‘పాలేరు’కు తీసుకెళ్తున్నట్టే ఇక్కడా వదలండి..

'పాలేరు'కు తీసుకెళ్తున్నట్టే ఇక్కడా వదలండి..– తాగునీటి సమస్య పరిష్కరించాలి : ఐలాపురం చెరువులో మహిళలతో కలిసి జూలకంటి నిరసన
నవతెలంగాణ- మిర్యాలగూడ
సాగర్‌నీటితో చెరువులు, కుంటలు నింపి తాగు నీటి సమస్యను పరిష్క రించాలని.. తాగునీటి కోసం నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వ ద్వారా పాలేరు రిజర్వాయర్‌కు తీసుకెళ్తున్నారని.. నల్లగొండ జిల్లాలోనూ తాగునీటి సమస్య పరిష్కారానికి సాగర్‌ మెయిన్‌ కెనాల్‌ ద్వారా నీరు విడుదల చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని ఐలాపురం గ్రామం గిరిజన మహిళలతో కలిసి ఖాళీ బిందెలతో ఎండిపోయిన చెరువులో కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు పూర్తిగా ఎండిపోయాయని దాని ఫలితంగా సాగు, తాగు నీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటిపోయాయని వాపోయారు. ఐలాపురం గిరిజన ప్రజలు రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి సాగర్‌ మెయిన్‌ కెనాల్‌ ద్వారా తాగునీటిని తెచ్చుకుంటున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి కోసం నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ ద్వారా పాలేరు రిజర్వాయర్‌కు తీసుకెళ్తున్నారని.. జిల్లాలోనూ తాగునీటి సమస్యను పరిష్కరిం చేందుకు సాగర్‌ మెయిన్‌ కెనాల్‌ ద్వారా చుట్టుపక్కల చెరువులు, కుంటలు నింపాలని డిమాండ్‌ చేశారు. ఎడమ కాలువ పరిధిలో ఉన్న లిఫ్టుల ద్వారా చెరువులు, కుంటలకు నీరు మళ్లించినట్టయితే భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. తద్వారా మంచినీటి ఎద్దడిని నివారించొచ్చన్నారు. వెంటనే ప్రభుత్వం, అధికారులు స్పందించి సాగర్‌ నీటితో చెరువులు, కుంటలు నింపి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేశ్‌, రైతుసంఘం జిల్లా అధ్యక్షులు వీరెపల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి రవినాయక్‌, పగిడోజు రామ్మూర్తి, నాగేశ్వర్‌నాయక్‌, శ్రీనునాయక్‌, వెంకటేశ్వర్లు, జగన్‌ నాయక్‌, బాణావత్‌ నాగమ్మ, సునీత, లక్ష్మీ, ఈరి, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Spread the love