ప్రమాదంలో ప్రజాస్వామ్యం

– సుందరయ్య స్మారకోపన్యాసంలో ఒరిస్సా హైకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి డాక్టర్‌ ఎస్‌ మురళీధర్‌ ఆందోళన
– ఎన్నికల ప్రచారంలో మతపరమైన వ్యాఖ్యలు
– పాలకుల కనుసన్నల్లో భావప్రకటనా స్వేచ్ఛ
– కార్పొరేట్ల చేతిలో మీడియా
– వాణిజ్య ప్రకటనలపై వీహెచ్‌పీ దాడులు
”ప్రశ్నను సహించలేరు. విమర్శను భరించలేరు. పరమత సహనం, లౌకికత్వం లేనేలేవు. చివరకు టీవీల్లో వచ్చే మత సామరస్య ప్రకటనలపైనా దాడులు చేస్తున్నారు. యువతరానికి విషయం పరిజ్ఞానం లేకుండా, కేవలం మతం అనే మత్తులో ఊగేలా చేస్తున్నారు. భావప్రకటనా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు. వారు వెల్లడించిన భావాలే స్వేచ్ఛగా భావించే పరిస్థితులు కల్పిస్తున్నారు. టీవీలు, ఫోన్లలో మనం ఏ చూడాలో కూడా ఇంటర్నెట్‌ నియంత్రణ ద్వారా వారే నిర్ణయిస్తున్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయనడానికి ఇంతకంటే ఆధారాలు ఇంకేం కావాలి!!”
– జస్టిస్‌ ఎస్‌ మురళీధర్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
భారతదేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతున్నదని ఒరిస్సా హైకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు సీనియర్‌ అడ్వకేట్‌ డాక్టర్‌ ఎస్‌ మురళీధర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో నిర్భంధాలు ఎదుర్కొని, పోరాడి సాధించుకున్న రాజ్యాంగ హక్కులు కూడా నిష్ఫలం అవుతున్నాయనీ, భావప్రకటనా స్వేచ్ఛ స్వీయ నిర్భంధంలో ఉండేలా కట్టడి చేయబడుతున్నదని విశ్లేషించారు. ఆదివారంనా డిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ‘రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం- భావప్రకటనా స్వేచ్ఛ-నేటి వాస్తవాలు’ అంశంపై ఆయన పుచ్చలపల్లి సుందరయ్య 39వ స్మారకోపన్యాసం చేశారు. భవిష్యత్‌ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య అనీ, ఆయన నాయకత్వం ఎప్పుడూ పేదల పక్షానే ఉండేదని కొనియాడారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1)(ఏ) భావప్రకటనా స్వేచ్ఛను సూచిస్తుందనీ, ఈ హక్కును సాధించుకోవడానికి బీఎన్‌ రావు, కేఏ మున్షీ, కమ్యూనిస్టు నాయకుడు ఏకే గోపాలన్‌ వంటి వారిమధ్య అనేక తర్జనభర్జనలు, వాద ప్రతివాదనలు జరిపాకే ఈ ఆర్టికల్‌ దేశప్రజలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం ఈ స్వేచ్ఛకు పాలకులు సంకెళ్లు వేసారనీ, అనేక షరతులు, నిర్భంధాలు విధిస్తూ, రాజ్యాంగస్ఫూర్తిని ప్రశ్నార్థకం చేస్తున్నారని అన్నారు. హిందూ మితవాదులు భావ ప్రకటన పేరుతో ఎన్నికల సభల్లో మతాల గురించి ఇష్టానుసారం మాట్లాడుతూ, దేశంలోని మత సామరస్యానికి విఘాతం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో శివసేన అధినేత బాల్‌థాకరే అప్పట్లో ఎన్నికల సభల్లో చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ఆక్షేపిస్తూనే, ‘హిందూ’ అనే పదం మతం కాదనీ, ఆదో జీవన విధానం అంటూ కామెంట్‌ చేసిందని గుర్తుచేశారు. దీన్ని అడ్డుపెట్టుకొని ప్రస్తుత ఎన్నికల సభల్లో హిందూ శక్తులు ఇతరుల్ని రెచ్చగొట్టేలా ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నాయన్నారు. ఇది ప్రజాస్వామ్య, లౌకికత్వానికి సరైంది కాదని చెప్పారు. సుప్రీం కామెంట్స్‌ను సరిదిద్దేలా అప్పటి నుంచీ ప్రయత్నాలు జరుగుతున్నా, ఇప్పటికీ కొలిక్కిరాలేదని తెలిపారు. భావప్రకటనా స్వేచ్ఛలో భాగమైన మీడియాను ఇప్పుడు ప్రభుత్వాలు, కార్పొరేట్లు, రాజకీయపార్టీలు