12వ తరగతి పాఠ్యపుస్తకం నుంచి ‘ప్రత్యేక సిక్కు దేశం’ డిమాండ్‌ తొలగింపు

నవతెలంగాణ – ఢిల్లీ
పన్నెండో తరగతి పొలిటికల్‌ సైన్స్‌ పాఠ్యపుస్తకం నుంచి ప్రత్యేక సిక్కు దేశం కావాలన్న ఖలిస్థాన్‌ డిమాండ్‌కు సంబంధించిన అంశాలను నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) తొలగించింది. ఈ మేరకు విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. 12వ తరగతి పొలిటికల్‌ సైన్స్‌ పాఠ్యపుస్తకంలో సిక్కుల గురించిన చారిత్రక వివరాలను తప్పుగా ప్రచురించారంటూ శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ (ఎస్‌జీపీసీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని ఎన్‌సీఈఆర్‌టీ దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో సదరు పాఠ్యపుస్తకం నుంచి ప్రత్యేక సిక్కు దేశం డిమాండ్‌కు సంబంధించిన అంశాలను తొలగిస్తున్నట్లు ఎన్‌సీఈఆర్‌టీ వర్గాలు వెల్లడించాయి. డిజిటల్‌ పుస్తకాల్లోనే ఈ మార్పు ఉంటుందని, ఇప్పటికే ముద్రితమైన పుస్తకాలు యథాతథంగా ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

Spread the love