హిమాన్షు అన్న మా పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయండి

 

హిమాన్షు అన్న మా పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి  చేయండి
హిమాన్షు అన్న మా పాఠశాల తరపున వినతి

– మా పాఠశాలల అభివృద్ధికై రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదు
– విద్యా సంస్థల అభివృద్ధికి యుద్ధప్రాతిపదికన నిధులు మంజూరు చేయాలి
– బాల సంఘం డిమాండ్ 
నవతెలంగాణ-హిమాయత్ నగర్ 
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు అన్న మా పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి పరచండి..”మన ఊరు-మన బడి” ద్వారా మా పాఠశాలను అభివృద్ధి చేస్తామంటూ ఇప్పటి వరకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా కాలయాపన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదని హిమాయత్ నగర్, దత్తనగర్ లోని పాఠశాల విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు.ఇటీవల మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి, గౌలిదొడ్డిలోని కేశవ్ నగర్ లోని పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసినట్లుగా, నగరం నడిబొడ్డున ఉన్న తమ పాఠశాలను సైతం దత్తత ద్వారా అభివృద్ధి చేయాలని విద్యాకుసుమాలు, బాల సంఘం, అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) సంయుక్తంగా హిమాన్షును డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర, బాల సంఘం హైదరాబాద్ జిల్లా కన్వీనర్ షేక్ మహమూద్ మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 వేల ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
       విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నప్పటికి నేటికి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతులు అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.నేటికి విద్యార్థులకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, మరుగుదొడ్లు, గ్రంధాలయం, ఆటస్థలం, క్రీడా సామాగ్రి తదితర వసతుల కల్పన జరగలేదని, అనేక జిల్లాల్లోని ప్రభుత్వ విద్యా సంస్థలు శిథిలావస్థకు చేరాయని, ఈ సమస్యలపై దృష్టి సారించి సమీక్షల ద్వారా పరిష్కరించాల్సిన విద్యా శాఖా మంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, మంత్రి సబితా ఇంద్రారెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.హిమాన్షుకు ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న దూరదృష్టి రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గు చేటన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ప్రభుత్వ విద్యా సంస్థల సమస్యలపై సమీక్షలు జరపాలని, వెంటనే తగిన నిధులను మంజూరు చేసి అభివృద్ధి పరచాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఆర్.బాలకృష్ణ, కార్యదర్శి నెర్లకంటి శ్రీకాంత్, నేతలు కళ్యాణ్, సందీప్, శివ, జగన్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love