రైతుల్ని చంపడమే గుజరాత్‌ మోడల్‌

Gujarat model is killing farmers

– కేసీఆర్‌ కుటుంబ పెద్ద మోడీనే..
– బీఆర్‌ఎస్‌, బీజేపీది వీడదీయలేని బంధం
– కార్యకర్తల కష్టం, రక్తంతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది
– త్వరలో ఇందిరమ్మ కమిటీలు
– పార్లమెంట్‌ ఎన్నికల్లో 14 ఎంపీ సీట్లు గెలిచి తీరుతాం : చేవెళ్ల ‘జన జాతర’ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
కేసీఆర్‌ తన కుటుంబ పంచాయితీని మోడీ వద్దకు తీసుకెళ్లారు.. కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్‌ తనను కలిసినట్టు గతంలో స్వయంగా మోడీనే చెప్పారు.. మోడీ, కేడీ(కేసీఆర్‌)లు అంటకాగుతూ దేశాన్ని దోచుకుతిన్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో రైతులను కాల్చి చంపడం.. ఊర్లకు ఊర్లను తగులబెట్టడమే గుజరాత్‌ మోడలా..? అని ప్రశ్నించారు. పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ పని అని విమర్శించారు. ఎక్కడ ఎన్నికల జరిగితే అక్కడ ఈడీ, సీబీఐలను ఉసిగోల్పి పార్టీ ఫిరాయింపులకు పాల్పడటమే బీజేపీకి తెలిసిన నీతి అన్నారు. ఆరు గ్యారంటీలో భాగంగా రూ.500కే గ్యాస్‌, 200 యూనిట్ల ఉచిత కరెంట్‌ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించిన నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్‌ ‘జన జాతర సభ’ నిర్వహించింది. ఈ సభకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అధ్యక్షత వహించగా.. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంలో కార్యకర్తల కష్టం, రక్తం ఉందన్నారు. తనూ కార్యకర్త స్థాయి నుంచే సీఎం అయ్యానని, కార్యకర్తలు గెలిచినప్పుడే పార్టీ గెలిచినట్టుగా భావిస్తానని స్పష్టం చేశారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు తుక్కుగూడలో నిర్వహించిన సభలో సోనియగాంధీ ఆరు గ్యారంటీలను ప్రకటించినట్టు గుర్తు చేశారు. ప్రజల ఆశలను నెరవేర్చడంలో భాగంగా అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు పథకాలు అమలు చేశామన్నారు. ఈ రోజు నుంచి రెండు పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం దీపం పథకం కింద రూ.400లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చిందన్నారు. కానీ మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత దాన్ని రూ.1200 చేశారన్నారు. కానీ తాము మహిళల కన్నీళ్లు తుడవాలన్న ఉద్దేశంతో రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తున్నట్టు తెలిపారు. అర్హులందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తామన్నారు. అర్హులు ఉంటే స్థానిక అధికారుల దగ్గర దరఖాస్తు చేసుకుని, పథకాలు పొందాలని సూచిం చారు. ఇది నిరంతర ప్రక్రియ అని భరోసానిచ్చారు. మహిళాసంఘాలను బలోపేతం చేస్తామన్నారు. త్వరలోనే ప్రతి గ్రామంలో ఐదుగురు సభ్యులతో ఇందిరమ్మ కమిటీలు వేస్తామని ప్రకటించారు. ఈ కమిటీల ద్వారానే పథకాలు పేదలకు అందిస్తామన్నారు.
14 ఎంపీ సీట్లు గెలుస్తాం..
రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలిచి సోనియమ్మకు కానుకగా ఇస్తామని సీఎం చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ సీట్లు గెలుపించుకునే బాధ్యత తనదే అన్నారు. తనతో కార్యకర్తలు కలిసి రావాలన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, దమ్ముంటే ఒక్క సీటు అయినా గెలిచి చూపించాలని మాజీ మంత్రి కేటీఆర్‌కు సవాల్‌ విసిరారు. పంట చేనులో అడవి పందులు పడి పంటను నాశనం చేసినట్టు.. తెలంగాణ రాష్ట్రంలో పదేండ్లపాటు కల్వకుంట్ల కుటుంబం దోచుకుతిన్నదని ఆరోపించారు. నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగిందన్నారు… నిజామాబాద్‌లో ఓడిపోయిన కవితను ఆరు నెలల్లో ఎమ్మెల్సీని, కరీంనగర్‌లో ఓడిపోయిన వినోద్‌కుమార్‌ను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిని చేసిన కేసీఆర్‌.. నిరుద్యోగ యువతకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోడీ హామీలను గాలికి వదిలేశారన్నారు. మళ్లీ మోడీనే రావాలని బీజేపీ నేతలు రాష్ట్రంలో తిరుగుతున్నారని , పదేండ్లపాటు ఉన్నది మోడీయే కదా.. ఏమి చేశారని ప్రశ్నించారు. తమది నిరుద్యోగులు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వమని, కచ్చితంగా ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే 25 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు అందజేశామన్నారు. మార్చిలో 6 వేల ఉద్యోగాలు, త్వరలో మెగా డీస్సీ వేస్తామ న్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌కు ఓట్లు వేస్తే ఉపయోగం ఏమీ ఉండదని, పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. చేవెళ్లలో ఎవరికి టికెట్‌ ఇచ్చినా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలని క్యాడర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహ్మారెడ్డి, వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతా మహేందర్‌రెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love