ఇల్లు మాత్ర‌మే కాదు.. నాలా కూడా మనదే..

నవతెలంగాణ హైదరాబాద్: ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా ఖైర‌తాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయన మాట్లాడుతూ.. నాలాల‌ను క్లీనింగ్ చేసేట‌ప్పుడు.. పూడిక‌లో వ‌చ్చే కొన్నింటిని చూస్తుంటే ఆశ్చ‌ర్యం వేస్తుంది. సోఫాలు, దిండ్లు, ఇత‌ర‌త్రా వ‌స్తువులు అనేకం బ‌య‌ట‌ప‌డుతాయి. సూప‌ర్ మార్కెట్లో కూడా దొరుకుతాయో లేదో కానీ నాలాలో అన్నీ దొరుకుతాయి. ప‌నికిరాని వ‌స్తువుల‌ను నాలాల్లో ఎందుకు వేస్తున్నారో అర్థం కావ‌డం లేదు. ఎందుకింత అనాగ‌రికంగా ఆలోచిస్తున్నామో అర్థం కాదు. నాగ‌రిక స‌మాజంలో బ‌త‌కాల‌నే వారు ఇలా చేయరు. ఇల్లు మాత్ర‌మే నాది.. నాలా నాది కాదు అనే భావ‌న‌తో బ‌త‌కొద్దు అని కేటీఆర్ సూచించారు. మార్పు రానంత వ‌ర‌కు ఎన్ని డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టిన‌ప్ప‌టికీ ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్నారు. మాన్‌సూన్‌కు సంబంధించి చాలా ప‌నులను ప‌ర్య‌వేక్షిస్తున్నాం అని కేటీఆర్ తెలిపారు.
అంద‌రం క‌లిసి క‌దిలితేనే మార్పు వ‌స్తుంది..
న‌గ‌రం బాగుప‌డాలంటే పౌరుల భాగ‌స్వామ్యం త‌ప్ప‌కుండా అవ‌స‌రం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. అంద‌రం క‌లిసి క‌దిలితేనే మార్పు వ‌స్తుంది. నాగ‌రికంగా బ‌తికే అవ‌కాశం క‌లుగుతుంది. అనాగ‌రిక ల‌క్ష‌ణాలు స‌మాజంలో అనేకం ఉన్నాయి. భార‌త‌దేశంలో ఎక్క‌డా లేని విధంగా ప‌ది శాతం బ‌డ్జెట్‌ను ప‌చ్చ‌దానికి కేటాయించారు. చెట్ల‌ను నాటి కాపాడాల‌ని కేసీఆర్ ఆదేశించారు. లేదంటే స‌ర్పంచ్, కౌన్సిల‌ర్ ఉద్యోగం పోతుంద‌ని చెప్పిన మొట్ట‌మొద‌టి ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాత్ర‌మే. ప్ర‌తి గ్రామంలో ఒక న‌ర్స‌రీ, ట్రాక్ట‌ర్, ట్యాంక‌ర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ స‌దుపాయం ఇత‌ర రాష్ట్రాల్లో లేదు అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Spread the love