క్రీడా సంబురం ముగిసె!

– ఓవరాల్‌ చాంప్స్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి
 – విజేతలకు నగదు బహుమతి అందజేత
– ముగిసిన సిఎం కప్‌ 2023 పోటీలు
నవతెలంగాణ-హైదరాబాద్‌
మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పది రోజుల పాటు పండుగ వాతావరణంలో జరిగిన సిఎం కప్‌ 2023 పోటీలు ఘనంగా ముగిశాయి. 18 క్రీడాంశాల్లో 7500 మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో పోటీపడ్డారు. అథ్లెటిక్స్‌, ఆర్చరీ, బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, వాలీబాల్‌, కబడ్డీ, బాస్కెట్‌బాల్‌, హాకీ, ఖోఖో, బాక్సింగ్‌, రెజ్లింగ్‌, షూటింగ్‌, స్విమ్మింగ్‌, టెన్నిస్‌లో 33 జిల్లాల జట్లు పతకాల వేట సాగించగా.. అత్యధిక మెడల్స్‌తో హైదరాబాద్‌ (మెన్స్‌), రంగారెడ్డి (ఉమెన్స్‌) ఓవరాల్‌ చాంపియన్స్‌గా నిలిచాయి. ఎల్బీ స్టేడియంలో బుధవారం జరిగిన ముగింపు వేడుకలో హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, శాట్స్‌ చైర్మెన్‌ ఆంజనేయ గౌడ్‌ విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు ప్రదానం చేశారు. మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి (సరూర్‌ నగర్‌), కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి (జింఖాన), విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి (గచ్చిబౌలి), శాట్స్‌ చైర్మెన్‌ ఆంజనేయ గౌడ్‌ (యూసుఫ్‌గూడ), మేయర్‌ విజయలక్ష్మి (హెచ్‌సియు)లు విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు.
నగదు బహుమతి ప్రదానం : సిఎం కప్‌ రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు, జట్లు ట్రోఫీలతో పాటు నగదు బహుమానం దక్కించుకున్నాయి. జట్టు విభాగంలో పసిడికి రూ. 1 లక్ష, సిల్వర్‌కు రూ.75 వేలు, కాంస్యానికి రూ.50 వేలు అందించారు. వ్యక్తిగత విభాగంలో పసిడి విజేతకు రూ.25 వేలు, రజతానికి రూ.15 వేలు, కాంస్యానికి రూ.10 వేలు ప్రైజ్‌మనీ ప్రదానం చేశారు. 18 క్రీడాంశాల్లో పతక విజేతలు నగదు బహుమానం దక్కించుకున్నారు.
ఓవరాల్‌ చాంప్స్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి : సిఎం కప్‌ రాష్ట్ర స్థాయి పోటీల ఓవరాల్‌ చాంపియన్‌గా మెన్స్‌, ఉమెన్స్‌ విభాగాల్లో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా జట్లు నిలిచాయి. మెన్స్‌ విభాగంలో (జట్టు, వ్యక్తిగత) హైదరాబాద్‌ జిల్లా జట్లు 98 పతకాలు సాధించగా, రంగారెడ్డి (56), మేడ్చల్‌ మల్కాజిగిరి (41) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. మహిళల విభాగంలో రంగారెడ్డి (49), హైదరాబాద్‌ (36), మేడ్చల్‌ మల్కాజిగిరి (31) టాప్‌-3లో నిలిచాయి.
పతక విజేతల వివరాలు : బాస్కెట్‌బాల్‌లో మేడ్చల్‌ మల్కాజిగిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి (మహిళలు) తొలి మూడు స్థానాల్లో నిలువగా.. హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి (పురుషులు) టాప్‌-3 స్థానాలు సాధించాయి. హాకీ (మెన్స్‌)లో సంగారెడ్డి, నిజామాబాద్‌, హైదరాబాద్‌ జట్లు పతకాలు సాధించాయి. షూటింగ్‌ (మెన్స్‌)లో ఆషుతోశ్‌ కుమార్‌, అవినాశ్‌, సాకెత్‌లు రైఫిల్‌ విభాగంలో పతకాలు సాధించారు. మహిళల రైఫిల్‌ విభాగంలో అఖిల, అక్షిత, అవిక మెడల్స్‌ కొట్టారు. పిస్టల్‌ ఈవెంట్‌లో జయ తేజ, వివి జయంత్‌, కౌశిక్‌లు.. మహిళల్లో ఆర్‌ఈపి సరయు, స్రవంతి, వైష్ణవిలు గెలుపొందారు. ఓపెన్‌సైట్‌లో (మెన్స్‌) రిషికి రెడ్డి, రాజమహేందర్‌, లోహిత్‌లు.. మహిళల్లో సయేద ఫహ్‌మీనా నజ్‌నీన్‌, భన్విత, రేవతి పతకాలు నెగ్గారు. కబడ్డీ (మెన్స్‌) ఫైనల్లో సూర్యపేటపై రంగారెడ్డి గెలుపొందగా.. మహిళల ఫైనల్లో రంగారెడ్డిపై నల్గొండ గెలుపొందింది. బాక్సింగ్‌ 48 కేజీల విభాగంలో నితిన్‌ కుమార్‌, ఆదేశ్‌, నిఖిల్‌.. 54 కేజీల విభాగంలో బిలాల్‌, ముకేశ్‌, అర్బాజ్‌.. 57 కేజీల విభాగంలో పూర్విక్‌, వినరు భాస్కర్‌, మాలిక్‌.. 60 కేజీల విభాగంలో తరుణ్‌ యాదవ్‌, చందు, విష్ణు వర్దన్‌ వరుసగా పసిడి, సిల్వర్‌, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. హ్యాండ్‌బాల్‌ (ఉమెన్స్‌)లో రంగారెడ్డి, హైదరాబాద్‌, వరంగల్‌ విజేతలుగా నిలువగా.. మెన్స్‌లో హైదరాబాద్‌, హన్మకొండ, వరంగల్‌ జట్లు ట్రోఫీలు దక్కించుకున్నాయి.

Spread the love