షెడ్యూల్‌ వచ్చేసింది

–  నవంబర్‌ 19న అహ్మదాబాద్‌లో ఫైనల్‌
–  ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ విడుదల
–  అక్టోబర్‌ 15న భారత్‌, పాక్‌ మహా పోరు
– అక్టోబర్‌ 5న ఇంగ్లాండ్‌, కివీస్‌ ఢతోీ వేట షురూ
ఐసీసీ 2023 వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ ఎట్టకేలకు విడుదలైంది. మెగా ఈవెంట్‌ 100 రోజుల కౌంట్‌డౌన్‌ సందర్భంగా ఐసీసీ షెడ్యూల్‌ను ప్రకటించింది. 46 రోజుల ప్రపంచ క్రికెట్‌ పండుగ అక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లాండ్‌, రన్నరప్‌ న్యూజిలాండ్‌ పోరుతో ఆరంభం కానుండగా.. నవంబర్‌ 19న అదే స్టేడియంలో టైటిల్‌ పోరుతో ముగియనుంది. భారత్‌, పాకిస్థాన్‌ అభిమానులు ఎదురుచూస్తున్న దాయాదుల సమరం అక్టోబర్‌ 15న మొతెరాలో జరుగనుంది. 2023 వన్డే వరల్డ్‌కప్‌ వేటలో పది జట్లు బరిలోకి దిగుతున్నాయి.
నవతెలంగాణ-ముంబయి ; 48 మ్యాచులు, 46 రోజులు, 12 వేదికలు, 10 జట్లు.. ఐసీసీ 2023 వన్డే వరల్డ్‌కప్‌ వేటకు నగారా మోగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచకప్‌ షెడ్యూల్‌ రానే వచ్చింది. భారత్‌ ఆతిథ్యం ఇస్తున్న 2023 వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ను మంగళవారం ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఐసీసీ, బీసీసీఐ ప్రకటించాయి. ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారి ట్రోఫీని గగనతలంలోకి తీసుకెళ్లి అభిమానుల్లో జోష్‌ తీసుకొచ్చిన బీసీసీఐ.. మెగా ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుంది. ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల చేసిన ఐసీసీ.. వరల్డ్‌కప్‌ 100 రోజుల కౌంట్‌డౌన్‌ను షురూ చేసింది.
రోహిత్‌సేన తొమ్మిది నగరాల్లో
ఆతిథ్య టీమ్‌ ఇండియా ప్రపంచకప్‌ మ్యాచులను తొమ్మిది వేదికల్లో ఆడనుంది. గ్రూప్‌ దశలో పది జట్లు ఇతర తొమ్మిది జట్లతో ఓ మ్యాచ్‌లో తలపడాలి. గ్రూప్‌ దశలో టాప్‌-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. అక్టోబర్‌ 8న ఆస్ట్రేలియాతో పోరుతో భారత్‌ వరల్డ్‌కప్‌ వేట ఆరంభించనుంది. ఆసీస్‌తో భారత్‌ మ్యాచ్‌ చెన్నైలో జరుగనుంది. ఇక అఫ్గనిస్థాన్‌తో మ్యాచ్‌ను ఢిల్లీలో, పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను అహ్మదాబాద్‌లో, బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ను పుణెలో, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ను ధర్మశాలలో, ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌ను లక్నోలో, దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ను కోల్‌కతలో ఆడనుంది. క్వాలిఫయర్‌ జట్లతో మ్యాచులను ముంబయి, బెంగళూర్‌లో ఆడనుంది.
అహ్మదాబాద్‌లోనే అన్నీ!
భారత స్వదేశీ సీజన్‌ షెడ్యూల్‌, ఐపీఎల్‌తో పాటు తాజాగా ఐసీసీ ప్రపంచకప్‌ షెడ్యూల్‌ సైతం అహ్మదాబాద్‌ చుట్టూ తిరుగుతోంది. ప్రపంచకప్‌లో కీలక మ్యాచులను అహ్మదాబాద్‌కు కేటాయించారు. అక్టోబర్‌ 5న టోర్నీ ఆరంభ మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోనే జరుగనుంది. ఆరంభ వేడుకలకు ముస్తాబు కానున్న మొతెరా స్టేడియం నవంబర్‌ 19న టైటిల్‌ పోరుకు సైతం ఆతిథ్యం ఇవ్వనుంది. వీటికి తోడు ప్రపంచకప్‌లోనే అత్యంత ఆసక్తి రేపుతున్న భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ సైతం అహ్మదాబాద్‌లోనే షెడ్యూల్‌ చేశారు. గతంలో ప్రధాన మ్యాచులకు ముంబయి, కోల్‌కత, చెన్నై ఆతిథ్యం వహించగా.. ఇప్పుడు ఆ మూడు వేదికల స్థానంలో అహ్మదాబాద్‌ ఒక్కటే నిలిచింది.
