ఇక అంబేద్కర్‌ అభయహస్తం

ఇక అంబేద్కర్‌ అభయహస్తం– ఎన్నికల తర్వాత పథకం అమలు
– రూ.12 లక్షల ఆర్థిక సహాయం
– కలెక్టర్లు, ఇన్‌చార్జి మంత్రులకు బాధ్యత
– ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయించి అమలు చేసే ఛాన్స్‌
– 38 వేల మందికి దళిత బంధు ఇచ్చిన గత ప్రభుత్వం
తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ 2023 ఎన్నికల వేళ ప్రకటించిన మ్యానిపెస్టోలో భాగంగా రెండో డిక్లరేషన్‌ కింద ‘అంబేద్కర్‌ అభయహస్తం’ పేరిట ఎస్సీ, ఎస్టీలకు రూ.12 లక్షల  ఆర్థిక సహాయం అందిస్తామని పీసీసీ ధ్యక్షులు, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో కొన్ని పథకాల్ని అమలు చేశారు. అలాగే  దళిత, గిరిజనుల  సంక్షేమం కోసం అంబేద్కర్‌ అభయహస్తం పేరిట కొత్త పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. పార్లమెంట్‌ ఎన్నికలు ముగిసిన వెంటనే రాష్ట్రంలో  అంబేద్కర్‌ అభయహస్తం పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం దళితుల్ని ఆకర్షించేందుకు దళిత బంధు పేరిట రూ.10 లక్షల ఆర్థిక సహాయం  అందించిన విషయం తెలిసిందే.
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం రాష్ట్రంలో 63,60,158 మంది ఎస్సీలు, 36,02,288 మంది గిరిజనులున్నారు. రాష్ట్ర జనాభాలో 17.50 శాతం ఎస్సీలు, 9.91 శాతం ఎస్టీలు.. మొత్తం కలిపి 27.41 శాతం ఉన్నారు. అందుకే కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో దళితులు, గిరిజనుల సంక్షేమం కోసం పెద్దపీట వేసిందని చెప్పాలి. అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం అంబేద్కర్‌ అభయహస్తం పేరిట ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటిం చింది. అన్ని రకాల కాంట్రాక్టుల్లోనూ ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, పారిశ్రామిక వేత్తలకు ఇచ్చే ప్రోత్సాహకాలను ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకూ వర్తింపచేస్తామని రేవంత్‌రెడ్డి తన రెండో డిక్లరేషన్‌లో ప్రకటించారు.
అంబేద్కర్‌ అభయహస్తం
దళిత బంధు స్థానంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘అంబేద్కర్‌ అభయహస్తం’ పథకం పేరును ఎన్నికల ముందే ప్రకటించారు. కాగా, పార్లమెంట్‌ ఎన్నికలు రావడంతో కొత్త పథకాలకు బ్రేక్‌ పడింది. కోడ్‌ ముగిసిన వెంటనే ఎస్సీ, ఎస్టీల కోసం అంబేద్కర్‌ అభయహస్తం పథకానికి శ్రీకారం చుట్టే అవకాశముంది. ఇప్పటికే పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు. పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలనే విషయంలోనూ ఒక అంచనాకు వచ్చినట్టు చెబుతున్నారు. కోడ్‌ ముగియగానే అన్ని పార్టీల ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. అధికారిక ప్రకటన ఇవ్వడంతో పాటు పూర్తి స్థాయి బడ్జెట్‌ను కూడా కేటాయిం చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల ఆర్థిక సహాయాన్ని.. బ్యాంకు లింకేజీ, ఇతర ష్యూరిటీ ల్లేకుండా నేరుగా లబ్దిదారునికే అందించే అవకాశముంది. వంద శాతం సబ్సిడీ వర్తిస్తుంది. లబ్దిదారుల ఎంపిక, పథకం అమలు, యూనిట్ల గ్రౌండింగ్‌కు సంబంధించిన మార్గదర్శకాల్ని తయారు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పథకాన్ని అమలు చేస్తారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రుల్ని సైతం అంబేద్కర్‌ అభయహస్తం పథకం అమల్లో భాగస్వాముల్ని చేసే అవకాశముందంటున్నారు.
