బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లో టెన్షన్‌..టెన్షన్‌

Tension in BRS and Congress..tension– మారుతున్న రాజకీయ పరిణామాలే సాక్ష్యం
– పీిఠం దక్కేదెవరికో !?
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తొలిదశ ప్రచారం దాదాపు ముగిసినట్టే. శుక్రవారం నామినేషన్ల చివరిరోజు కావడంతో గురువారం జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. రాజకీయ పార్టీల కదలికలు సైతం విపరీతంగా పెరిగాయి. కప్పదాట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జంప్‌ జిలానీలతో ఆయా పార్టీలకు తిప్పలు తప్పడం లేదు. టికెట్లు, రానివాళ్లు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుతున్నారు. ఇదిలావుండగా వామపక్షాలు సైతం ఎన్నికల గోదాలోకి దిగాయి. ప్రధానంగా సీపీఐ(ఎం) 19 శాసనసభా నియోజకవర్గాల్లో ఎన్నికల సమరాంగణంలోకి దూకింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మలిదశ ప్రచారానికి రాజకీయ పార్టీలు శ్రీకారం చుట్టనున్నాయి. అధికార పార్టీ బీఆర్‌ఎస్‌, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లో పీఠం కోసం ఆరాటం రోజురోజుకు అధికమవుతున్నది. వస్తమో, రామో, సీఎం కుర్చీ దక్కుతతో, లేదో అనే పరేషాన్‌ ఆ రెండు పార్టీలను పీడిస్తున్నది. రకరకాల టీవీలు, పోల్‌ సర్వే సంస్థల ఫలితాలు ఈ రెండు పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. కొన్ని సర్వేలు బీఆర్‌ఎస్‌కు మరికొన్ని సర్వేలు కాంగ్రెస్‌కు మొగ్గుచూపుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీకి వైఎస్సార్‌ టీపీ జైకొట్టింది. బీఆర్‌ఎస్‌కు ఎంఐఎంపై భరోసా ఉంది. బీజేపీకి జనసేన మద్దతు ప్రకటించింది. అయినా ఆపార్టీ లేచే పరిస్థితి కనిపించడం లేదు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు నాలుగైదు సీట్లు ఏమైనా తక్కువతే , అవతలిపక్షం నుంచి ఎమ్మల్యేలను గుంజుకునే టక్కుటమార విద్యల సంగతి అందరికీ ఎరుకే. బీఆర్‌ఎస్‌ ఇందులో ఆరితేరింది. కాంగ్రెస్‌కేమో తమ పక్షం నుంచి ఎక్కడ ఫామ్‌హౌజ్‌కు వెళతారోననే భయం. ఏదీఏమైనా ఇరుపార్టీలకూ కూసింత టెన్షన్‌ తప్పడం లేదు. హాఫ్‌ సెంచరీ దాటితే చాలు, ఎలాగైనా గట్టెక్కొచ్చనే భావన రెండుపార్టీల్లోనూ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నది.
బీఆర్‌ఎస్‌..
చంద్రబాబు అరెస్ట్‌, జైలు ప్రభావం గ్రేటర్‌ హైదరాబాద్‌లో భారీగానే గులాబీకి సీట్లకు గండికొట్టే ప్రమాదం కనిపిస్తున్నది. బీఆర్‌ఎస్‌ నాయకులకు రాత్రిళ్లు నిద్రపట్టే పరిస్థితి లేదు. పదేండ్ల పరిపాలన నేపథ్యంలో రాష్ట్రంలో గ్రాఫ్‌ బాగా పడిపోయిందనే ఇంటెలిజెన్స్‌ నివేదిక తరుణంలో బాబు కేసు కేసీఆర్‌ను తీవ్రంగా కలచివేస్తున్నది. అందుకే ఏపీ జగన్‌పై గులాబీ బాస్‌ గుర్రుగా ఉన్నారనే ప్రచారం ఆ పార్టీ శ్రేణుల్లో సాగుతున్నది. అందుకే హెలికాప్టర్ల సంఖ్య పెంచి మరీ నగరంతోపాటు నగరేతర ప్రాంతాలకు సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు ప్రచారానికి పరుగు, పరుగున వెళుతున్నారు. వారి ముగ్గురికీ కాళ్లు నిల్వడం లేదు. ఈ ముగ్గురే ప్రధాన స్టార్‌ క్యాంపెయినర్లుగా ఎన్నికల వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. బీఆర్‌ఎస్‌లోనూ రెబెల్స్‌ తయారవుతున్నారు. ఆలంపూర్‌లో పరిస్థితి దారుణంగా తయారైంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు టికెట్‌ దక్కకపోవడంతో పరిస్థితులు తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు, ఆయన నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా స్థానికులు చుక్కలు చూపెడుతున్నారు. కామారెడ్డి పోటీ రసవత్తరమే. కొడంగల్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిది చెప్పలేని పరిస్థితి. ఆర్మూర్‌లో స్థానిక ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ప్రచారంలో ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ఐదేండ్ల సందీ అభివృద్ధి చేయలేదు, ఇప్పుడెందుకు వచ్చినవంటూ అమ్మలక్కలు నిలదీయడం టీవీల్లో అందరూ చూస్తున్నారు. కొడికత్తి దాడి రాజకీయ విమర్శలు చేయడానికి తప్పితే, దేనికి పనికిరాదని తేల్చుకున్నట్టుగా కనిపిస్తున్నది. రాజకీయ విశ్లేషకులు సైతం అదే చెబుతున్నారు. కొందరు మంత్రుల పరిస్థితీ బాగాలేదనే ప్రచారం జరుగుతున్నది. కేసీఆర్‌ ఎప్పటికప్పుడు ఎత్తుకుపైఎత్తులు వేస్తూ ముందుకుసాగుతున్నా, ఎక్కడో ఏమూలకో ఒకింత అనుమానం. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా, లోపల పరేషానే ఉందంటూ ఆ పార్టీ నాయకులు తెలంగాణ భవన్‌లో గుసగుసలు పెడుతుండటం గమనార్హం.
