వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను…బీఆర్ఎస్ సీనియర్ నేత కీలక ప్రకటన

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో.. కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి నుంచే టికెట్ల లొల్లి షురూ అయ్యింది. ఎవరెవరికి అధిష్ఠానాలు టికెట్లు ఖరారు చేస్తుంది.. ఎవరెవరికి మొండి చేయి చూపనుంది.. అనేది ఇప్పుడు అన్ని పార్టీల్లో సర్వత్రా చర్చ నడుస్తోంది. అయితే.. ఇప్పుడు సిట్టింగ్‌లతో పాటు.. మిగతా నేతలంతా కూడా ఈసారి ఎలాగైనా టికెట్టు తమకే కావాలంటూ పావులు కదుపుతుంటే.. అధికార పార్టీ బీఆర్‌ఎస్‌‌కు చెందిన ఓ సీనియర్ నేత మాత్రం నేను ఈసారి పోటీ చేయనని చెప్పేశారు. ఆయన ఎవరో కాదండి.. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అయితే.. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన గుత్తా సుఖేందర్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లోనూ గెలుపు బీఆర్‌ఎస్దేనని దీమా వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీగా తనకు ఇంకా నాలుగేళ్ల పదవీకాలం ఉందని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. పార్టీ అధిష్ఠానం అవకాశం ఇస్తే తన కుమారుడు అమిత్ పోటీలో ఉంటారన్నారు. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే పార్టీ కోసం పనిచేస్తామన్నారు. రాజకీయాల్లో వారసత్వం కేవలం ఎంట్రీకే ఉపయోగపడుతుందని.. వ్యక్తిగతంగా ప్రజల మద్దతు పొందిన వారికే భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ‘ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది. కేసీఆర్ సీఎంగా మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని సీట్లు బీఆర్ఎస్ అన్ని అన్నారు. కాంగ్రెస్‌లో చేరుతామంటున్న ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలు.. ఎక్కువగా ఊహించుకుంటున్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ కు 2018 ఎన్నికల కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి. కాంగ్రెస్ లేని కూటమి తమ విధానమని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అందుకే పట్నాలో విపక్షాల సమావేశానికి వెళ్లలేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్రానికి అన్యాయమే చేసింది. తెలుగు రాష్ట్రాలకు విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలమైంది’’ అని గుత్తా సుఖేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Spread the love