కామన్‌వెల్త్‌ ఖర్చు భరించలేం!

– 2026 కామన్‌వెల్త్‌ క్రీడల ఆతిథ్యం వదులుకున్న విక్టోరియా
– విక్టోరియా స్టేట్‌ ప్రీమియర్‌ డానియల్‌ ఆండ్రూస్‌ ప్రకటన
– సందిగ్దంలో ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్‌ నిర్వహణ
2026 కామన్‌వెల్త్‌ క్రీడలు త్రిశంకు స్వర్గంలో పడ్డాయి!. లాస్‌ ఏంజిల్‌ ఒలింపిక్స్‌ ముంగిట జరగాల్సిన మెగా స్పోర్ట్స్‌ ఈవెంట్‌ను బిడ్డింగ్‌ రేసులో ఫేవరేట్‌గా నిలిచి దక్కించుకున్న విక్టోరియా (ఆస్ట్రేలియాలోని ఓ రాష్ట్రం).. నిర్వహణ ఖర్చు భరించలేమని ఆతిథ్య హక్కులను వదులుకుంది. గత ఏడాది రూ.1200 కోట్లతో అంచనాలు వేయగా.. ఇప్పుడు అది రూ.5000 కోట్ల వరకు చేరుకుంది. ఈ స్థాయిలో ఓ స్పోర్ట్స్‌ ఈవెంట్‌కు ఖర్చు పెట్టలేమని విక్టోరియా స్టేట్‌ ప్రీమియర్‌ డానియల్‌ ఆండ్రూస్‌ మంగళవారం ప్రకటించారు.
నవతెలంగాణ-మెల్‌బోర్న్‌
కామన్‌వెల్త్‌ క్రీడలకు గట్టి ఎదురుదెబ్బ. ఆర్థిక మందగమనం, అధిక నిర్వహణ ఖర్చుతో ఆస్ట్రేలియా (విక్టోరియా స్టేట్‌) 2026 కామన్‌వెల్త్‌ క్రీడల ఆతిథ్య బాధ్యతల నుంచి తప్పుకుంది. ఈ మేరకు విక్టోరియా స్టేట్‌ ప్రీమియర్‌ డానియల్‌ ఆండ్రూస్‌ మంగళవారం కీలక ప్రకటన చేశారు. 2022 కామన్‌వెల్త్‌ క్రీడలను బర్మింగ్‌హామ్‌ (ఇంగ్లాండ్‌) సైతం ఆలస్యంగా తీసుకుంది. మల్టీ స్పోర్ట్స్‌ ఈవెంట్‌ నిర్వహణ ప్రభుత్వాలకు భారంగా మారటం, ఓ నెల రోజుల ఈవెంట్‌ కోసం భారీ బడ్జెట్‌ను కేటాయించాల్సి రావటం ఇబ్బందిగా మారుతోంది. దీంతో 2026 కామన్‌వెల్త్‌ క్రీడల ఆతిథ్యం ఇవ్వలేమని విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. విక్టోరియా నిర్ణయంతో 2026 కామన్‌వెల్త్‌ క్రీడల నిర్వహణ సందిగ్దంలో పడింది. రెండేండ్ల కాల పరిమితితో మల్టీ స్పోర్ట్స్‌ ఈవెంట్‌ నిర్వహణ కార్యరూపం దాల్చటం కష్ట సాధ్యం. కామన్‌వెల్త్‌ క్రీడల ఫెడరేషన్‌ విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
మా వల్ల కాదు! : కామన్‌వెల్త్‌ క్రీడల ఆతిథ్యం నుంచి తప్పుకుంటున్నట్టు విక్టోరియా స్టేట్‌ ప్రీమియర్‌ (భారత్‌లో ఓ రాష్ట్ర సీఎం తరహా పదవి) డానియల్‌ ఆండ్రూస్‌ మంగళవారం ప్రకటించారు. నిర్వహణ భారం, ఖర్చు అంచనాలు భారీగా పెరగటమే ప్రధాన కారణమని డానియల్‌ వెల్లడించారు. ‘ఈ పదవిలో ఉండగా నేను ఎన్నో క్లిష్టమైన నిర్ణయాలు తీసుకున్నాను. నిజాయితీగా చెబుతున్నాను..ఇది అందులో ఒకటి ఏమాత్రం కాదు. 7 బిలియన్‌ ఆసీస్‌ డాలర్లతో మల్టీస్పోర్ట్స్‌ ఈవెంట్‌ నిర్వహించటమా? మా వల్ల కాదు. మేం చేయలేము. కామన్‌వెల్త్‌ క్రీడల నిర్వహణ కోసం పాఠశాలలు, ఆసుపత్రుల నిధుల నుంచి కోత విధించలేను. నిరుడు రూపొందించిన అంచనాలతో పోల్చితే ప్రస్తుత బడ్జెట్‌ మూడింతల కంటే ఎక్కువ. 2026లో కామన్‌వెల్త్‌ క్రీడలు విక్టోరియాలో ఉండవు. మా నిర్ణయాన్ని కామెన్‌వెల్త్‌ క్రీడల అథారిటీస్‌కు వెల్లడించాం. క్రీడల ఆతిథ్య హక్కుల ఒప్పందాన్ని రద్దు చేయమని కోరాం. నిర్వహణ ఖర్చు కుదించేందుకు అందుబాటులో ఉన్న అన్ని అంశాలు, మార్గాలు పరిశీలించాం. ఏదీ కూడా ఖర్చును తగ్గించలేకపోతుంది. ఆతిథ్య హక్కుల నుంచి తప్పుకోవటమే సరైన మార్గంగా కనిపించింది’ అని డానియల్‌ ఆండ్రూస్‌ తెలిపారు.
