షెడ్యూల్‌లో మార్పుల్లేవ్‌!

– నేడు వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ విడుదల
– ప్రపంచకప్‌కు 100 రోజుల కౌంట్‌డౌన్‌
నవతెలంగాణ-ముంబయి

ప్రపంచ క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ 2023 మెన్స్‌ వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ ఎట్టకేలకు విడుదల కానుంది. 12 వేదికల్లో ప్రపంచ కప్‌ మ్యాచులను షెడ్యూల్‌ చేసిన బీసీసీఐ.. ఈ మేరకు ముసాయిదా షెడ్యూల్‌ను ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌ కమిటీ (ఐసీసీ)తో పంచుకుంది. ముసాయిదా షెడ్యూల్‌ను సభ్య దేశాలతో పంచుకున్న ఐసీసీ.. అభ్యంతరాలు తెలిపేందుకు గడువు ఇచ్చింది. అభ్యంతరాలపై ఐసీసీలో చర్చ అనంతరం.. నేడు ముంబయిలో జరిగే అధికారిక కార్యక్రమంలో ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. ఐసీసీ ప్రతినిధులు, బీసీసీఐ ఆఫీస్‌ బేరర్లు వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ ప్రకటించే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇక వన్డే వరల్డ్‌కప్‌కు 100 రోజుల కౌంట్‌డౌన్‌ను సైతం ఐసీసీ, బీసీసీఐ నేడు షురూ చేయనున్నాయి.
అహ్మదాబాద్‌లోనే..!
భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ అభిమానులతో పాటు మార్కెట్‌ వర్గాలు ఎదురు చూస్తున్న మ్యాచ్‌ దాయాదుల సమరం. ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించటంతో భారత్‌, పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్లు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో పోటీపడటం లేదు. ఐసీసీ, ఏసీసీ ఈవెంట్లలోనే పొరుగు దేశాలు పోటీపడుతున్నాయి. అక్టోబర్‌ 15న అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ షెడ్యూల్‌ చేశారు. అయితే దీనిపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ కారణాల రీత్యా అహ్మదాబాద్‌లో భారత్‌తో మ్యాచ్‌ ఆడలేమని చెన్నై, బెంగళూర్‌, కోల్‌కతలలో ఒక వేదికపై ఓ మ్యాచ్‌ను ఏర్పాటు చేయాలని పీసీబీ కోరింది. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) పేర్కొన్న రాజకీయ కారణాలతో ఐసీసీ ఏకీభవించలేదని తెలుస్తుంది. అహ్మదాబాద్‌లోని మొతెరా మైదానం సామర్థ్యం 1.30 లక్షలు. మరే స్టేడియంలోనూ ఈ స్థాయిలో సీటింగ్‌ సామర్థ్యం లేదు. భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌కు మైదానం నిండిపోనుండటంతో.. టికెట్‌ అమ్మకాల సొమ్మును వదులుకునేందుకు ఐసీసీ ఏమాత్రం సుమఖంగా లేదు. దీనితో పాటు ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌ను చెన్నైలోని ఎం.ఏ చిదంబరం స్టేడియంలో, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ను బెంగళూర్‌లోని చిన్నస్వామి స్టేడియంలో షెడ్యూల్‌ చేయటం పట్ల సైతం పీసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది. స్పిన్‌ సానుకూల పిచ్‌లపై నాణ్యమైన స్నిన్నర్లు కలిగిన ఆఫ్ఘనిస్థాన్‌తో ఆడేందుకు పీసీబీ నిరాకరించింది. కానీ పీసీబీ ఈ అభ్యంతరాలను సైతం ఐసీసీ కొట్టిపారేసినట్టు కనిపిస్తుంది.
ఉప్పల్‌కు ఆ భాగ్యం లేనట్టే?
బీసీసీఐ రూపొందించిన ముసాయిదా షెడ్యూల్‌కు ఎటువంటి మార్పులు లేకుండా ఐసీసీ ఆమోదించినట్టు సమాచారం. దీంతో హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియానికి (ఉప్పల్‌) భారత్‌ మ్యాచ్‌కు ఆతిథ్యం అందించే అవకాశం లేనట్టే. క్రికెట్‌ను అమితంగా ఆరాధించే నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి. ఇక్కడ ఎప్పుడు అంతర్జాతీయ మ్యాచులు జరిగినా… స్టేడియం నిండుకుండను తలపిస్తుంది. ఇటీవల ఐపీఎల్‌ మ్యాచుల్లోనూ హైదరాబాద్‌లో విపరీత ఆదరణ లభించింది. భారత జట్టుకు సైతం హైదరాబాద్‌లో తిరుగులేని రికార్డు ఉంది. అయినా, భారత మ్యాచ్‌ను హైదరాబాద్‌కు కేటాయించలేదు. ఆఖరు నిమిషంలో షెడ్యూల్‌లో మార్పులు జరిగితే మినహా.. హైదరాబాద్‌ అభిమానులకు నిరాశే. ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు మ్యాచులకు హైదరాబాద్‌ వేదిక కానున్న సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌ వేటకు వారం, పది రోజుల ముందే భారత్‌కు రానున్న పాకిస్థాన్‌ జట్టు.. హైదరాబాద్‌ కేంద్రంగా సాధన చేయనుంది. అక్టోబర్‌ 6, అక్టోబర్‌ 12న క్వాలిఫయర్‌ టోర్నీ నుంచి వచ్చిన జట్లతో పాకిస్థాన్‌ ఆడనుంది. ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లలో కనీసం రెండు జట్ల మ్యాచులు సైతం హైదరాబాద్‌ లో చోటుచేసుకునే అవకాశం ఉంది. నేడు తుది షెడ్యూల్‌ బయటకు వస్తే హైదరాబాద్‌ ఏ మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనుందో తేలిపోనుంది.
12 వేదికలు
2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ ఆరంభ మ్యాచ్‌ అక్టోబర్‌ 5న జరుగనుండగా.. ఫైనల్‌ నవంబర్‌ 19న అహ్మదాబాద్‌ వేదికగా షెడ్యూల్‌ చేశారు. వన్డే వరల్డ్‌కప్‌కు 12 వేదికలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అహ్మదాబాద్‌, బెంగళూర్‌, చెన్నై, న్యూఢిల్లీ, ధర్మశాల, గువహటి, హైదరాబాద్‌, ఇండోర్‌, కోల్‌కత, రారుపూర్‌, రాజ్‌కోట్‌లు ప్రపంచకప్‌ మ్యాచులకు వేదికలుగా నిలువనున్నాయి. ఈ స్టేడియాల్లో ప్రపంచ శ్రేణి సదుపాయాలు, ఆధునీకరణ పనుల కోసం బీసీసీఐ భారీగా నిధులు వెచ్చించనుంది.
చివరగా.. భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేస్తోంది. అక్టోబర్‌ 15న అహ్మదాబాద్‌లో దాయాదుల సమరానికి భారత ప్రధాని నరెంద్ర మోడీతో పాటు పాకిస్థాన్‌ ప్రధానిని సైతం ఆహ్వానించనుంది. బీసీసీఐ ఆఫీస్‌ బేరర్లు స్వయంగా ఇరు దేశాల ప్రధానమంత్రులకు మ్యాచ్‌ ఆహ్వానం అందించే అవకాశం కనిపిస్తుంది.

Spread the love