నవతెలంగాణ హైదరాబాద్: హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారాలన్న, బాగుపడాలన్నా పౌరుల భాగస్వామ్యం తప్పనిసరి అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఖైరతాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆవరణలోని చెట్ల వల్ల ఎండాకాలంలో కూడా ఏసీ ఆడిటోరియం కంటే కూడా బాగుంది అని కేటీఆర్ పేర్కొన్నారు. మన నగరం జీవన ప్రమాణాలలో నివాసయోగ్యంగా ఉంది. ఇంకా నగరం అభివృద్ధి చెందడానికి జరగాల్సిన పని కూడా చాలా ఉంది. సరిగ్గా 9 ఏండ్ల క్రితం ఏర్పాటైన తెలంగాణలో నగరం, నాయకత్వం, మౌలిక వసతుల గురించి ఎన్నో అపోహాలు, అనుమానాలు ఉండేవి. కానీ ఇవాళ 10వ వసంతలో అడుగుపెడుతున్న సందర్భంగా ఎక్కడ ఏ ర్యాంకింగ్ తీసుకున్నా.. ప్రతి దాంట్లో అగ్రభాగాన నిలుస్తూ దేశానికే దిక్సూచిగా మారిందని తెలిపారు.
సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్‌మెంట్ నివేదికలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించి విడుదల చేసిన తాజా బుక్‌లో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే చాలా ముందు వరుసలో ఉన్నాం. ఇది రాష్ట్రానికి గౌరవ కారణం. కేసీఆర్ సాగునీరు, తాగునీరు, అటవీ సంపద, పంచాయతీ రాజ్, పట్టణాభివృద్ధి, పరిశ్రమల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. ఏ రంగాన్ని కూడా కేసీఆర్ విస్మరించలేదు. అన్ని రంగాల్లో హైదరాబాద్, తెలంగాణ అగ్రభాగానా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. దేశంలోనే హైదరాబాద్ ఉత్తమ నగరంగా ఉందని పలు నివేదికలు వెల్లడించాయని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్ బాగానే ఉన్నప్పటికీ ప్రపంచంతో పోల్చితే విశ్వనగరం కావాలంటే చాలా మైళ్ల దూరం ప్రయాణించాల్సి ఉంది. స్పష్టమైన ఎజెండా, దక్షత గల నాయకత్వం, అన్నింటికి మించి ఇతరులతో కలిసి పని చేసే మనస్తత్వం ఉండాలి. ఒక వ్యక్తి, సంస్థ గానీ సర్వం నాకే తెలుసు. ప్రపంచం మొత్తం నాకే తెలుసు అనుకుంటే ఎక్కడికి పోలేవు అని కేటీఆర్ పేర్కొన్నారు.