త్రిపుర క్రికెట్‌ కన్సల్టెంట్‌గా లాన్స్‌ క్లూసెనర్‌

– 100 రోజుల పాటు అన్ని జట్లకు శిక్షణ
అగర్తల : దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ లాన్స్‌ క్లూసెనర్‌ భారత దేశవాళీ క్రికెట్‌లో త్రిపురకు కన్సల్టెంట్‌గా పని చేయనున్నాడు. ఈ శనివారం అగర్తల రానున్న క్లూసెనర్‌.. త్రిపుర రంజీ జట్టుతో పాటు మహిళల, ఏజ్‌ గ్రూప్‌ జట్లకు శిక్షణ ఇవ్వనున్నాడు. ఈ మేరకు త్రిపుర క్రికెట్‌ సంఘం (టిసిఎ) ఉపాధ్యక్షుడు తిమిర్‌ చందా తెలిపారు. లాన్స్‌ క్లూసెనర్‌ రానున్న సీజన్లో 100 రోజల పాటు త్రిపుర క్రికెట్‌ జట్లతో పని చేయనున్నాడు. ‘టిసిఎ వెబ్‌సైట్‌లో కొన్ని రోజుల క్రితం కన్సల్టెంట్‌ కోచ్‌ కోసం ప్రకటన పెట్టాం. డేవ్‌ వాట్‌మోర్‌తో పాటు లాన్స్‌ క్లూసెనర్‌ దరఖాస్తు చేశారు. వాట్‌మోర్‌ కుటుంబ కారణాలతో వెనక్కి తగ్గినా.. క్లూసెనర్‌ త్రిపురతో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపించారు’ అని తిమిర్‌ చందా తెలిపాడు. 1999 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు చేరిన దక్షిణాఫ్రికా జట్టులో లాన్స్‌ క్లూసెనర్‌ (51) సభ్యుడు. దక్షిణాఫ్రికా తరఫున 49 టెస్టులు, 171 వన్డేలు ఆడాడు. త్రిపుర జట్టుకు వృద్దిమాన్‌ సాహా నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Spread the love