దళిత బంధు లోపాలు పునరావృతం కాకుండా జాగ్రతలు
గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు పథకంలో దొర్లిన లోపాలు.. పునరావృతం కాకుండా కాంగ్రెస్‌ జాగ్రత్తలు తీసుకుంటుంది. 2021 ఆగస్టు 16న దళిత బంధు పథకాన్ని ప్రారంభించి తొలి దశలో నియోజక వర్గానికి 100 కుటుంబాలకు దళితబంధు ఇచ్చారు. రెండో దశలో అసెంబ్లీ ఎన్నికల ముందు నియోజకవర్గానికి 1100 మంది చొప్పున లబ్దిదారుల్ని ఎంపిక చేశారు. కోడ్‌ రావడంలో ఆగిపోయింది. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల వేళ పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకుని నియోజకవర్గంలోని మొత్తం 20,929 దళిత కుటుంబాలకు దళిత బంధు కింద రూ.10 లక్షల చొప్పున ఇచ్చారు. ఎన్నికల కోసం తప్ప సదుద్దేశంతో పథకాన్ని అమలు చేయలేదన్న అపవాదు వచ్చింది. లబ్దిదారుల ఎంపికలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఫైనల్‌ చేసిన లిస్ట్‌లను కలెక్టర్లు ఆమోదించారు. యూనిట్ల ఎంపిక సరిగ్గాలేక మధ్యలోనే ఇచ్చిన యూనిట్లను అమ్ముకు న్నారన్న ఫిర్యాదులొచ్చాయి. అనర్హులైన లబ్దిదారులకిచ్చి వారి నుంచి రెండు, మూడు లక్షలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ల అనుచరులు వసూలు చేశారని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని అప్పటి సీఎం కేసీఆర్‌ ప్రకటిం చారు. కొంతమంది ఎమ్మెల్యేలు హెచ్చరించినట్టు మీడియాలో వార్తలూ వచ్చాయి. దాంతో అభయహస్తం పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం చూస్తోంది. ఒక కుటుంబానికి రూ.12 లక్షల ఆర్థిక సాయం ఇవ్వడం ద్వారా ఉపాధి పొందుతూ మరింత అభివృద్ధి చెందే విధంగా మానిటరింగ్‌ చేయాలని, భావిస్తోంది. నిరుపేదలకే ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు.
ఎస్సీ, ఎస్టీల్లో ఆశలు
ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా సాంస్కృతికంగా వెనుకబడిన దళిత, గిరిజనుల సంక్షేమానికి పాటు పడతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అంబేద్కర్‌ అభయహస్తం అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీలు కోరుతున్నారు. ఇందిరాగాంథీ గరిబీ హటావో అన్న నినాదం మొదలు.. ఇప్పటివరకు.. అనేక ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతూ వచ్చాయి. కానీ ఇప్పటికీ వారు అభివృద్ధికి నోచుకోలేదు. ప్రయివేటీకరణ ఫలితంగా రిజర్వేషన్లు దెబ్బతిని ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేకుండా పోయాయి.
బీసీ, మైనార్టీలకేది భరోసా
ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం అంబేద్కర్‌ అభయ హస్తం పథకాన్ని పెట్టనున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీ, మైనార్టీలకు కూడా అమలు చేసి భరోసా ఇవ్వాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి. గత ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు దళిత బంధుతో పాటు బీసీ, మైనార్టీలకు కూడా బంధు పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిచేందుకు లబ్దిదారుల్ని ఎంపిక చేసింది. ఈ ప్రభుత్వం అంబేద్కర్‌ అభయహస్తం పథకాన్ని బీసీ, మైనార్టీలకు వర్తింప చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

Spread the love