రంజీల్లో మధ్యప్రదేశ్‌ తరఫున బరిలోకి..

హైదరాబాద్‌ : ఆంధ్ర రంజీ జట్టుతో హనుమ విహారి రెండో ఇన్నింగ్స్‌ ముగిసినట్టే. దేశవాళీ సీజన్‌లో ఆంధ్ర తరఫున గత రెండు సీజన్లలో ప్రాతినిథ్యం వహించిన హనుమ విహారి.. రానున్న రంజీ సీజన్లో మధ్యప్రదేశ్‌ తరఫున బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. గతంలో 2016-17, 2020-21 సీజన్లలో హనుమ విహారి ఆంధ్రకు ప్రాతినిథ్యం వహించాడు. 2010లో హైదరాబాద్‌ రంజీ జట్టు తరఫున ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌ మొదలుపెట్టిన హనుమ విహారి.. 2015-16 వరకు హైదరాబాద్‌లోనే కొనసాగాడు. ఇటీవల భారత జట్టులో చోటు కోల్పోయిన హనుమ విహారి.. తిరిగి టెస్టు జట్టులో చోటు సాధించేందుకు రంజీ సీజన్‌పై కన్నేశాడు. అందుకే ఆంధ్రను కాదని మధ్యప్రదేశ్‌ తరఫున ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఆంధ్ర క్రికెట్‌ సంఘం నుంచి నిరభ్యంతర పత్రం కోసం విహారి ఎదురు చూస్తున్నట్టు సమాచారం. ‘హనుమ విహారి ఎన్‌ఓసీ కోసం దరఖాస్తు చేసినది నిజమే. గత రెండు రోజులుగా విహారితో చర్చలు జరుగుతున్నాయి. హనుమ విహారి అభ్యర్థనపై ఏసీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’ అని ఆంధ్ర క్రికెట్‌ సంఘం అధికారి ఒకరు తెలిపారు. బ్యాటింగ్‌ విభాగంలో హనుమ విహారిపై గురి పెట్టిన మధ్యప్రదేశ్‌.. బౌలింగ్‌ విభాగాన్ని బలోపేతం చేసేందుకు తమిళనాడు పేసర్‌ టి. నటరాజన్‌ను సైతం జట్టులోకి ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

Spread the love