పాక్‌ కోరటంతో..!
అక్టోబర్‌ 15న భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరుగనుంది. రాజకీయ కారణాలతో మొతెరా స్టేడియంలో ఆడలేమని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) అభ్యంతరం వ్యక్తం చేసినా.. ఐసీసీ తిరస్కరించింది. చెన్నై, బెంగళూర్‌లలో అఫ్ఘనిస్థాన్‌, ఆస్ట్రేలియాలతో ఆడేందుకు సైతం పాకిస్థాన్‌ నిరాకరించింది. స్పిన్‌ అనుకూల పిచ్‌లపై ఆసీస్‌, అఫ్గాన్‌లతో ఆడమని చెప్పినా.. ఐసీసీ మరోసారి పాక్‌ అభ్యంతరాలను సున్నితంగా తోసిపుచ్చింది. దీంతో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ముసాయిదా షెడ్యూల్‌కు కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచకప్‌లో ఐదు వేదికల్లో పోటీపడనున్న పాకిస్థాన్‌.. వేట సన్నద్ధతను హైదరాబాద్‌ కేంద్రంగా ఆరంభించనుంది. హైదరాబాద్‌లోనే తొలి రెండు మ్యాచులు ఆడనున్న పాకిస్థాన్‌ టోర్నీకి వారం రోజుల ముందు నుంచే ఉప్పల్‌ స్టేడియంలో సాధన చేయనుంది. ప్రధాన టోర్నీకి సంబంధించి అభ్యంతరాలను ఐసీసీ తిరస్కరించినా.. వార్మప్‌ మ్యాచులపై పీసీబీ విన్నపాన్ని ఐసీసీ ఆలకించింది. ప్రధాన టోర్నీ ఆరంభంలోనే ఆసియా జట్లతో తలపడనున్న పాకిస్థాన్‌.. వార్మప్‌ షెడ్యూల్‌లో ఆసియా యేతర జట్లతో తలపడేందుకు మొగ్గు చూపింది. పాక్‌ కోరిక మేరకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో వార్మప్‌ మ్యాచులు షెడ్యూల్‌ చేశారు. పాక్‌ తొలి రెండు మ్యాచులతో పాటు రెండు వార్మప్‌ మ్యాచ్‌లు హైదరాబాద్‌లోనే జరుగనున్నాయి.
మూడు మ్యాచుల ముచ్చటే!
టీమ్‌ ఇండియా మ్యాచ్‌కు ఆతిథ్యం అందించే భాగ్యం భాగ్యనగరానికి దక్కలేదు. ప్రపంచకప్‌ ప్రధాన టోర్నీకి పది స్టేడియాలు వేదికలుగా నిలువనున్నాయి. వీటిలో హైదరాబాద్‌కు మాత్రమే మూడు మ్యాచులు దక్కగా.. మిగతా తొమ్మిది స్టేడియాలు ఐదేసి మ్యాచుల చొప్పున దక్కించుకున్నాయి. పాకిస్థాన్‌ జట్టు రెండు క్వాలిఫయర్‌ జట్లతో హైదరాబాద్‌లోనే ఆడనుండగా.. న్యూజిలాండ్‌ సైతం ఓ క్వాలిఫయర్‌ జట్టుతో ఇక్కడ పోటీపడనుంది. దీంతో ఓవరాల్‌గా హైదరాబాద్‌ మూడు ప్రపంచకప్‌ మ్యాచులకు వేదికగా నిలువనుంది.
వేదికలు పది
ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌ మ్యాచులకు దేశవ్యాప్తంగా పది స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. న్యూఢిల్లీ, ముంబయి, ధర్మశాల, అహ్మదాబాద్‌, చెన్నై, బెంగళూర్‌, హైదరాబాద్‌, కోల్‌కత, పుణె, లక్నోలు ప్రధాన టోర్నీ వేదికలుగా నిలిచాయి. ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో 45 మ్యాచులు జరుగనుండగా.. మూడు నాకౌట్‌ మ్యాచులు. హైదరాబాద్‌ మినహా ప్రతి స్టేడియంలో ఐదేసి మ్యాచులు జరుగనున్నాయి. నవంబర్‌ 15, 16న ముంబయి, కోల్‌కతలు సెమీఫైనల్స్‌కు వేదిక కానున్నాయి.
