కులగణనకు సీడబ్ల్యూసీ ఏకగ్రీవ మద్దతు

CWC for Caste Census Unanimous support New Delhi: Congress President Mallikarjun Kharge with party leaders Sonia Gandhi, Rahul Gandhi, KC Venugopal, Jairam Ramesh, Adhir Ranjan Chowdhury and Ambika Soni during the Congress Working Committee meeting at the AICC Headquarters, in New Delhi, Monday, Oct. 9, 2023. (PTI Photo/Manvender Vashist Lav)(PTI10_09_2023_000040B)– వంద శాతం కట్టుబడి ఉన్నాం
– ఇది మా అత్యున్నత ప్రాధాన్యత
– కాంగ్రెస్‌ పాలిత నాలుగు రాష్ట్రాల్లో అమలుచేస్తాం : రాహుల్‌ గాంధీ
న్యూఢిల్లీ : దేశంలో కులగణనకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. సీడబ్ల్యూసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడమనేది ప్రగతిశీలమైన, శక్తివంతమైన అడుగుగా ఆయన అభివర్ణించారు. ఇది కీలకమైన ముందడుగుగా ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌ ముఖ్యమం త్రులు సైతం బలంగా విశ్వసిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఏఐసీసీ కార్యాలయంలో సోమవారం సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. నాలుగు గంటల పాటు సుధీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్‌ పాలిత ముఖ్యమంత్రులు, సీడబ్ల్యూసీ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా దేశంలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, ఐదు రాష్ట్రాల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. సమావేశ అనంతరం కాంగ్రెస్‌ పాలిత ముఖ్యమంత్రులు అశోక్‌ గెహ్లాట్‌, సిద్ధ రామయ్య, భూపేష్‌ భఘేలా, సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు, ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్‌, జైరాం రమేష్‌ తో కలిసి రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల్లోని తమ (కాంగ్రెస్‌) ముఖ్యమంత్రులు కులగణను కీలకంగా తీసుకుని దీనిపై తగు చర్యలు తీసుకుంటారని చెప్పారు.
కులగణనకు సిద్ధంగాలేని మోడీ
దేశవ్యాప్తంగా కులాల వారీ సర్వేను మోడీ నిర్వహించకపోవడాన్ని రాహుల్‌ తప్పుపట్టారు. తప్పుదారి పట్టించే వ్యూహాలతో కులాల సర్వే నిర్వహణకు మోడీ గండికొడుతున్నారని అన్నారు. ‘కులగణనకు ఆయన (మోడీ) సిద్ధంగా లేరు. మాకున్న నలుగురు ముఖ్యమంత్రుల్లో ముగ్గురు ఓబీసీలు. 10 మంది బీజేపీ ముఖ్యమంత్రుల్లో ఒక్కరే ఓబీసీ క్యాటగిరీకి చెందిన వారున్నారు. ఓబీసీల నుంచి బీజేపీ సీఎంలు ఎందరు ఉన్నారు? ఓబీసీలకు మోడీ చేసిందేమీ లేదు. ప్రధానమైన సమస్యల నుంచి వారి దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు’ అని రాహుల్‌ అన్నారు.
కుల గణనకు వంద శాతం మద్దతు: సోనియా గాంధీ
సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ మాట్లాడుతూ ”దేశవ్యాప్త కుల గణనకు మనం 100 శాతం మద్దతు ఇవ్వాలి. ఇది మన పార్టీ అత్యున్నత ప్రాధాన్యత” అని నొక్కిచెప్పారు. కుల గణన పూర్తి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ తీర్మానం ఆమోదించింది. షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు (ఓబీసీలు) సహా మహిళలకు తగిన ప్రాతినిధ్యం ఉండేలా, లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను త్వరగా అమలు చేస్తామని పార్టీ హామీ ఇచ్చింది. ‘మోడీ ప్రభుత్వం (మహిళల రిజర్వేషన్‌ బిల్లు అమలుపై) విధించిన జనాభా లెక్కలు, డీలిమిటేషన్‌ వంటి అనవసరమైన అడ్డంకులు తొలగిస్తాం’ అని తీర్మానంలో పేర్కొంది.
ఐదు రాష్ట్రాల్లో విజయానికి ఐక్యతతో పని చేయాలి: ఖర్గే
త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు తమ శక్తియుక్తులతో పాటు సమన్వయం, క్రమశిక్షణ, ఐక్యతతో పని చేయాలని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల సామాజిక న్యాయం, హక్కులను నిర్ధారించడానికి దేశవ్యాప్త కుల గణనను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై బీజేపీ మౌనంగా ఉందని విమర్శించారు. సంక్షేమ పథకాల్లో సరైన భాగస్వామ్యం కోసం, సమాజంలోని బలహీన వర్గాల స్థితిగతులపై సామాజిక-ఆర్థిక డేటాను కలిగి ఉండటం, సామాజిక న్యాయాన్ని నిర్ధారించడం చాలా ముఖ్యం అని ఆయన నొక్కి చెప్పారు. ‘ద్రవ్యోల్బణం, నిరుద్యోగం కట్టడి, పాత పెన్షన్‌ పథకాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యాన్ని ఎదుర్కొంది. అధికార పార్టీ విభజన వ్యూహాలు, స్వయం ప్రతిపత్తి సంస్థల దుర్వినియోగం ప్రజాస్వామ్యానికి ముప్పు కలిగిస్తుంది’ అని అన్నారు.
మణిపూర్‌కు వెళ్లలేని ప్రధానమంత్రి, ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు తరచూ వెళ్లడం దారుణమన్నారు. కాంగ్రెస్‌ పార్టీపై అబద్ధాలతో కూడిన నిరాధారమైన దాడులు రాబోయే రోజుల్లో మరింత పెరుగుతాయని, ఈ అబద్ధాలను మనం ఎదుర్కోవడం చాలా అవసరమని అన్నారు. 2024లో దేశం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లను పరిష్కరించి, బడుగు బలహీన వర్గాల, యువత, మహిళలు, రైతులు, కూలీలకు అండగా నిలిచే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీ తప్పనిసరిగా కృషి చేయాలని అన్నారు. ”కాంగ్రెస్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు, గత కాంగ్రెస్‌ ప్రభుత్వాల యొక్క ఆదర్శప్రాయమైన పనిని మనం ప్రచారం చేయాలి. ఈ విజయాలను హైలైట్‌ చేయడంతో ప్రజలలో విశ్వాసాన్ని నింపగలం. ఉజ్వల భవిష్యత్తుకు హామీ ఇవ్వగలం” అని అన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటకలో నిర్ణయాత్మక విజయాల తర్వాత కార్యకర్తల్లో నూతనోత్సాహం వచ్చిందని, ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ‘గెలవడానికి మన శక్తినంతా కూడగట్టుకుని పూనుకోవాల్సిన అవసరం ఉందని’ ఖర్గే అన్నారు.

Spread the love