– నేడు కరాచీలో క్రికెట్ పెద్దల సమావేశం
దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసిసి) రానున్న వన్డే వరల్డ్‌కప్‌పై నెలకొన్న సందిగ్థతకు తెరదించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనబోమని ఇటీవల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) చైర్మెన్ నజం సేథి వ్యాఖ్యానించగా.. ఐసీసీ ఉన్నతాధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో నిమగమయ్యారు. ఐసీసీ చైర్మెన్ గ్రెగ్ బార్ల్కే, సీఈవో జెఫ్ అలార్డైస్‌లు రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం కరాచీకి చేరుకోనున్నారు.2023 ఆసియా కప్ నిర్వహణపై కొనసాగుతున్న సందిగ్థత.. వన్డే వరల్డ్‌కప్‌పై ప్రభావం చూపుతుంది. ఆసియా కప్ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వద్ద ఉన్నాయి. భద్రత, ద్వైపాక్షిక సంబంధాల కారణంగా భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించదని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. ఆసియా కప్‌తో ప్రసార, టికెట్ సొమ్ము ఖాతాలో వేసుకునేందుకు ఎదురుచూస్తున్న పిసిబి.. పాక్ గడ్డపై లీగ్ దశ మ్యాచులైనా నిర్వహించాలనే పట్టుదల చూపిస్తుంది. అందుకు హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చింది. భారత జట్టు ఆడే మ్యాచులను పాక్ ఆవల నిర్వహించటం, మిగతా మ్యాచ్‌లను పాకిస్థాన్‌లో జరుపటం. రెండోది.. భారత్ మినహా ఇతర జట్లు ఆడే లీగ్ దశ మ్యాచులను పాకిస్థాన్‌లో నిర్వహించి.. భారత మ్యాచులు, ఫైనల్‌ను తటస్థ వేదికపై ఏర్పాటు చేయటం. ఇందులో తొలి ప్రతిపాదన ఇప్పటికే తిరస్కారానికి గురైంది. రెండో ప్రతిపాదనపై ఇటీవల అహ్మదాబాద్‌లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశంలో బంగ్లాదేశ్, అఫ్ఘనిస్థాన్, శ్రీలంక క్రికెట్ బోర్డులతో జై షా చర్చించారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఆసియా కప్ కోసం భారత జట్టు పాక్ పర్యటనకు నిరాకరించటంతో.. వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ జట్టు సైతం భారత పర్యటనకు రాబోదని పిసిబి పేచి పెట్టింది. ఈ విషయంలో పిసిబి పెద్దలతో చర్చలు జరిపేందుకు ఐసీసీ చైర్మెన్, సీఈవో నేడు కరాచీని రానున్నారు. 2025 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ సొంతం చేసుకుంది. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడేందుకు పాకిస్థాన్ జట్టు భారత్‌కు వస్తే.. ప్రతిఫలంగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఆడేందుకు భారత జట్టును పాకిస్థాన్‌కు రప్పిస్తామనే హామీ ఐసీసీ నుంచి లభించే అవకాశం కనిపిస్తోంది. ఆసియా కప్ షెడ్యూల్ ఈ వారంలో వెలువడే అవకాశం ఉండగా.. వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్, వేదికల వివరాలను జూన్ 7-11న ప్రకటించనున్నారు.