కాంగ్రెస్‌
కాంగ్రెస్‌ అప్పుడే కుర్చీమీద కూసున్నట్టు కలలు కంటున్నదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే నాకిన్ని, నీకిన్ని అని సీట్లు పంచుకున్న ఆ పార్టీ నేతలు ప్రచారంలోకి వచ్చేసరికి అభ్యర్థుల తిప్పలను పట్టించుకోవడం లేదు. టికెట్లు ఇప్పించుకోవడంలో సాగించుకున్న ఆపార్టీ నేత రేవంత్‌రెడ్డికి, కోమటిరెడ్డి బ్రదర్స్‌ కొరకరాని కొయ్యలుగా తయారయ్యారు. మధ్యలో కుందూరు జానారెడ్ది సీఎం సీటు తననే వరిస్తుందంటూ పుష్పకవిమానంలో విహరిస్తున్నారు. కానీ, నియోజకవర్గాల్లో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగానే ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో టీడీపీ ఓట్లన్నీ గంపగుత్తగా కాంగ్రెస్‌ డబ్బాలో పడతాయనే అత్యాశ కనిపిస్తున్నది. కానీ, ఫీల్డ్‌లో మాత్రం పరిస్థితులు వేరుగానే ఉన్నాయి. అడ్డగోలుగా తిట్టి ఉపఎన్నికల్లో బీజేపీలోకి వెళ్లిన రాజగోపాల్‌రెడ్డి, మళ్లీ ఎన్నికలోచ్చేసరికి కాంగ్రెస్‌ జాబితాలో చోటుసంపాదించుకోవడం ఆశ్చర్యమే. అదే కాంగ్రెస్‌ గొప్పతనమంటూ గాంధీభవన్‌లో బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. బండబూతులు తిట్టిన ఆయనకు ఎర్రతివాచి పరిచి మరి టిక్కెటిచ్చారు. దీనికి పార్టీ పెద్దల మౌనమే సమాధానమైంది. దీనికితోడు ఆర్థిక, అంగబలమున్న నేతలకు టికెట్లు అప్పజెబుతున్నారు. వనపర్తి, బోథ్‌లో అభ్యర్థులను అందుకే మార్చారు. చేవెళ్లలోనూ అదే జరగనుందట ! పొంగులేటితోపాటు ఆయన అనుచరులకు టికెట్లు కట్టబెట్టారు. సుమారు ముఫ్పై స్థానాల్లోని అభ్యర్థులకు సదరు పొంగులేటి ఫైనాన్స్‌ చేస్తున్నట్టు వినికిడి. వివేక్‌ రాకతో బాల్కసుమన్‌కు ఎసరుపెట్టొచ్చనే వ్యూహాం ఉండనే ఉంది. నర్సాపూర్‌లో అనిల్‌కుమార్‌ నామినేషన్‌ వేసి, భారీ ర్యాలినే తీశాడు. ఆవుల రాజిరెడ్డికి టికెట్‌ ఇవ్వడాన్ని స్థానిక పార్టీ నేతలు గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు. ములుగులో సీతక్క గెలుపుని అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్‌ సర్వశక్తులనూ ఒడ్డుతున్నది. అక్కడ కాంగ్రెస్‌ను ఖాళీచేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడం సవాలుగా మారింది. ఈ పార్టీ ప్రధాన బలహీనత ఇతరపార్టీల్లో నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేస్తుండటం. ఇప్పటికే ఉన్నవారిని పట్టించుకోకపోవడం, టికెకట్లను నిరాకరించడం. ఇకపోతే ఆపార్టీలో ఎన్ని గుంపులో లెక్కపెట్టడమూ కష్టమే. ఈ పరిస్థితే కొంపముంచుతుందేమోనని గాంధీభవన్‌ విశ్లేషకులే సెలవిస్తున్నారు.

Spread the love