస వేతనం నిర్ణయిస్తామని చెప్పారు. హిస్సేదారీ న్యారులో భాగంగా కులాల వారీగా జన గణన చేస్తామని, అయితే ఎవరు ఎంత సంఖ్యలో ఉంటే వారికి అంత వాటా దక్కేలా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. కులగణన ఏ ఒక్క వర్గానికి వ్యతిరేకంగా జరిగేది కాదన్నారు. అన్ని వర్గాల్లోని పేదలకు న్యాయం అందించడమే తమ ముందున్న లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇక ఆర్థిక న్యారులో భాగంగా ఆర్థిక న్యాయం, నిరుద్యోగం, పన్నుల సంస్కరణలు ఉన్నాయన్నారు. పరిశ్రమలు, మౌలిక వసతులు సైతం పెంపొందిస్తామని చెప్పారు. రాజ్య న్యారులో భాగంగా రాష్ట్రాలకు న్యాయం చేస్తామని, అందులో భాగంగా ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని అన్నారు.
రాష్ట్రాలు ఎదుర్కొనే ప్రకతి వైపరీత్యాల్లో చట్ట ప్రకారం కేంద్రం అందించే మద్దతు అందేలా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే దేశ అంతర్గత భద్రతను దృష్టిలో పెట్టుకుని రక్షా న్యారు ఏర్పాటు చేశామని, అందులో విదేశీ విధానం కూడా ఉందని అన్నారు. పర్యావరణ్‌ న్యారు అంశాన్ని కూడా అందులో పొందుపరిచామని, అయితే దీన్ని పూర్తిగా అధ్యయనం చేయాల్సిందిగా కోరుతున్నామని అన్నారు.
ఇక కాంగ్రెస్‌ పార్టీపై మోడీ అనుసరించిన దుష్టనీతి గురించి మీకు వివరించాలన్నారు. తమ పార్టీకి రూ.3వేల కోట్లకుపైగా ట్యాక్స్‌ పెనాల్టీ విధించారని గుర్తు చేశారు. ఇది లెవెల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌ అవుతుందా? ఇది ప్రజాస్వామ్య విధానమా? అని ఆయన ప్రశ్నించారు. మోడీ అంటే నిరంకుశం, నియంతృత్వమని ధ్వజమెత్తారు. వాటిని వదిలించుకోవాలంటే మోడీని గద్దె దించాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన గ్యారంటీలను ప్రతి ఇంటికీ చేర్చాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. ఈ గ్యారంటీలను ఇంటింటికీ తీసుకెళ్లినప్పుడే మార్పు అనేది సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. చందా తీసుకురా? కాంట్రాక్టు తీసుకో అన్నదే బీజేపీ విధానమని, ఆ పార్టీ వాషింగ్‌ మెషీన్‌లా మారిందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలో చేరగానే ఎన్ని కేసులున్నా సరే క్లీన్‌ అయిపోతారని అన్నారు. ఇటు దర్యాప్తు సంస్థలతో బెదిరించి, అటు దొంగలను పార్టీలో చేర్చుకుంటు న్నారంటూ బీజేపీపై మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత పదేండ్ల మోడీ పాలనలో అన్ని రంగాల్లోనూ విధ్వంసమే : చిదంబరం
గత పదేండ్ల మోడీ పాలనలో అన్ని రంగాల్లోనూ విధ్వంసమేనని కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌ చిదంబరం అన్నారు. బీజేపీ గత పదేండ్ల పాలనలో ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. నిరుద్యోగం పెరిగిపోయిందని విమర్శించారు. గడిచిన ఐదేళ్లలో ప్రజాస్వామ్యం బలహీనపడిందని విమర్శలు గుప్పించారు. మోడీ ప్రభుత్వం ధనవంతుల ప్రభుత్వమని, దేశంలో ఉన్న ఒక్క శాతం ధనికుల కోసమే బీజేపీ పాలన సాగిందని, నిరుపేదలను మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ప్రభుత్వ సంస్థలను పనిచేయనీయకపోవడం, బలహీన వర్గాల అణచివేత కొనసాగుతోందని అన్నారు. పార్లమెంట్‌ వ్యవస్థను కూడా బలహీనపరి చారని చిదంబరం ధ్వజమెత్తారు. ‘గత పదేండ్లలో దేశానికి జరిగిన నష్టాన్ని పూడ్చేలా మ్యానిఫెస్టోను సిద్ధం చేశాం. ఉద్యోగాలు, సంపద, సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తాం. గత పదేండ్లలో దేశం 5.9 శాతం మాత్రమే వృద్ధి సాధించింది. యూపీఏ తొలి విడత పాలనలో దేశం 8.5 శాతం వృద్ధి సాధించింది. 24 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం. 2024లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే పేదల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తాం. అధికారం చేపట్టగానే మరో 23 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పిస్తాం’ అని చిదంబరం వెల్లడించారు.

Spread the love