ప్రతి పేద కుటుంబానికి ఏటా రూ.లక్ష బ్యాంకు ఖాతాలో వేస్తాం: రాహుల్​ గాంధీ

నవతెలంగాణ – హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే.. దేశవ్యాప్తంగా ప్రతి పేద కుటుంబానికి ఏటా లక్ష రూపాయలను బ్యాంకు ఖాతాలో వేస్తామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తామని.. జనాభాకు తగినట్టుగా అందరికీ రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించారు. అదే బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఆరోపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ మాట్లాడారు.
బీజేపీ పేదల హక్కులను హరించి.. ధనికులకు ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. తాము ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేస్తామంటే తప్పుపడుతున్నారని.. మరి బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ పెద్దలకు రుణాలు ఎందుకు మాఫీ చేసిందని నిలదీశారు. బీజేపీ సంపన్నులకు 16 లక్షల కోట్ల మేర రుణాలు మాఫీ చేసిందని.. ఆ డబ్బును పేదలకు పంచితే ఒక్కొక్కరికి 25 వేల రూపాయలు వస్తాయని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే దేశ రాజ్యాంగ్యాన్ని మార్చేస్తుందని.. రాజ్యాంగం మారితే రిజర్వేషన్లు రద్దు అవుతాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.  తాము గెలిస్తే.. దేశంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగం పక్కాగా అందించే స్కీం తెస్తామన్నారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి చూపిస్తామని.. ఏడాదిపాటు శిక్షణ, ప్రతినెలా రూ. 8,500 భృతి ఇస్తామని చెప్పారు. దేశంలో ఉన్న 30 లక్షల ఉద్యోగాల ను భర్తీ చేస్తామన్నారు.

Spread the love