అమెరికాలో పోలీసుల కర్కశత్వం.. నల్లజాతీయుడు మృతి

నవతెలంగాణ – వాషింగ్టన్‌ : 2020లో మినియాపోలిస్‌ నగరంలో పోలీసుల కర్కశత్వానికి ఆఫ్రో-అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణించిన విషయం తెలిసిందే. ఈ తరహా ఘటనే అమెరికాలో మరోసారి చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఒహైయో పోలీసుల బాడీకామ్‌ దశ్యాలు వెలుగులోకి రావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు పేరు ఫ్రాంక్‌ టైసన్‌ (53). అతడు కారు ప్రమాదం కేసులో అనుమానితుడు. ప్రమాదం అనంతరం ఒక బార్‌లోకి పారిపోయాడని గుర్తించిన పెట్రోలింగ్‌ అధికారులు టైసన్‌ను అదుపులోకి తీసుకొనే ప్రయత్నం చేశారు. వారు తనను చంపడానికి వస్తున్నారంటూ టైసన్‌ కేకలు వేయడం ఆ వీడియో వినిపిస్తుంది. ఆ తర్వాత పోలీసులు అతడిని కిందకు పడేసి, చేతికి బేడీలు వేశారు. ఒక అధికారి అతడి మెడపై మోకాలితో అదిమిపట్టాడు. ఈ క్రమంలో టైసన్‌ ”నేను ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను” అని అతడు మొత్తుకుంటున్నా వినిపించుకోలేదు. కొద్దిసేపటికి టైసన్‌లో ఎలాంటి చలనం కనిపించపోవడంతో పోలీసులు అతడికున్న బేడీలు తీసి, సీపీఆర్‌ చేశారు. తర్వాత స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం అతడు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణకు ఆదేశించారు.

Spread the love