ఐదు వేదికలే కారణమా? : 2026 కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో 20 క్రీడల్లో, 26 క్రీడాంశాల్లో పోటీలు ఉండేలా షెడ్యూల్‌ చేశారు. విక్టోరియా రాష్ట్రంలోని ఐదు ప్రాంతీయ వేదికల్లో మెగా ఈవెంట్‌కు ప్రణాళిక రచించారు. జీలాంగ్‌, బల్లారాట్‌, బెండిగో, జిప్స్‌లాండ్‌, షెపర్టాన్‌లను గేమ్స్‌ వేదికలుగా ఎంచుకున్నారు. ఈ ఐదు వేదికల్లో సంబంధిత పోటీల స్టేడియాలు సహా ప్రత్యేకంగా అథ్లెట్స్‌ విలేజ్‌ను నిర్మించేందుకు బడ్జెట్‌ అంచనాలు వేశారు. ఈ ఐదు వేదికల్లో కాకుండా.. విక్టోరియా రాజధాని మెల్‌బోర్న్‌ వేదికగా కామన్‌వెల్త్‌ క్రీడల నిర్వహణపై ఆలోచన చేసినా.. అది కూడా వ్యయ భారంగానే మారుతుందని భావించారు. 14 నెలల క్రితమే కామన్‌వెల్త్‌ క్రీడల ఆతిథ్య హక్కులను సొంతం చేసుకున్న విక్టోరియా.. ఇంతలోనే ఆతిథ్యం నుంచి తప్పుకోవటం ఈ క్రీడల ప్రాధాన్యత పడిపోతుందనే వాదనకు బలం చేకూర్చుతుంది.
సీజీఎఫ్‌ అసంతృప్తి : కామన్‌వెల్త్‌ క్రీడల ఆతిథ్యం నుంచి తప్పుకునే నిర్ణయాన్ని ఆస్ట్రేలియా కామవెల్త్‌ సమాఖ్యకు సైతం విక్టోరియా ప్రతినిధులు మంగళవారం ఉదయమే తెలియజేశారు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌కు సైతం ఈ రోజే నిర్ణయాన్ని వెల్లడించారు. ఆతిథ్య హక్కుల రద్దుతో విక్టోరియా నుంచి జరిమానా భారీగా వసూలు చేస్తారు. అన్నింటికి సిద్ధపడే విక్టోరియా ఈ నిర్ణయం తీసుకుంది. ‘విక్టోరియా నిర్ణయం ఎంతో నిరుత్సాహానికి గురి చేసింది. నిర్వహణ కమిటీ ఫెడరేషన్‌ సలహాలకు విరుద్ధంగా కొత్త క్రీడలను చేర్చటం, వేదికలను ఎక్కువగా పెట్టడం చేసింది. 2026 కామెన్‌వెల్త్‌ క్రీడల నిర్వహణపై ఓ సొల్యూషన్‌ కనుగొనేందుకు ప్రయత్నిస్తాం’ అని కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది.
కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ఆస్ట్రేలియా, విక్టోరియా రాష్ట్ర ప్రతిపక్షాలు ఈ నిర్ణయంపై విమర్శలు గుప్పించాయి. విక్టోరియా రాష్ట్రం ప్రతిష్ట మసకబారుతుందని, స్పోర్ట్స్‌ వరల్డ్‌లో విక్టోరియాకు ఇది అతి పెద్ద అవమానమని విమర్శించారు.
తొలుత రూ.1200 కోట్లతో క్రీడల నిర్వమణకు అంచనాలు రూపొందించాం. ఇప్పుడు ఆ బడ్జెట్‌ రూ. 5 వేల కోట్లకు చేరింది. క్రీడల నిర్వహణకు ఈ స్థాయి బడ్జెట్‌ను వెచ్చించలేం. అందుకోసం స్కూల్స్‌, హాస్పిటల్స్‌ నిధులపై కోత పెట్టలేం. తొలుత ప్రతిపాదించిన రూ.1200 కోట్ల బడ్జెట్‌ను విక్టోరియా గ్రామీణ ప్రాంతాల అభివృద్దికి కేటాయిస్తున్నాం’
– డానియల్‌ ఆండ్రూస్‌,
విక్టోరియా స్టేట్‌ ఆఫ్‌ ప్రీమియర్‌

Spread the love