నవతెలంగాణ – కంటేశ్వర్
మొక్కలే మహావృక్షాలై మానవ సంబంధాలను పెనవేస్తున్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఛైర్ పర్సన్ సునీత కుంచాల తెలిపారు.న్యాయసేవ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లాకోర్టు ఆవరణలో మొక్కలను నాటిన అనంతరం ఆమె మాట్లాడారు.మనుషుల జీవితంలో మొక్కలు,చెట్లు అంతర్భాగమని అన్నారు.కొన్ని చెట్ల నుండి లభించే పళ్ళు మానవుని ఆహారాన్ని అందిస్తున్నాయని తద్వారా ఎన్నో పోషకాలు లభించి మానవ మనుగడకు తోడ్పాడుతున్నాయని పేర్కొన్నారు. మొక్కలకు పూచే పూలు పూజలకు,పుణ్య కార్యక్రమాలకు ఉపయోగపడుతున్నాయని వివరించారు.చెట్లతో ఆక్సిజన్ లబిస్తుందని, మానవ పరిణామక్రమంలో చెట్లకు ఉన్న ప్రాధాన్యత వెల కట్టలేనిదని తెలిపారు.ఏ రకంగా చూసిన చెట్లు,మొక్కలు మానవ జీవితాలతో విడదీయలేనివని అన్నారు. చెట్లను రక్షించడం,మొక్కలను నాటి పెంచడం చేయాలన్నారు.చెట్లను దేవుళ్లుగా కొలిచే ఆధ్యాత్మిక సంస్కృతి భారతీయుల జీవనవిధానంలో అంతర్భాగమని వెల్లడించారు.అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ అనేది అందరు పవిత్ర కార్యక్రమంగా తీసుకోవాలని కోరారు. వర్షాకాలంలో ప్రతి పౌరుడు మొక్కలను నాటాలని తద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని జిల్లాజడ్జి సునీత అన్నారు.ఈ కార్యక్రమంలోఅదనపు జిల్లాజడ్జిలు కనకదుర్గ,శ్రీనివాస్, సీనియర్ సివిల్ జడ్జిలు పద్మావతి, శ్రీకాంత్ బాబు,జూనియర్ సివిల్ జడ్జిలు కుష్బూ ఉపాధ్యాయ,గోపికృష్ణ,నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవదాసు ,సంస్థ సూపరింటెండెంట్ పురుషోత్తం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ ర్యాలీ…
అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాల భవన్ లో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. పర్యావరణ చట్టాలు,నిత్య జీవితంలో విద్యార్థులకు,పౌరులకు ఉపయోగపడే చట్టాలను గూర్చి తెలియజేశారు.