భారత్‌కు భారీ జరిమానా

–  వంద శాతం మ్యాచ్‌ ఫీజు కోత
–  గిల్‌కు అదనంగా 15 శాతం కోత
–  డబ్ల్యూటీసీ ఫైనల్లో
–  స్లో ఓవర్‌రేట్‌పై ఐసీసీ కొరడా
లండన్‌ : వరుసగా రెండోసారి ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో గదకు దూరమైన టీమ్‌ ఇండియా.. తాజా టైటిల్‌ పోరులో మ్యాచ్‌ ఫీజును సైతం పోగొట్టుకుంది. భారత్‌, ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ ఫైనల్లో నాలుగు రోజుల ఆట అదనంగా అర గంట పాటు సాగింది. ఏ ఒక్క రోజు 90 ఓవర్ల కోటా పూర్తి కాలేదు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌ కమిటీ (ఐసీసీ) క్రమశిక్షణ నియామవళి కొరడా ఝులిపించింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం భారత్‌ ఐదు ఓవర్ల ఆలస్యంగా ఉండగా.. ఆస్ట్రేలియా నాలుగు ఓవర్లు ఆలస్యం చేసింది. నిబంధనల ప్రకారం ఓవర్‌కు 20 శాతం మ్యాచ్‌ ఫీజులో జరిమానా విధిస్తారు. ఈ లెక్కన భారత క్రికెటర్లు వంద శాతం మ్యాచ్‌ ఫీజును జరిమానా రూపంలో కోల్పోగా.. ఆస్ట్రేలియా క్రికెటర్లు 80 శాతం మ్యాచ్‌ ఫీజును జరిమానాగా చెల్లించనున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్‌పై ఆసీస్‌ 209 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.
     గిల్‌కు డబుల్‌ స్ట్రోక్‌ : భారత యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌కు ఐసీసీ డబుల్‌ స్ట్రోక్‌ ఇచ్చింది. స్లో ఓవర్‌ రేటు కారణంగా సహచర ఆటగాళ్లతో పాటు వంద శాతం మ్యాచ్‌ ఫీజు జరిమానాగా కోల్పోయిన గిల్‌.. మ్యాచ్‌ అధికారుల నిర్ణయంపై బాహాటంగా విమర్శలు చేసినందుకు అదనంగా మరో 15 శాతం మ్యాచ్‌ ఫీజును జరిమానాగా చెల్లించాల్సి వచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ క్యాచ్‌ను స్లిప్స్‌లో కామెరూన్‌ గ్రీన్‌ అందుకున్నాడు. సాఫ్ట్‌ సిగల్‌ ఇవ్వకుండా ఫీల్డ్‌ అంపైర్లు నేరుగా టీవీ అంపైర్‌ను సంప్రదించారు. గిల్‌ను క్యాచౌట్‌గా టీవీ అంపైర్‌ ప్రకటించాడు. అవుట్‌ ఇచ్చినా క్రీజు వదిలేందుకు ఇష్టపడిన గిల్‌.. ఆ తర్వాత సోషల్‌ మీడియా వేదికగా ఆ క్యాచ్‌ ఫోటోలను జత చేస్తూ ఎమోజీలు పోస్ట్‌ చేశాడు. ఆర్టికల్‌ 2.7 ప్రకారం మ్యాచ్‌ అధికారుల నిర్ణయం పట్ల బహిరంగ విమర్శలు చేసినందుకు గిల్‌పై ఐసీసీ మ్యాచ్‌ ఫీజులో మరో 15 శాతం జరిమానా విధించింది. శుభ్‌మన్‌ గిల్‌ పొరపాటును అంగీకరించటంతో ఈ అంశంలో తదుపరి విచారణ ఉండదని ఐసీసీ వెల్లడించింది.

Spread the love