ఎయిర్‌ కండిషనింగ్‌ ఖర్చును తల్లిదండ్రులే భరించాలి

నవతెలంగాణ – న్యూఢిల్లీ : పాఠశాలలో ఎయిర్‌ కండిషనింగ్‌కు అయ్యే ఖర్చును తల్లిదండ్రులే భరించాలని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. లాబరేటరీ ఫీజ్‌, స్మార్ట్‌ కార్డ్‌ ఫీజ్‌ వంటి ఇతర ఛార్జీల నుండి భిన్నంగా లేదని తెలిపింది. తరగతుల్లో ఎయిర్‌ కండిషనింగ్‌ కోసం నెలకు రూ.2,000 అదనంగా వసూలు చేస్తున్న ప్రైవేట్‌ పాఠశాలలకు వ్యతిరేకంగా దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌)ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. ఈ ఆర్థిక భారం కేవలం పాఠశాల యాజమాన్యం మాత్రమే భరించదని, తల్లిదండ్రులు పాఠశాలలను ఎంపిక చేసుకునేటప్పుడు పాఠశాలలో పిల్లలకు కల్పించే సౌకర్యాలు, వాటి ఖర్చులపై దృష్టి పెట్టాలని అన్నారు. ఎయిర్‌కండిషనింగ్‌ ఛార్జీల రసీదును పాఠశాల సక్రమంగా నమోదు చేస్తుందని, ప్రాథమికంగా పాఠశాల విధించే ఛార్జీలో ఎలాంటి అవకతవకలు లేవని పేర్కొంది. కేవలం పాఠశాల యాజమాన్యంపై మాత్రమే ఇటువంటి సౌకర్యాలకు సంబంధించిన ఆర్థిక భారాన్ని వేయలేమని జస్టిస్‌ మన్మీత్‌ పి.ఎస్‌. అరోరాతో కూడిన ధర్మాసనం మే 2న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివిన విద్యార్థి ఈ పిల్‌ను దాఖలు చేశారు. విద్యార్థులకు ఎయిర్‌ కండిషనింగ్‌ సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందని, సొంత నిధులు, వనరులతో పాఠశాలలే వాటిని అందించాలని పిటిషన్‌లో కోరారు.

Spread the love