బజారు వ్యక్తిలా వ్యవహరిస్తున్న ప్రధాని

– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
– కాళేశ్వరం సొమ్మును కక్కిస్తాం
– మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
– నా సేవను శంకించే స్థాయిలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు లేరు : ఎమ్మెల్యే జారె
– సేవా దృక్పథంతోనే పోటీ చేస్తున్నా
– కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం
నవతెలంగాణ-దమ్మపేట
భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడి చిల్లర మాటలు మాట్లాడుతూ బజారు వ్యక్తిలా వ్యవహరిస్తున్నారని, దేశంలో మతాల మధ్య చిచ్చుపెట్టి భావోద్వేగాలను రెచ్చగొట్టి ఐక్యతతో ఉన్న ప్రజలను విడగొట్టి విభజన చేసి విషప్రచారాలు చేయడమే కాకుండా రాముణ్ణి సైతం బ్యాలెట్‌ బాక్స్‌ దగ్గరకి తీసుకువచ్చే ప్రయత్నం నిస్సిగ్గుగా చేస్తున్నారని బీజేపీపై రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం దమ్మపేట మండలం వడ్లగూడెం గ్రామంలో అశ్వారావుపేట నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే హిందు మహిళల మంగళసూత్రాలను తీసుకొని, హిందువుల ఆస్తులను ముస్లిములకు పంచిపెడతారని బీజేపీ నరేంద్రమోడి దిగజారుడు రాజకీయ విమర్శలు చేస్తున్నారని దీనికి కారణం ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అత్యధిక సీట్లు గెలవడం ఖాయమని రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని జనం నాడి తెలుసుకున్న ప్రధాని చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఒక ప్రధాని దేశ చరిత్రలో ఈ విధంగా మాట్లాడటం ఎన్నడూ చూడలేదని తెలిపారు. రైతు భరోసా మరో రెండు వేల కోట్ల రూపాయలు రైతులకు అందజేస్తే రైతు భరోసా కార్యక్రమం పూర్తవుతుందని వచ్చే నెల మొదటి వారంలో ఖచ్చితంగా అమలు చేస్తామని తెలియజేశారు. రామసహాయం రఘురామరెడ్డి సౌమ్యుడు, మృధుస్వభావి, వివాద రహితుడని అనేక దశాబ్దాలుగా ఆ కుటుంబానికి కాంగ్రెస్‌తో అవినాభావ సంబంధం ఉన్నదని ఇప్పటికే ఖమ్మం కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థి రామసహాయానికి సీపీఐ(ఎం), సీపీఐ, తెలుగుదేశం, టీజేఎస్‌ ఇతర ప్రజా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయని, గెలుపు ఖాయమని, మెజార్టి ఎక్కువ వస్తేనే తామంతా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని వివరించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనకు అత్యంత సన్నిహితుడని ఓడిపోయిన బాధలో ఉన్నారని తాను కేసీఆర్‌ను ఇంతవరకు విమర్శించలేదని అయినప్పటికీ ఆయన వ్యవహరించే తీరు మాట్లాడే మాటలు పసికూనగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం పై ఆయన చేసే విమర్శలు సహేతుకంగా లేవని ఆయన మాజీ ముఖ్యమంత్రిగా తన గౌరవాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రెవిన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కుంగుడు కాళేశ్వరం ప్రాజెక్టు దానిపై దోచుకున్న లక్షన్నర కోట్లు ఎట్టి పరిస్థితుల్లో కక్కిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని, అశ్వారావుపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రామసహాయంకు అత్యధిక ఓట్ల మెజారీటీ రావాలని అందుకు అనుగుణంగా కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ తాను కళ్యాణలకిë చెక్కులను పంపిణీ చేస్తూ ఉంటే బిఆర్‌యస్‌ పార్టీ నాయకులకు సంస్కార విమర్శలు చేస్తున్నారని తన సేవాదృక్పధాన్ని విమర్శించి నైతిక హక్కు బీఆర్‌యస్‌ నాయకులకు లేదని ఘాటుగా విమర్శించారు. రామ సహాయంకు అశ్వారావుపేట నియోజకవర్గంలో 50 వేల ఓట్లు పై చిలుకు మెజార్టి రావడానికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని కార్యకర్తలు అందరూ తనకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి మాట్లాడుతూ తమకుటుంబం ఖమ్మంజిల్లా, కూసుమంచి మండలం, చేగొమ్ము గ్రామానికి చెందిందని తాను నాన్‌ లోకల్‌ అని ప్రచారం చేస్తున్నారని తాను ఖమ్మం బిడ్డనేనని కేవలం సేవా దృక్పథం తోనే తాను కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ నుండి పోటీ చేస్తున్నానని అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలందరూ తనను మనస్పూర్తిగా ఆశీర్వదించి ఈ ప్రాంతంలో ఎక్కువ ఓట్లు మెజార్టీ తీసుకురావాలని కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో విద్య, మౌలిక వసతుల కార్పోరేషన్‌ చైర్మన్‌ మువ్వా విజరుబాబు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిడమర్తి రవి తో పాటు అశ్వారావుపేట నియోజకవర్గంలోని 5 మండలాల కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తతతో పాటు సీపీిఐ, టీడీపీ, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love