నియంత్రిస్తున్నాయని వివరించారు. రిలయన్స్‌ సంస్థ చేతిలో 700 ఛానల్స్‌ ఉన్నాయనీ, దూరదర్శన్‌ ఇప్పటికీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉందని ఉదహరించారు. టీవీ చర్చలన్నీ మోడీకి అనుకూలంగా జరుగుతున్నాయనీ, బీబీసీ వంటి విదేశీ మీడియా కూడా ఆయన్ని ప్రశ్నించలేని స్థితిలో ఉన్నదని చెప్పారు. ప్రశ్నిస్తే ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు జరుగుతున్నాయనీ, ప్రబీర్‌ పుర్కాయస్థ, సిద్దిక్‌ థాపర్‌ వంటి వాళ్లపై అనేక కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని గుర్తుచేశారు. టీవీలో వాణిజ్య ప్రకటనలు కూడా నైతికత లేకుండా ఉంటున్నాయన్నారు. ఎక్కడైనా మత సామరస్యాన్ని చూపిస్తూ వాణిజ్య ప్రకటనలు వస్తే, విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) వంటి సంస్థలు దాడులకు తెగబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సంస్కృతి, సంప్రదాయాలు, మత విశ్వాసాలను నియంత్రిస్తూ, శాసిస్తూ వీహెచ్‌పీ వంటి సంస్థలు ఇప్పుడు అన్నిరంగాల్లోకి చొరబడుతున్నాయని చెప్పారు. ఎమ్‌ఎఫ్‌ హుస్సేన్‌, కబీర్‌ కళామంచ్‌, మహ్మద్‌ జుబేర్‌ వంటి కళాకారులపై కూడా కేసులు పెట్టి వేధించిన చరిత్రను చూస్తూనే ఉన్నామన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు, మణిపూర్‌ అల్లర్ల సమయంలో ఇంటర్నెట్‌ సేవలు సహా అన్నీ నిలిపేసి, మీడియాపై ఆంక్షలు విధించి, అక్కడ ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి తెలియకుండా చేశారని విమర్శించారు. దళితులు భావప్రకటనా స్వేచ్ఛను వెల్లడించకుండా, వారిపై నిర్భంధాలు, దాడులు చేస్తున్నారని వివరించారు. సెల్‌ఫోన్లలో ఇంటర్నెట్‌ను కూడా నియంత్రిస్తూ, మనం ఏం చూడాలో కూడా వారే నిర్ణయిస్తున్నారనీ, ఇంతకంటే అన్యాయం ఇంకేం ఉందని ప్రశ్నించారు. ప్రజలకు అందే వార్తలు ఏవీ కూడా పూర్తి ఉచితం కాదనీ, యాడ్‌ ఫ్రీ పేరుతో మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారని తెలిపారు.
చదువుకున్న యువతరం విషయ అవగాహన లేకుండా, గ్రూపులుగా విభజించి కేవలం మతం అనే ఉచ్చుతో, దేశభవిష్యత్‌ను పణంగా పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారనీ, దీనివెనుక రాజకీయ కుట్రకోణాలు ఉన్నాయని వివరించారు. డీప్‌ ఫేక్‌ న్యూస్‌తో ఇలాంటి ప్రచారాలను మరింత విస్త్రుతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఆర్టికల్‌ 19(1)(ఏ) వాక్‌ స్వాతంత్య్రం, హక్కులు సాధించుకున్నామనీ, అయితే ప్రశ్నలు, విమర్శల్ని సహించలేని స్థితిలోకి నెట్టివేయబడుతున్నామని అన్నారు. ఇది ప్రజా ఐక్యత, భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కల్పిస్తుందని విశ్లేషించారు. ఆయన ప్రసంగం మొత్తం పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా, పూర్తి ఆధారాలు, వీడియోలను చూపిస్తూ ఆసక్తిగా సాగింది. ఆయన ప్రసంగాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి తెలుగులోకి అనువాదం చేశారు. అంతకుముందు సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్ట్‌ సభ్యులు జీ బుచ్చిరెడ్డి అతిధులను వేదికపైకి ఆహ్వానించారు. మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌ వినయకుమార్‌ నివేదిక సమర్పించారు. ఎస్వీకే ట్రస్ట్‌ అధ్యక్షులు బీవీ రాఘవులు ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం స్మారకోపన్యాస కర్త డాక్టర్‌ ఎస్‌ మురళీధర్‌ను సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Spread the love