గద వాళ్లకు.. వ్యధ మనకు! రెండోసారి

– భారత్‌కు భంగపాటు
– ప్రపంచ టెస్టు చాంపియన్‌గా ఆస్ట్రేలియా
– ఐసీసీ గద కంగారూల సొంతం
– 444 ఛేదనలో భారత్‌ 234/10
ఐసీసీ టైటిళ్ల వేటలో టీమ్‌ ఇండియా దశాబ్ది నిరీక్షణ కొనసాగుతుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్‌ వరుసగా రెండోసారి నిరాశపరిచింది. 444 పరుగుల ఛేదనలో 234 పరుగులకే కుప్పకూలిన రోహిత్‌సేన.. గద వేటలో అభిమానులకు వ్యధ మిగిల్చింది!. 209 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.
స్లో ఓవర్‌ రేట్‌ జరిమానాతో రెండేండ్ల క్రితం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో చోటు కోల్పోయిన ఆస్ట్రేలియా.. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది. అనుకూల పరిస్థితుల్లో అందరూ రాణించగా ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌గా అవతరించింది. 1987, 1999, 2003, 2007, 2015 వన్డే వరల్డ్‌కప్‌.. 2006, 2009 చాంపియన్స్‌ ట్రోఫీలు సహా 2021 టీ20 ప్రపంచకప్‌ నెగ్గిన ఆస్ట్రేలియా తాజాగా 2023 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌తో మెన్స్‌ క్రికెట్‌లో పరిపూర్ణ జట్టుగా నిలిచింది. ఐసీసీ నాలుగు టోర్నీల్లో విజేతగా నిలిచిన ఏకైక జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది.
నవతెలంగాణ-కెన్నింగ్టన్‌
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌ ఆస్ట్రేలియా. ది ఓవల్‌లో జరిగిన ప్రపంచ టెస్టు మహా సంగ్రామంలో భారత్‌పై 209 పరుగుల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా.. 2023 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ గదను సొంతం చేసుకుంది. 444 పరుగుల ఛేదనలో భారత్‌ 234 పరుగులకే కుప్పకూలింది. విరాట్‌ కోహ్లి (49, 78 బంతుల్లో 7 ఫోర్లు), అజింక్య రహానె (46, 108 బంతుల్లో 7 ఫోర్లు)లు చివరి రోజు భారత్‌ ఆశలను సజీవంగా నిలిపినా.. ఆట మొదలైన కొద్దిసేపటికే ఆశలూ ఆవిరయ్యాయి!. 63.3 ఓవర్లలోనే భారత్‌ 234 పరుగులకు చేతులెత్తేసింది. కంగారూ స్పిన్నర్‌ నాథన లయాన్‌ (4/41) మాయజాలానికి తోడు పేసర్లు స్కాట్‌ బొలాండ్‌ (3/46), మిచెల్‌ స్టార్క్‌ (2/77) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో విధ్వంసక శతకం సాధించిన ట్రావిశ్‌ హెడ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ గదతో పాటు రూ.13 కోట్ల నగదు బహుమతి అందుకున్నాడు. రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు సిల్వర్‌ మెడల్స్‌తో పాటు రూ.6.6 కోట్ల ప్రైజ్‌మనీ దక్కించుకుంది.
లంచ్‌లోపే ఆలౌట్‌ : ఓవర్‌నైట్‌ స్కోరు 164/3తో ఐదో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన భారత్‌ మరో 280 పరుగులు చేయాల్సి స్థితిలో నిలిచింది. క్రీజులో విరాట్‌ కోహ్లి, అజింక్య రహానెలు అజేయంగా ఆడుతున్నారు. చేతిలో ఏడు వికెట్లు ఉండటంతో చివరి రోజు మనోళ్లు గెలుపు కోసం అమీతుమీ తేల్చుకుంటారనే అంచనాలు కనిపించాయి. కానీ ఉదయం సెషన్‌ ఆరంభంలోనే ఆశలు ఆవిరయ్యాయి. లంచ్‌ విరామానికి ముందే టీమ్‌ ఇండియా చేతులెత్తేసింది. 23.3 ఓవర్లలోనే చివరి ఏడు వికెట్లు చేజార్చుకుంది. వ్యక్తిగత స్కోరుకు మరో ఐదు పరుగులు జోడించిన విరాట్‌ కోహ్లి తీవ్రంగా నిరాశపరిచాడు. ఆసీస్‌ పేసర్‌ స్కాట్‌ బొలాండ్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి భారత్‌ను ఓటమి కూరల్లోకి నెట్టాడు. బొలాండ్‌ ఓవర్లో ఆఫ్‌సైడ్‌ బంతిని వెంటాడిన విరాట్‌ కోహ్లి.. స్లిప్స్‌లో క్యాచ్‌ ఇచ్చాడు. కోహ్లి వికెట్‌తో భారత్‌ మానసికంగా ఓటమిని అంగీకరించగా.. ఆస్ట్రేలియా శిబిరంలో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. రవీంద్ర జడేజా (0) ఎదుర్కొన్న రెండో బంతికే వికెట్ల వెనకాల దొరికిపోయాడు. ఒకే ఓవర్లో విరాట్‌ కోహ్లి, రవీంద్ర జడేజా వికెట్లతో భారత్‌ పనైపోయింది. అజింక్య రహానె (46) సైతం ఎంతోసేపు వికెట్‌ కాపాడుకోలేదు. శార్దుల్‌ ఠాకూర్‌ (0) డకౌట్‌గా నిష్క్రమించగా.. ఉమేశ్‌ యాదవ్‌ (1), మహ్మద్‌ సిరాజ్‌ (1) ఆసీస్‌ను పెద్దగా కష్టపెట్టలేదు. లంచ్‌ విరామం లోపే చివరి ఏడు వికెట్లు కోల్పోయిన భారత్‌ 209 పరుగుల తేడాతో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో పరాజయం పాలైంది.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : 469/10
