నవతెలంగాణ- హైదరాబాద్: ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు ఎయిమ్స్ కు చెందిన ఐదుగురు సభ్యుల మెడికల్ బోర్డు ధ్రువీకరించింది. టైప్-2 డయాబెటీస్‌తో బాధపడుతున్న కేజ్రీ ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ఎయిమ్స్‌కు చెందిన మెడికల్ బోర్డు శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. ప్రస్తుతం కేజ్రీ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు ధ్రువీకరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సుమారు అరగంట పాటు సీఎంతో మాట్లాడిన ఎయిమ్స్ వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు సదరు కథనాలు తెలిపాయి. మెడిసిన్‌లో మార్పులు చేయాల్సిన అవసరం లేదని, రెండు యూనిట్ల ఇన్సులిన్ డోసును కొనసాగించాలని సూచించినట్లు సదరు కథనాలు వెల్లడించాయి. వారం తర్వాత ఈ బృందం మరోసారి సీఎంను పరీక్షించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు తెలిసింది.