ఇదిలా ఉండగా, మహా రాష్ట్రలోనే ఏకంగా పది ప్రపంచకప్‌ మ్యాచులకు బీసీసీఐ రంగం సిద్ధం చేసింది. ముంబయి వాంఖడే స్టేడియం, పుణె ఎంసీఏ స్టేడియం ఐదేసి మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
మూడింట వార్మప్‌
ఈసారి ప్రపంచకప్‌ ఆతిథ్య వేదిక జాబితాలో మొహాలి, ఇండోర్‌, తిరువనంతపురం చోటు దక్కించుకోలేదు. కానీ వార్మప్‌ మ్యాచుల కేటాయింపుతో మూడు వేదికలకు ఊరట దక్కింది. ప్రధాన టోర్నీలో మూడే మ్యాచులకు వేదిక కానున్న హైదరాబాద్‌లో రెండు వార్మప్‌ మ్యాచులు సైతం జరుగనున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో వార్మప్‌ మ్యాచులను పాకిస్థాన్‌ జట్టు హైదరాబాద్‌లోనే ఆడనుంది. ఇక తిరువనంతపురం, గువహటిలో భారత జట్టు వార్మప్‌లు ఆడనుంది. సెప్టెంబర్‌ 30న ఇంగ్లాండ్‌తో వార్మప్‌ను గువహటితో, అక్టోబర్‌ 3న క్వాలిఫయర్‌ 1తో వార్మప్‌ను తిరువనంతపురంలో ఆడనుంది. ప్రపంచకప్‌ ఆరంభానికి వారం రోజుల ముందు వార్మప్‌ మ్యాచులు షెడ్యూల్‌ చేశారు. సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబర్‌ 3 వరకు మూడు స్టేడియాల్లో వార్మప్‌ మ్యాచులు జరుగనున్నాయి.
100 రోజులు, 18 దేశాలు
ఐసీసీ ప్రపంచకప్‌ ట్రోఫీ టూర్‌ సైతం మంగళవారంతో మొదలైంది. 100 రోజుల పాటు 40 నగరాలు, 18 దేశాల్లో ప్రపంచకప్‌ ట్రోఫీ చుట్టిరానుంది. ఈ మేరకు ఐసీసీ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రధాన టోర్నీలో పోటీపడుతున్న పది దేశాలతో పాటు క్వాలిఫయర్స్‌లో పోటీపడిన దేశాల్లోనూ క్రికెట్‌ ప్రపంచకప్‌ ట్రోఫీ ఓ లుక్కేయనుంది. అక్టోబర్‌ 5న ఆరంభ మ్యాచ్‌ సమయానికి ప్రపంచకప్‌ అహ్మదాబాద్‌కు చేరుకోనుంది.
హైదరాబాద్‌లో వరల్డ్‌కప్‌ మ్యాచులు,తేది జట్లు
అక్టోబర్‌ 6 పాకిస్థాన్‌ , క్వాలిఫయర్‌ 1
అక్టోబర్‌ 9 న్యూజిలాండ్‌, క్వాలిఫయర్‌ 1
అక్టోబర్‌ 12 పాకిస్థాన్‌ , క్వాలిఫయర్‌ 2
భారత్‌ గ్రూప్‌ దశ మ్యాచులు,తేది ప్రత్యర్థి వేదిక
అక్టోబర్‌ 8 ఆస్ట్రేలియా చెన్నై
అక్టోబర్‌11 అఫ్ఘనిస్థాన్‌ ఢిల్లీ
అక్టోబర్‌ 15 పాకిస్థాన్‌ అహ్మదాబాద్‌
అక్టోబర్‌ 19 బంగ్లాదేశ్‌ పుణె
అక్టోబర్‌ 22 న్యూజిలాండ్‌ ధర్మశాల
అక్టోబర్‌ 29 ఇంగ్లాండ్‌ లక్నో
నవంబర్‌ 2 క్వాలిఫయర్‌ 2 ముంబయి
నవంబర్‌ 5 దక్షిణాఫ్రికా కోల్‌కత
నవంబర్‌ 11 క్వాలిఫయర్‌ 1బెంగళూర్‌
మ్యాచులు మధ్యాహ్నాం 2 గంటలకు ఆరంభం

Spread the love