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 296/10
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ : 270/8 డిక్లేర్డ్‌
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : రోహిత్‌ (ఎల్బీ) లయాన్‌ 43, గిల్‌ (సి) గ్రీన్‌ (బి) బొలాండ్‌ 18, పుజార (సి) అలెక్స్‌ (బి) కమిన్స్‌ 27, కోహ్లి (సి) స్మిత్‌ (బి) బొలాండ్‌ 49, రహానె (సి) అలెక్స్‌ (బి) స్టార్క్‌ 46, జడేజా (సి) అలెక్స్‌ (బి) బొలాండ్‌ 0, భరత్‌ (సి,బి) లయాన్‌ 23, శార్దుల్‌ (ఎల్బీ) లయాన్‌ 0, ఉమేశ్‌ (సి) అలెక్స్‌ (బి) స్టార్క్‌ 1, షమి నాటౌట్‌ 13, సిరాజ్‌ (సి) బొలాండ్‌ (బి) లయాన్‌ 1, ఎక్స్‌ట్రాలు : 13, మొత్తం : (63.3 ఓవర్లలో ఆలౌట్‌) 234.
వికెట్ల పతనం : 1-41, 2-92, 3-93, 4-179, 5-179, 6-212, 7-213, 8-220, 9-224, 10-234.
బౌలింగ్‌ : పాట్‌ కమిన్స్‌ 13-1-55-1, స్కాట్‌ బొలాండ్‌ 16-2-46-3, మిచెల్‌ స్టార్క్‌ 14-1-77-2, గ్రీన్‌ 5-0-13-0, లయాన్‌ 15.3-2-41-4.
అక్కడే చేజారింది!
వరుసగా రెండో ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌. రెండేండ్ల క్రితం ఇదే పరిస్థితుల్లో గద వేటలో భంగపాటు నుంచి భారత్‌ పాఠాలు నేర్చుకోలేదు. 2021లో న్యూజిలాండ్‌తో ఫైనల్లో, 2023లో ఆస్ట్రేలియాతో తుది పోరులో టీమ్‌ ఇండియాను విజయానికి దూరం చేసింది బ్యాటర్లే!. కివీస్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులే చేసిన భారత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. ఇప్పుడూ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులు చేసి, రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు చేతులెత్తేసింది. తాజా టైటిల్‌ పోరులో బౌలర్ల వైఫల్యం సైతం కాస్త కనిపించినా.. ఓవరాల్‌గా రెండు ఐసీసీ టెస్టు ఫైనల్స్‌లో బ్యాటింగ్‌ విభాగం దారుణంగా విఫలమైంది.
ఓవల్‌లో టాస్‌ భారత్‌ వశం. ప్రణాళిల ప్రకారం తొలుత ఆసీస్‌ బ్యాటింగ్‌. బౌలర్లు రాణించగా 24.1 ఓవర్లలోనే 76/3తో కంగారూ శిబిరంలో ఒత్తిడి. ఇక్కడి వరకు బాగానే నడిచినా.. ఇక్కడ్నుంచే ఐసీసీ టెస్టు గద భారత్‌కు దూరమవుతూ వచ్చింది. ట్రావిశ్‌ హెడ్‌ (163), స్టీవ్‌ స్మిత్‌ (121) నాల్గో వికెట్‌కు 285 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసి.. రోహిత్‌సేనను మానసికంగా వెనక్కి నెట్టారు. రిషబ్‌ పంత్‌ ప్రత్యర్థి జట్లకు ఇచ్చే ఝలక్‌ ది ఓవల్‌లో ట్రావిశ్‌ హెడ్‌ భారత్‌కు రుచి చూపించాడు. హెడ్‌, స్మిత్‌ భాగస్వామ్యాన్ని కట్టడి చేసి ఉంటే ఫలితం భిన్నంగా వచ్చేందుకు అవకాశాలు ఉండేవి. ఇక పిచ్‌ బ్యాటింగ్‌కు సహకరిస్తున్న సమయంలో టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలటం కొంప ముంచింది. రోహిత్‌ (15), గిల్‌ (13), పుజార (14), కోహ్లి (14) పెవిలియన్‌కు క్యూ కట్టారు. రెండో ఇన్నింగ్స్‌లోనూ పరిస్థితిలో పెద్ద మార్పు లేదు. 91/1తో మెరుగ్గా సాగుతున్న దశలో రోహిత్‌, పుజార వికెట్లతో భారత్‌పై ఒత్తిడికి అధికమైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 285 పరుగుల నాల్గో వికెట్‌ భాగస్వామ్యం ఆ జట్టును ఐసీసీ ప్రపంచ టెస్టు విజేతగా నిలుపగా.. బ్యాటర్ల సమిష్టి వైఫల్యం భారత్‌ను వరుసగా రెండోసారి రన్నరప్‌గా నిలిపింది.

Spread the love