నవతెలంగాణ – హైదరాబాద్: విప్రహిత బ్రాహ్మణ సదనం భవనాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రారంభించనున్నారు. అనంతరం ఏర్పాటు చేయనున్న సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లి గ్రామంలో 6 ఎకరాల 10 గుంటల స్థలాన్ని కేటాయించింది. ఇందులో బ్రాహ్మణ సమాజ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని 12 నిర్మాణాలను చేపట్టారు. 2017 జూన్ 5న పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మూడంతస్థుల్లో ఉన్న ఈ భవనంలో కల్యాణ మండపం, సమాచార కేంద్రం, పీఠాధిపతుల, ధర్మాచార్యుల సద నం ఉన్నాయి. భక్తి, ఆధ్మాత్మిక భావజాల వ్యాప్తికి సంబంధించిన సమస్త సమాచార కేంద్రంగా, రిసోర్స్ సెంటర్‌గా ఈ భవనం సేవలందించనున్నది. ఆధ్యాత్మిక గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల వంటి సాహిత్యంతో కూడిన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.