సిఎం కప్‌తో గ్రామీణ ప్రతిభకు పట్టం

– అట్టహాసంగా సిఎం కప్‌ ఆరంభ వేడుక
నవతెలంగాణ-హైదరాబాద్‌
సిఎం కప్‌ 2023 టోర్నీతో యువత చాంపియన్లుగా నిలిచే సువర్ణా వకాశం లభించిందని, మూడు అంచెల్లో జరిగిన సిఎం కప్‌ పోటీలతో గ్రామీణ క్రీడాకారుల ప్రతిభకు పట్టం కట్టామని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్‌) చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌ అన్నారు. శాట్స్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న సిఎం కప్‌ రాష్ట్ర స్థాయి పోటీల ఆరంభ వేడుకలు సోమవారం ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగాయి. 33 జిల్లాల నుంచి 7500 మంది క్రీడాకారులు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, అధికారులు ఆరంభ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాలతో 33 జిల్లాల క్రీడాకారులు మార్చ్‌ఫాస్ట్‌లో ఆకట్టుకున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సాగిన సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడాకారులను విశేషంగా అలరించాయి. తెలంగాణ జానపదాలకు క్రీడాకారులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. తెలంగాణ క్రీడా ప్రగతి, ఘన కీర్తి చాటుతూ సాగిన పాటకు సంప్రదాయ నృత్య కళాకారుల ప్రదర్శన ఆరంభ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
అధికారికంగా ఆరంభం : సిఎం కప్‌ రాష్ట్ర స్థాయి పోటీలు ఆదివారమే లాంఛనంగా ఆరంభమయ్యాయి. శనివారమే జిల్లాల నుంచి క్రీడాకారులు హైదరాబాద్‌కు చేరుకోగా.. ఆదివారం ఉదయం సెషన్లో డ్రా, సాయంత్ర సెషన్లో పోటీలు ప్రారంభించారు. సోమవారం ఉదయం సెషన్లో సైతం పోటీలు జరిగాయి. సాయంత్రం ఎల్బీ స్టేడియంలో జరిగిన ఆరంభ వేడుకలకు ఆరు స్టేడియాల్లో పోటీపడుతున్న క్రీడాకారులు తరలి వచ్చారు. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ సిఎం కప్‌ రాష్ట్ర స్థాయి పోటీలను అధికారికంగా ప్రారంభిస్తున్నట్టు ప్రకటిం చారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, కార్పోరేషన్ల చైర్మెన్లు, శాట్స్‌ ఉన్నతాధికారులు, కోచ్‌లు తదితరులు హాజరయ్యారు.

Spread the love