తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

– దహన సంస్కారాలకు రూ.10 వేల సహాయం
– ఆదేశాలు జారీ చేసిన పంచాయతీరాజ్‌ శాఖ
– మిగతా డిమాండ్లనూ పరిష్కరించాలి : జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పంచాయతీ కార్మికుల డిమాండ్లను ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని ప్రకటించినట్టుగానే రాష్ట్ర సర్కారు తొలి అడుగు వేసింది. స్వతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ తీపి కబురు అందించింది. ఎల్‌ఐసీ ద్వారా గ్రామ పంచాయతీ కార్మికులకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్‌ చేయించేందుకు అంగీకరించింది. ఆ ప్రీమియం డబ్బులను గ్రామ పంచాయతీ నిధుల నుంచి చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఇది బాధిత కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించేలా ఉంది. పంచాయతీ కార్మికులు ఎవరైనా మరణిస్తే దహన సంస్కారాల నిమిత్తం తక్షణ సహాయం కింద రూ.10 వేలు కూడా అందచేయనున్నట్టు వెల్లడించింది. జిల్లా పంచాయతీ అధికారులు ఈ దిశగా వెంటనే చర్యలు చేపట్టాలని సూచించింది. నిబంధనలు, షరతులను పంచాయతీ కార్మికులకు నేరుగా తెలుపుతామని పేర్కొంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మోమోను జారీ చేసింది.
రెండు డిమాండ్ల పరిష్కారాన్ని స్వాగతిస్తున్నాం :జేఏసీ
రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చొరవతో రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్‌, దహన సంస్కారాలకు తక్షణ సహాయం డిమాండ్లను పరిష్కరించడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగులు, కార్మిక సంఘాల జేఏసీ తెలిపింది. సోమవారం ఈ మేరకు జేఏసీ చైర్మెన్‌ పాలడుగు భాస్కర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యజ్ఞనారాయణ, కన్వీనర్లు వెంకటరాజం, పి.అరుణ్‌కుమార్‌, శివబాబు, ఎన్‌.దాసు ఒక ప్రకటన విడుదల చేశారు. పర్మినెంట్‌, మల్టీపర్పస్‌ విధానం రద్దు, వేతనాల పెంపు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, కారోబార్లు, బిల్‌కలెక్టర్లకు ప్రమోషన్లు, తదితర డిమాండ్లను కూడా వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. అవసరమైతే జేఏసీ బృందంతో మరోమారు చర్చలు జరపాలని సూచించారు. మిగతా డిమాండ్లపై నాన్చివేత ధోరణి అవలంబిస్తే మళ్లీ పోరాట బాట పడుతామని హెచ్చరించారు.

Spread the love