నన్ను క్షమించండి..ప్రజలతో కేటీఆర్

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ‘తంగళ్ళపల్లి ప్రజలకు నా మీద కోపం వచ్చినట్లుగా ఉంది. మొన్నటి ఎన్నికల్లో కొంచెం మెజార్టీ తగ్గించారు. నేను తెలిసో తెలియకో తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని తంగళ్లపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ… రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు, కౌలు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. మహిళలకు రూ. 2500, రూ.4 వేల పెన్షన్, తులం బంగారం, స్కూటీలని రేవంత్ రెడ్డి చెప్పారని… కానీ అధికారంలోకి వచ్చాక వీటిని మరిచిపోయారని విమర్శించారు. రంగుల కలలాంటి సినిమాను చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఈ ఐదు నెలల్లోనే ప్రజలందరికీ అన్ని విషయాలు అర్థమయ్యాయని… రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అన్ని వర్గాల కూడా కోపంతో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ వాళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన అబద్దాలనే ఇంకా చెబుతున్నారన్నారు. ఆరు గ్యారంటీల్లో ఐదు పూర్తి చేసినట్లు ఇప్పటికీ రేవంత్ రెడ్డి బొంకుతున్నారని… కానీ మహిళలకు రూ.2500? రూ.4 వేల పెన్షన్, రైతు భరోసా వచ్చాయా? అని ప్రశ్నించారు. ఊసరవెళ్లి రంగులు మార్చినట్లు రుణమాఫీపై తేదీలు మార్చుతున్నారని విమర్శించారు. ఈ 4 నెలల్లో రేవంత్ రెడ్డి చేసింది… చేస్తోంది దేవుడి మీద ఒట్లు… కేసీఆర్ మీద తిట్లు అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 10 నుంచి 12 సీట్లు ఇవ్వాలని… అప్పుడు కేసీఆర్ రాజకీయాలను శాసిస్తారన్నారు.

Spread the love