మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు

నవతెలంగాణ – ఢిల్లీ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ ప్రయత్నాలు ఫలించలేదు. భార్యకు అనారోగ్యంగా ఉందంటూ 6 వారాలకు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలని సిసోడియా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన భార్యను చూసుకునేందుకు తానొక్కడ్నే ఉన్నానని, అందువలన మధ్యంతర ప్రాతిపదికన బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బెయిల్ కోసం ఆశగా ఎదురుచూసిన ఆయనకు మరోసారి చుక్కెదురైంది. సిసోడియా మధ్యంతర బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. అయితే, భార్యను చూసేందుకు సిసోడియాకు అనుమతించింది. ఏదైనా ఒకరోజు తన నివాసం వద్ద కానీ, ఆసుపత్రిలోనైనా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో భార్యను కలిసేందుకు ఆమోదం తెలిపింది. భార్యను కలిసేందుకు సిసోడియాకు కోర్టు శనివారం అనుమతిచ్చినప్పటికీ, సిసోడియా నివాసానికి వెళ్లేసరికి అప్పటికే ఆయన భార్య ఆసుపత్రిలో చేరారు. దాంతో సిసోడియా తన భార్యను కలవలేకపోయారు. ఈ నేపథ్యంలో, భార్య కలిసేందుకు సిసోడియాకు కోర్టు మరో అవకాశం ఇచ్చింది.

Spread the love